Vinod Kambli | మాస్టర్ బ్లాస్టర్గా భారతీయులకు ఆరాధ్య క్రికెట్ దైవంగా భావించే సచిన్ టెండూల్కర్ స్నేహితుడు వినోద్ కాంబ్లీకి మహారాష్ట్రలోని ఒక వ్యాపార వేత్త చేయూతనిచ్చేందుకు ముందుకు వచ్చాడు. సహ్యాద్రి గ్రూప్ సంస్థలో ఫైనాన్స్ విభాగంలో వినోద్ కాంబ్లీకి ఉద్యోగం ఇస్తానని ఆఫర్ చేశాడు. నెలకు జీతం రూ.లక్ష ఇవ్వడానికి ఆఫర్ చేశాడు. దీన్ని వినోద్ కాంబ్లీ ఆమోదిస్తారా.. లేదా అన్న సంగతి వేచి చూడాలి.
కొన్ని రోజుల క్రితం తనకేదైనా పని చూపాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ (ఎంసీఏ)కు అప్పీల్ చేశాడు. తనకు ఇప్పుడు బీసీసీఐ ఇచ్చే రూ.30 వేల పెన్షన్ మాత్రమే జీవనాధారం అని పేర్కొన్నాడు. ఈ విషయమై ఎంసీఏ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. జాతీయ స్థాయిలో మంచి క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్నాడు వినోద్ కాంబ్లీ.
కానీ, అంతర్జాతీయ క్రికెట్లో రాణించడంలో వినోద్ కాంబ్లీ విఫలం అయ్యాడు. టీం ఇండియాకు అంతర్జాతీయ క్రికెట్లో 17 టెస్ట్ మ్యాచ్‌లు, 104 వన్డే మ్యాచ్‌ల్లో ప్రాతినిధ్యం వహించాడు. 2000లో చివరి అంతర్జాతీయ మ్యాచ్ ఆడినా.. చాలా కాలం తర్వాత 2011లో క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. క్రికెట్ కామెంటేటర్‌గా పని చేసిన కాంబ్లీ.. పలు మీడియా చానెళ్లలోనూ సేవలందించాడు.
కష్టాల్లో ఉన్న వినోద్ కాంబ్లీని సచిన్ టెండూల్కర్ పలు విధాలుగా ఆదుకున్నాడు. కొన్నాళ్ల వరకు సచిన్ టెండూల్కర్ ఏర్పాటు చేసిన అకాడమీలో కోచ్‌గా పని చేశానని చెప్పాడు కాంబ్లీ. చాలా దూరం కావడంతో ఆ అకాడమీలో ఉద్యోగం మానేశానని చెప్పాడు. అందుకే తనకేదైనా ఉద్యోగం కల్పించాలని ఎంసీఏను కాంబ్లీ ఇటీవల అభ్యర్థించాడు.