ఐపీఎల్లో మరో రసవత్తర పోరు అభిమానులను అలరించింది. ఆఖరి వరకు నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌లో ఉత్కంఠ ఊపేసింది. ప్లేఆఫ్స్ సమీపిస్తున్న వేళ ప్రతీ మ్యాచ్ కీలకమైన తరుణంలో లక్నో, కోల్‌కతా మధ్య జరిగిన పోరు యుద్ధాన్ని తలపించింది. విజయమో, వీరస్వర్గమో అన్న రీతిలో రెండు జట్లు కొదమసింహాల్లా కొట్లాడాయి. డికాక్ భారీ సెంచరీకి తోడు కెప్టెన్ రాహుల్ అర్ధసెంచరీతో వికెట్ కోల్పోకుండా భారీ స్కోరు సాధించిన లక్నో.. కోల్‌కతాపై ఉత్కంఠ విజయంతో ప్లేఆఫ్స్‌లోకి దూసుకెళ్లింది. లక్ష్యఛేదనలో కోల్‌కతా తుదికంటా పోరాడినా.. ఓటమితో లీగ్ నుంచి నిష్క్రమించింది. మ్యాచ్‌ను మలుపు తిప్పిన లెవిస్ సూపర్ క్యాచ్ ఐపీఎల్‌కే హైలెట్‌గా నిలిచింది.
ముంబై: ఐపీఎల్లో లక్నో సూపర్‌జెయింట్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య పోరు ఫ్యాన్స్‌కు పసందైన విందు అందించింది. బుధవారం జరిగిన హైస్కోరింగ్ మ్యాచ్‌లో లక్నో 2 పరుగుల తేడాతో కోల్‌కతాపై విజయం సాధించింది. దీంతో ఈ సీజన్లో ప్లేఆఫ్స్ చేరిన రెండో కొత్త జట్టుగా లక్నో నిలువగా, నిరుటి రన్నరప్ కోల్‌కతా తమ ప్రస్థానాన్ని ముగించింది. తొలుత డికాక్(70 బంతుల్లో 140 నాటౌట్, 10ఫోర్లు, 10 సిక్స్‌లు) సూపర్ సెంచరీకి తోడు రాహుల్(51 బంతుల్లో 68, 3ఫోర్లు, 4 సిక్స్‌లు) అర్ధసెంచరీతో లక్నో 20 ఓవర్లలో వికెట్ కోల్పోకుండా 210 పరుగులు చేసింది.
15 ఏండ్ల ఐపీఎల్ చరిత్రలో వికెట్ నష్టపోకుండా ఇన్నింగ్స్ ముగించడం ఇదే తొలిసారి కావడం విశేషం. కోల్‌కతా బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ డికాక్ కొట్టిన కొట్టుడుకు స్టేడియం హోరెత్తిపోయిది. కోల్‌కతా బౌలర్లను లక్ష్యంగా చేసుకుంటూ డికాక్ తన ఇన్నింగ్స్‌లో ఏకంగా పది సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. డికాక్‌కు రాహుల్ జత కలువడం అగ్నికి ఆజ్యం పోసినట్లు అయ్యింది. లక్ష్యఛేదనకు దిగిన కోల్‌కతా 20 ఓవర్లలో 208/8 స్కోరు చేసింది. శ్రేయాస్ అయ్యర్(50), నితీశ్ రాణా(42), రింకుసింగ్(40) రాణించినా లాభం లేకపోయింది. ఆఖర్లో రింకుసింగ్, సునీల్ నరైన్(21 నాటౌట్) మెరుపులతో ఒక దశలో కోల్‌కతా గెలుపుపై ఆశలు రేగినా..లెవిస్ అద్భుత క్యాచ్‌తో మ్యాచ్ లక్నో వైపునకు తిరిగింది. సెంచరీతో జట్టుకు భారీ స్కోరు అందించిన డికాక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది.
లక్నో: 20 ఓవర్లలో 210 (డికాక్ 140 నాటౌట్, రాహుల్ 68 నాటౌట్) కోల్‌కతా: 20 ఓవర్లలో 208/8 (అయ్యర్ 50, రాణా 42, మోసిన్‌ఖాన్ 3/20, స్టోయినిస్ 3/23)