Commonwealth Games 2026 : ప్రతిష్ఠాత్మక కామన్వెల్త్ క్రీడల(Commonwealth Games 2026)కు మరో ఐదు రోజుల్లో తెరలేవనుంది. గ్లాస్గో వేదికగా జరుగనున్న ఈ విశ్వక్రీడలల్లో భారత బృందాన్ని ఒలింపిక్ విజేతలు మీరాబాయి చాను (Mirabai Chanu), లొవ్లీనా బొర్గోహైన్(Lovlina Borgohain)లు నడిపించనున్నారు. జూలై 23, గురువారం మొదలయ్యే ఆరంభ వేడుకలో మీరాబాయి, లొవ్లీనాలు 126 మందితో కూడిన భారత బృందానికి నాయకత్వం వహించనున్నారు. అంటే.. వీరు పతకధారులుగా వ్యవహరించనున్నారు. భారత ఒలింపిక్ సంఘం ఈ విషయాన్ని శనివారం అధికారికంగా వెల్లడించింది.
కామన్వెల్త్ క్రీడలకు భారత బృందం సిద్ధమవుతోంది. స్కాట్లాండ్ ఆతిథ్యమిస్తున్న ఈ మెగా టోర్నీకి 126 మంది ఎంపికవ్వగా.. ఈ బృందానికి ఒలింపిక్ విజేతలు మీరాబాయి చాను, లొవ్లీనా బొర్గొహైన్‌లు సారథ్యం వహించనున్నారు. జూలై 23, గురువారం జరిగే ఆరంభ వేడుకల్లో.. వీరిలో ఒకరు మువ్వన్నెల జెండాను చేతబూని.. మరొకరు కామన్వెల్త్ క్రీడా జ్యోతిని పట్టుకొని సగర్వంగా నడుస్తారని భారత ఒలింపిక్ సంఘం(IOA) అధ్యక్షురాలు పీటీ ఉష(PT Usha) పేర్కొంది.
|| 𝐂𝐨𝐦𝐦𝐨𝐧𝐰𝐞𝐚𝐥𝐭𝐡 𝐆𝐚𝐦𝐞𝐬 𝟐𝟎𝟐𝟔 ||
𝐎𝐥𝐲𝐦𝐩𝐢𝐜 𝐌𝐞𝐝𝐚𝐥𝐥𝐢𝐬𝐭𝐬 𝐌𝐢𝐫𝐚𝐛𝐚𝐢 𝐂𝐡𝐚𝐧𝐮 𝐀𝐧𝐝 𝐋𝐨𝐯𝐥𝐢𝐧𝐚 𝐁𝐨𝐫𝐠𝐨𝐡𝐚𝐢𝐧 𝐓𝐨 𝐁𝐞 𝐈𝐧𝐝𝐢𝐚’𝐬 𝐅𝐥𝐚𝐠 𝐀𝐧𝐝 𝐁𝐚𝐭𝐨𝐧 𝐁𝐞𝐚𝐫𝐞𝐫𝐬 𝐅𝐨𝐫 𝐓𝐡𝐞 𝐎𝐩𝐞𝐧𝐢𝐧𝐠 𝐂𝐞𝐫𝐞𝐦𝐨𝐧𝐲
The Indian… pic.twitter.com/qwApVhUAuF
— All India Radio News (@airnewsalerts) July 18, 2026
‘గ్లాస్గోలోని ఓవో హైడ్రో స్టోర్స్ అరీనాలో జరుగనున్న ఆరంభ వేడుకల్లో మీరాబాయి, లొవ్లీనాలు భారత ప్రతినిధులుగా వ్యవహరించనుండడం ఎంతో గర్వపడాల్సిన విషయం. వీరితో పాటు భారత బృందానికి ఆల్ ది బెస్ట్’ అని ఉష వెల్లడించింది. టోక్యో ఒలింపిక్స్‌లో రజతం సాధించిన మీరాబాయి.. ఈసారి కామన్వెల్త్ క్రీడల్లో మహిళల 48 కిలోల విభాగంలో పోటీపడనుంది. టోక్యో విశ్వక్రీడల్లోనే కంచు మోత మోగించిన లొవ్లీనా.. గ్లాస్గోలో మాత్రం 75 కిలోల విభాగంలో తలపడనుంది.
గ్లాస్గోలో మొత్తంగా.. బాస్కెట్ బాల్(3×3) వీల్ ఛెయిర్ విభాగంలో.. నలుగురు, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్‌లో ఎనిమిది మంది పాల్గొననున్నారు. అథ్లెటిక్స్ విషయానికొస్తే.. ట్రాక్ ఈవెంట్లలో 14 మంది. ఫీల్డ్ విభాగంలో.. 18 మంది బరిలో ఉన్నారు. పారా అథ్లెట్లలో.. ట్రాక్ అండ్ ఫీల్డ్‌లో 11 మంది పోటీ పడుతున్నారు.
లాన్ బౌల్స్ – ఆరుగురు
బాక్సింగ్ – 14 మంది
జూడో – 14 మంది
పారా పవర్‌లిఫ్టింగ్ – ఏడుగురు
స్విమ్మింగ్ – ఐదుగురు
పారా స్విమ్మింగ్ – ఐదుగురు
ట్రాక్ సైక్లింగ్ – ఆరుగరు
పారా ట్రాక్ సైక్లింగ్ – లిషా దాస్ (మహిళల విభాగం)
వెయిట్‌లిఫ్టింగ్ – 12 మంది.