Kuldeep Kumar : ఐపీఎల్లో రికార్డు స్కోర్లు నమోదవుతున్న వేళ అందరి దృష్టిని పోల్ వాల్ట్(Pol Vault) వైపు మళ్లించాడు ఓ కుర్రాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన కుల్దీప్ కుమార్ (Kuldeep Kumar) జాతీయ స్థాయి పోటీల్లో రికార్డు ఎత్తు దుమికి చరిత్ర సృష్టించాడు. భువనేశ్వర్‌లో జరిగిన భారత ఇండూర్ ఓపెన్ కంబైన్డ్ ఈవెంట్స్, పోల్ వాల్ట్ పోటీల్లో సత్తా చాటిన 21 ఏళ్ల కుల్దీప్ అందర్నీ ఆశ్చర్యపరుస్తూ 5.41 మీటర్ల ఎత్తు దూకాడు. జనవరిలో రైల్వే అధికారుల నిర్లక్ష్య ధోరణితో గంటలతరబడి ప్లాట్‌ఫామ్ మీదే పడిగాపులు కాసిన కుల్దీప్.. ఇప్పుడు తన ప్రతిభతో ప్రశంసలు అందుకుంటున్నాడు.
అథ్లెటిక్స్ పోటీల్లో ఒకటైన పోల్‌వాల్ట్‌లో కుల్దీప్ కుమార్ చరిత్ర లిఖించాడు. జాతీయ స్థాయిలో దేవ్ మీనా 5.40తో నెలకొల్పిన రికార్డును కుల్దీప్ అధిగమించాడు. దేవ్ మీనా కంటే ఒక పాయింట్ ఎక్కువ ఎత్తు దుమికిన కుల్దీప్ భావి తారగా ఎదుగుతున్నాడు. అయితే.. ప్రతిభకు కొదవలేని కుల్దీప్ జనవరిలో రైల్వే అధికారుల నిర్లక్ష్యానికి బలయ్యాడు. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్‌షిప్స్‌లో పాల్గొని.. తిరుగు ప్రయాణంలో సహచరుడు దేవ్ మీనాతో కలిసి రైలు ఎక్కారు.
Simply Sensational 🔥
WATCH LIVE HERE: https://t.co/CMPuLwI8WX#IndianAthletics #AFI pic.twitter.com/vGICOognVX
— Athletics Federation of India (@afiindia) May 2, 2026
వీరిద్దరి వద్ద పోల్ వాల్ట్ కర్రలను చూసిన టికెట్ ఎగ్జామినర్ ‘అదనపు లగేజీ ఎంటీ?, తోటి ప్రయాణికులకు అసౌకర్యం కలిగిస్తున్నారు’ అని అభ్యంతరం వ్యక్తం చేశాడు. సార్ ఇవి మా పోల్ వాల్ట్ ఆటలో భాగం అని కుల్దీప్, దేవ్ ఎంత చెప్పినా వినిపించుకోకుండా ఇద్దరిని రైల్లో నుంచి దింపేశాడు. దాంతో, వీరు రైల్వే అధికారులను కలిసి టికెట్ ఎగ్జామినర్ తమను రైల్లో నుంచి దింపేశారని చెప్పారు. కానీ, అధికారులు సైతం కుల్దీప్, మీనా దేవ్లను పట్టించుకోలేదు. చేసేదేమిలేకి ఇద్దరూ ప్లాట్‌ఫామ్ మీదే గంటల తరబడి పడిగాపులు కాశారు.
అనంతరం తమపట్ల రైల్వే అధికారులు ప్రవర్తించిన తీరును వీడియోలో పంచుకున్నారిద్దరూ. ఆ వీడియో చూసినవాళ్లంతా జాతీయ రికార్డు సాధించిన అథ్లెట్‌కు ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. జూనియర్ అథ్లెట్ల పరిస్థితిని ఊహించుకోలేం అంటూ కామెట్లు పెట్టారు.