ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో ఆఖరి అంకానికి రంగం సిద్ధమైంది. రెండు నెలలుగా మండు వేసవిలో అభిమానులను అద్భుత ఆటతీరుతో అలరించిన లీగ్‌లో ఆఖరి ఆటకు వేళయైంది. లీగ్ దశలో టేబుల్ టాపర్లుగా నిలిచిన సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్ఆర్హెచ్), కోల్‌కతా నైట్‌రైడర్స్ (కేకేఆర్) టైటిల్ పోరులో కదం తొక్కనున్నాయి. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా కప్ కోసం ఢీ అంటే ఢీ అన్నట్లు పోరాడనున్నాయి. ముఖాముఖి పోరులో హైదరాబాద్‌పై కోల్‌కతాదే పైచేయిగా కనిపిస్తున్నా.. ఆఖరి ఆటలో అదృష్టం ఎవరిని వరిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. రెండు మ్యాచ్‌ల్లో ఓటమికి కోల్‌కతాపై హైదరాబాద్ ప్రతీకారం తీర్చుకుంటుందా లేక..అదే ఆధిపత్యం ప్రదర్శిస్తూ కేకేఆర్ మూడోసారి విజయం సాధిస్తుందా అన్నది చూడాలి. గంభీర్ మెంటార్‌గా కేకేఆర్ తీన్మార్ దరువేస్తుందా లేక మరోమారు ఆసీస్ ప్లేయర్ సారథ్యంలో హైదరాబాద్ ఐపీఎల్ చాంపియన్‌గా నిలుస్తుందా అన్నది మరికొన్ని గంటల్లో తేలనుంది.
IPL | చెన్నై: ఐపీఎల్ ఫైనల్ ఫైట్ అన్ని హంగులతో మన ముందుకు రాబోతున్నది. రెండు నెలల ఈ సుదీర్ఘ ప్రయాణంలో అత్యుత్తమం అన్నదగ్గ రెండు జట్లు సన్‌రైజర్స్ హైదరాబాద్, కోల్‌కతా నైట్‌రైడర్స్ కప్ వేటలో తలపడబోతున్నాయి. ఆదివారం చెపాక్ స్టేడియం వేదికగా ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడేందుకు సర్వశక్తులతో కదనరంగంలోకి దూకనున్నాయి. లీగ్ ఇరు జట్లు ముఖాముఖి పోరుతో మొదలుపెట్టగా, చివరగా అవే జట్లు ఇప్పుడు తుది పోరులో సత్తాచాటేందుకు సై అంటున్నాయి. లీగ్‌లో రెండు సార్లు కోల్‌కతా చేతిలో ఎదురైన ఓటములకు ఫైనల్లో ప్రతీకారం తీర్చుకునేందుకు ఎస్ఆర్హెచ్ కదన కుతుహలంతో ఉంటే..కోల్‌కతా తీన్మార్ మోగించేందుకు తహతహలాడుతున్నది. 17 ఏండ్ల సుదీర్ఘ ఐపీఎల్ చరిత్రలో హైదరాబాద్, కోల్‌కతా పైనల్లో తలపడటం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే గౌతం గంభీర్ కెప్టెన్సీలో 2012, 14లో ఐపీఎల్ గెలిచిన కేకేఆర్ మరోమారు మెంటార్‌గా ట్రోఫీ అందించాలని చూస్తున్నాడు. మరోవైపు ఎనిమిదేండ్ల క్రితం ఆర్సీబీని మట్టికరిపించి తొలిసారి ట్రోఫీని ముద్దాడిన ఎస్ఆర్హెచ్ మరోమారు అదే ప్రదర్శన పునరావృతం చేయాలని చూస్తున్నది.దీనికి తోడు గతానికి భిన్నంగా ఈసారి హైదరాబాద్, కోల్‌కతా ఐపీఎల్ రూపురేఖలను మార్చేశాయి.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఈ సీజన్లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నది. అసలు ఏమాత్రం అంచనాలు లేకుండా బరిలోకి దిగి ప్రత్యర్థులకు దడ పుట్టించింది. ఇన్నాళ్లు తమ పదునైన బౌలింగ్‌తో స్వల్ప లక్ష్యాలను కాపాడుకున్న ఎస్ఆర్హెచ్..ఈ సీజన్లో బ్యాటింగ్‌లో దుమ్మురేపింది. డాషింగ్ ద్వయం అభిషేక్‌శర్మ, ట్రావిస్‌హెడ్..ప్రత్యర్థి బౌలర్లను చీల్చిచెండాడుతూ ఐపీఎల్లో రికార్డులు కొల్లగొట్టారు. ప్రత్యర్థి ఎవరన్నది లెక్కచేయని నైజంతో ఎదుర్కొన్న తొలి బంతి నుంచే బడితే పూజ చేస్తూ భారీ స్కోర్లకు బాటలు వేశారు. కోల్‌కతాతో ఫైనల్లోనూ ఈ ఇద్దరు క్రీజులో కుదురుకుంటే చెపాక్‌లో పరుగుల పండుగే. వీరికి తోడు రాహుల్ త్రిపాఠి, క్లాసెన్, నితీశ్‌కుమార్‌రెడ్డి, మార్క్మ్ జతకలిస్తే సునామీ ముంచెత్తినట్లే. బౌలింగ్‌లో కెప్టెన్ కమిన్స్ మంచి ఫామ్‌లో ఉండగా, భువనేశ్వర్, నటరాజన్ సూపర్ స్పెల్స్‌తో కట్టడి చేస్తున్నారు. మొత్తంగా మరోమారు సమిష్టి ప్రదర్శన కనబరిస్తే..హైదరాబాద్‌లో ఖాతాలో రెండో టైటిల్ చేరినట్లే.
లీగ్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్ అంచనాలకు భిన్నంగా రాణిస్తున్నది. గత సీజన్లతో పోలిస్తే..అటు బ్యాటింగ్‌కు తోడు బౌలింగ్‌లో అదరగొడుతూ వరుస విజయాలతో టాప్‌లో నిలిచింది. గౌతం గంభీర్ మెంటార్షిప్కు తోడు శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీకి ఈ సీజన్లో అదనపు బలంగా మారింది. టాపార్డర్‌లో సునీల్ నరైన్ మరోమారు బ్యాటు ఝులిపిస్తే కేకేఆర్‌కు తిరుగుండకపోవచ్చు. అయ్యర్ ద్వయం మంచి ఫామ్‌మీద ఉన్నారు. వీరికి తోడు రస్సెల్, రింకూసింగ్ జత కలిస్తే ఎంతటి లక్ష్యమైనా ఊదిపడేస్తారు. బౌలింగ్‌లో స్టార్క్ ప్రకంపనలు సృష్టిస్తుంటే వైభవ్ అరోరా, హర్షిత్ రానా పరిస్థితులకు అనుగుణంగా రాణిస్తున్నారు.
హైదరాబాద్: హెడ్, అభిషేక్, రాహుల్ త్రిపాఠి, మార్క్మ్,్ర క్లాసెన్, నితీశ్‌కుమార్, సమద్, షాబాజ్/మయాంక్, కమిన్స్(కెప్టెన్), ఉనద్కట్, భువనేశ్వర్, నటరాజన్.
కోల్‌కతా: నరైన్, గుర్బాజ్, అయ్యర్, వెంకటేశ్, శ్రేయాస్(కెప్టెన్), నితీశ్‌రానా, రింకూసింగ్, రస్సెల్, రమన్‌దీప్, స్టార్క్, హర్షిత్, వరుణ్, వైభవ్ అరోరా పిచ్, వాతావరణం: హైదరాబాద్, కోల్‌కతా ఫైనల్ మ్యాచ్ ఎర్ర మట్టితో పిచ్ సిద్ధం చేశారు. ఇది బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. ఆదివారం చెన్నైలో వర్షం కురిసే అవకాశం చాలా తక్కువ(5శాతం) కనిపిస్తున్నాయి.
6 గత ఆరు ఐపీఎల్ సీజన్లలో క్వాలిఫయర్-1లో గెలిచిన జట్టు టైటిల్ విజేతగా నిలిచింది.
కోల్‌కతా: 2012, 2014
హైదరాబాద్: 2016