Kapildev @ Merwe | 1983 ప్రపంచకప్ ఫైనల్లో కనిపించిన దృశ్యం.. ప్రస్తుతం జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌లో మరోసారి ఆవిష్కృతమైంది. ఆనాటి మ్యాచ్‌లో కపిల్‌దేవ్ రివర్స్‌లో పరిగెత్తుతూ వివియన్ రిచర్డ్స్ క్యాచ్ పట్టి వెస్టిండీస్ ప్రస్థానాన్ని ముగించిన మాదిరిగానే.. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో అదే తరహాలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మెన్ డేవిడ్ మిల్లర్ క్యాచ్‌ను నెదర్లాండ్ ఆల్‌రౌండర్ మెర్వ్ అందుకుని సౌతాఫ్రికాను ఇంటికి పంపాడు. ఈ క్యాచే దక్షిణాఫ్రికా ఆటను ప్రభావితం చేయడమే కాకుండా వరల్డ్ కప్ నుంచి దక్షిణాఫ్రికా నిష్క్రమించేలా చేసింది.
దక్షిణాఫ్రికాలో పుట్టి నెదర్లాండ్స్ తరఫున ఆడుతున్న ఈ 37 ఏండ్ల ఆల్ రౌండర్ రోల్ఫ్ వాన్ డెర్ మెర్వే.. దక్షిణాఫ్రికానే వరల్డ్ కప్ నుంచి బయటకు పంపించేలా చేయడం ఈ మ్యాచ్ విశిష్టతగా చెప్పుకోవాలి. దక్షిణాఫ్రికా 4 వికెట్లకు 90 స్కోర్ వద్ద ఉన్న సమయంలో జట్టును విజయతీరాలను నడిపించే బాధ్యత మిల్లర్ నెత్తిన పడింది. 17 బంతుల్లో 17 పరుగులతో ఉన్న మిల్లర్ ఇచ్చి క్యాచ్‌ను మెర్వే వెనక్కి పరిగెత్తుతూ పట్టుకున్నాడు. మిల్లర్ అవుట్ అయిన తర్వాత హెన్రిచ్ (21), కేశవ్ మహారాజ్ (13) పరుగులకే ఔట్ కావడంతో దక్షిణాఫ్రికా ఓటమి ఖాయమైంది.
ఈ క్యాచ్ అచ్చం 1983 వరల్డ్ కప్ ఫైనల్స్‌లో మంచి ఫాంలో ఉన్న వివియన్ రిచర్డ్స్ ఇచ్చిన క్యాచ్‌ను ఒడిసిపట్టుకుని ఔట్ చేసిన కపిల్‌దేవ్‌ను గుర్తుకుచేసింది. ఈ విషయం కామెంటరేటర్లు చెప్పగా తెలుసుకున్న క్రికెట్ ప్రేమికులు ఒక్కసారిగా కపిల్.. కపిల్.. అంటూ నినాదాలు చేశారు. కపిల్ క్యాచ్ కారణంగానే ఫైనల్లో క్లైవ్ లాయిడ్ నేతృత్వంలోని వెస్టిండీస్‌ను టీమిండియా ఓడించింది. ఈ క్యాచ్ తర్వాతే భారత్ తొలిసారి వన్డే ప్రపంచకప్‌ను గెలుచుకుంది.