మ్యాడ్రిడ్: ఫ్రాన్స్ సారథి కిలియన్ ఎంబాపె దిగ్గజ ఫుట్బాల్ ఫ్రాంచైజీ ‘రియల్ మ్యాడ్రిడ్’తో చేరాడు. ఏడేండ్ల పాటు పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్జీ)కు ఆడిన ఎంబాపె.. గతేడాదే రియల్ మ్యాడ్రిడ్తో ఒప్పందం కుదుర్చుకుని ఈ ఏడాది జూన్ లోనే ఈ ఫ్రాంచైజీతో కలిసినా మంగళవారం ఇక్కడి శాంటిగో బెర్నాబ్యూ స్టేడియం వేదికగా సుమారు 80వేల మంది అభిమానుల సమక్షంలో అధికారికంగా ‘మ్యాడ్రిడ్’కు మారాడు.
ఎంబాపె పరిచయ కార్యక్రమంగా జరిగిన ఈ వేడుకలో ఫ్రాంచైజీ యజమాని ఫ్లొరెంటినో పెరెజ్.. అతడిని అభిమానులను పరిచయం చేయడమే గాక 9వ నెంబర్ జెర్సీ అందించాడు. ఈ సందర్భంగా ఎంబాపె మాట్లాడుతూ.. ‘నా జీవితంలో ఇది ప్రత్యేకమైన రోజు. చిన్నప్పట్నుంచీ మ్యాడ్రిడ్లో ఆడాలనేది నా కల. ఈ వేడుకను నాతో కలిసి చేసుకున్న మీ అందరికీ ధన్యవాదాలు’ అని తెలిపాడు.