IPL Auction 2024: భారత క్రికెట్‌కు కాసుల వర్షం కురిపిస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో మంగళవారం ముగిసిన వేలం పలువురు అనామక క్రికెటర్లను కోటీశ్వరులను చేసింది. తమ జీవితకాలంలో ఇంత డబ్బును కలలోనైనా చూస్తామా..? అనుకునే విధంగా నిరుపేద క్రికెటర్లపై డబ్బువర్షం కురిపించింది. ప్రతి సీజన్లోనూ ఫ్రాంచైజీలు సాధారణ క్రికెటర్లను కోటీశ్వరులను చేసినట్టే ఈ సీజన్లో కూడా అదేబాట పట్టాయి. వేలంలో రాజస్తాన్ రాయల్స్ రూ. 5.80 కోట్లతో దక్కించుకున్న బ్యాటర్ శుభమ్ దూబే ఈ జాబితాలో మొదటివరుసలో నిలుచునే క్రికెటర్..
ఎవరీ దూబే..
మహారాష్ట్రలోని విదర్భ తరఫున ఆడుతున్న దూబే స్వస్థలం నాగ్‌పూర్. అతడిది దిగువ మధ్యతరగతి కుటుంబం. దూబే తండ్రి బద్రిప్రసాద్ దూబే స్థానికంగా పాన్ షాపు నిర్వహిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. చిన్నప్పట్నుంచి క్రికెట్ మీద మక్కువ పెంచుకున్న శుభమ్.. ఇదే కెరీర్ అనుకుని ఎన్ని కష్టాలు వచ్చినా ఎదుర్కుని ఇవాళ టాక్ ఆఫ్ ది ఐపీఎల్లో ఒకడిగా ఎదిగాడు.
29 ఏండ్ల దూబే.. స్థానికంగా టోర్నీలు ఆడుతున్నా దేశవాళీలో ఎంట్రీ ఇచ్చింది మాత్రం రెండేండ్ల క్రితమే. 2021లో నిర్వహించిన సయ్యిద్ ముస్తాక్ అలీ ట్రోఫీ (స్మాట్) లో భాగంగా మణిపూర్‌తో జరిగిన మ్యాచ్‌లో అరంగేట్రం చేశాడు. ఇప్పటివరకూ 20 టీ20లు ఆడిన అతడు.. 37.30 సగటుతో 485 పరుగులు సాధించాడు. బంతిని బాదడంలో తనదైన నైపుణ్యం సాధించిన దూబే.. ఫినిషర్‌గా గుర్తింపు దక్కించుకున్నాడు. ఈ ఏడాది ముగిసిన స్మాట్ లో దూబే.. ఏడు మ్యాచ్‌లలో 222 పరుగులు చేసి అందరి దృష్టిలో పడ్డాడు. ఈ టోర్నీలో అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 187.28గా ఉంది.
Shubham Dubey, Vidarbha’s highest run-scorer this SMAT is now a Royal! 🔥💗 pic.twitter.com/7MRJnlsV11
— Rajasthan Royals (@rajasthanroyals) December 19, 2023
గ్లవ్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బుల్లేవు..
ఐపీఎల్ వేలంలో తనకు భారీ ధర దక్కిన తర్వాత దూబే స్పందిస్తూ… ‘నేను నిజంగా దీనిని నమ్మలేకపోతున్నా. స్మాట్ టోర్నీలో నేను బాగా ఆడా. ఆ ధైర్యంతో నేను వేలంలో కచ్చితంగా ఎంపికవుతానని భావించా. కానీ ఇంత మొత్తంలో దక్కించుకుంటానని నేనైతే కలలో కూడా ఊహించలేదు. మా ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే. కానీ సుదీప్ సార్ (దూబే కోచ్) నాకు చాలా సాయం చేశాడు. నాకు గ్లవ్స్ కొనుక్కోవడానికి కూడా డబ్బులుండేవి కాదు. కానీ ఆయనే నాకు అన్ని కొనిచ్చి అండర్ – 19, అండర్ – 23, ‘ఏ’ డివిజన్ టీమ్స్‌లో చోటు దక్కేలా చూశారు. ఆయన లేకుంటే నేను విదర్భ క్రికెట్ టీమ్‌లోకి వచ్చేవాడినే కాదు…’ అని భావోద్వేగానికి గురయ్యాడు.