Chinnaswamy Stadium : క్రికెట్‌ను ఎంతగానే ప్రేమించే బెంగళూరువాసులకు షాకింగ్ న్యూస్ తొక్కిసలాటతో అప్రతిష్టను మూటగట్టుకున్న చిన్నస్వామి స్టేడియం (Chinnaswamy Stadium)లో మ్యాచ్‌లు ఇప్పట్లో జరిగేలా లేవు. ఆర్సీబీ జట్టు విక్టరీ పరేడ్ సందర్భంగా 11మంది మృతికి దారితీసిన దురదృష్టకర ఘటనే అందుకు కారణం. కర్నాటక క్రికెట్ సంఘం (KCA) చిన్నస్వామిలో ఆగస్టు 11 నుంచి మహారాజా టీ20 (Maharaja T20) నిర్వహించాలనుకుంటోంది.
కానీ, తొక్కిసలాట కేసుపై దర్యాప్తు కొనసాగుతున్నందున బెంగళూరు పోలీసులు మాత్రం అనుమతి ఇవ్వడం లేదు. ఈ నేపథ్యంలో నో అబ్జెక్షన్ సర్టిఫికెట్(NOC) కోసం కేసీఏ పెద్దలు గట్టిగానే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. ఒకవేళ గడువులోపు పోలీసులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుంటే.. అలుర్, వడయరార్ మైదానాల్లో మ్యాచ్‌లు ఆడించేందుకు సిద్ధపడుతోంది కేసీఏ.
With the ongoing investigation into the June 4 stampede, police are yet to clear the Chinnaswamy Stadium to host the Maharaja T20 👇 https://t.co/SwBbGFjTLX
— ESPNcricinfo (@ESPNcricinfo) August 2, 2025
రాయల్ ఛాలెంజర్స్ జట్టు ఐపీఎల్ విజేతగా నిలిచిన మరునాడు అంటే.. జూన్ 4న చిన్నస్వామి స్టేడియం దగ్గర తొక్కిసలాట జరిగింది. 30 వేల సామర్ధ్యం మాత్రమే ఉన్న మైదానంలోకి వెళ్లేందుకు 3 లక్షల మంది రావడమే ఘటనకు కారణం. అయితే.. విక్టరీ పరేడ్‌కు ఆర్సీబీగానీ, కర్నాటక క్రికెట్ సంఘం గానీ పోలీసుల అనుమతి తీసుకోలేదు. సరైన భద్రతా ఏర్పాట్లు కరువవ్వడంతో అభిమానులు తోసుకుంటూ లోపలికి వెళ్లబోగా.. తొక్కిసలాట జరిగింది. ఈ విషాదకర ఘటనలో 11 మంది చనిపోగా.. 50 మంది తీవ్రంగా గాయపడ్డారు.
ఈ సంఘటనపై విచారం వ్యక్తం చేసిన కర్నాటక ప్రభుత్వం న్యాయ విచారణకు ఆదేశించింది. ఈ మధ్యే నివేదికను సమర్పించిన కమిషన్ చిన్నస్వామి స్టేడియం నిర్మాణంలో లోపాలు ఉన్నాయని, భారీ సంఖ్యలో అభిమానులను అనుమతించడానికి ఈ గ్రౌండ్ సురక్షితం కాదని స్పష్టం చేసింది. ఈ పరిస్థితుల్లో మహారాజా టీ20ని ప్రేక్షకులకు అనుమతి లేకుండానే నిర్వహిస్తామని కేసీఏ పోలీసులకు తెలియజేసింది.
కానీ, స్వతంత్రంగా దర్యాప్తు చేస్తున్న క్రైమ్ బ్రాంచ్ పోలీసులు కేసీఏకు నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇప్పట్లో ఇవ్వడం కుదరదు అంటున్నారు. ఆగస్టు 11 న టోర్నీ ఆరంభం కావాల్సి ఉంది. ఇప్పటికే షెడ్యూల్ ప్రకటించినందున అలూర్‌లో గ్రూప్ మ్యాచ్‌లు జరిపి.. ఫైనల్‌ను చిన్నస్వామిలో ఆడించే ఆలోచనలో ఉంది కేసీఏ. అయితే.. అది కూడా సాధ్యమవుతుందని అనిపించట్లేదు.