RCB vs SRH : ఐపీఎల్ ఆరంభ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ఓటమి తప్పలేదు. భారీ స్కోర్ల మ్యాచ్‌లో దేవ్‌దత్ పడిక్కల్(61), విరాట్ కోహ్లీ(69 నాటౌట్)ల మెరుపులతో ఆర్సీబీ జయకేతనం ఎగురవేసింది. హైదరాబాద్ నిర్దేశించిన 202పరుగుల ఛేదనలో ఆరంభంలో ఫిలిప్ సాల్ట్(8) ఔటైనా.. ఇంప్యాక్ట్ ప్లేయర్ పడిక్కల్ సునామీలా విరుచుకుపడ్డాడు. రజత్ పాటిదార్(31) ధనాధన్ ఆటకు కోహ్లీ క్లాస్ ఇన్నింగ్స్ తోడవ్వగా ఆర్సీబీ అలవోకగా 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.
పంతొమ్మిదో సీజన్ ఆరంభ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ పంజా విసిరింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన ఆర్సీబీ భారీ లక్ష్యాన్ని ఉఫ్‌మనిపించింది. కొండంత ఛేదనలో దేవ్‌దత్ పడిక్కల్(61) ఊచకోతకు విరాట్ కోహ్లీ(69 నాటౌట్) క్లాస్ బ్యాటింగ్ తోడవ్వగా సన్‌రైజర్స్ బౌలర్లు బేజారయ్యారు. చిన్నస్వామి స్టేడియంలో పడిక్కల్, కోహ్లీ మెరుపులతో లక్ష్యం కరుగుతూ పోయింది. మూడో వికెట్‌కు పడిక్కల్‌తో 28 బంతుల్లోనే యాభై రన్స్ పిండుకున్న విఆరాట్ ఆ తర్వాత రజత్ పాటిదార్(31)తో కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు.
5️⃣0️⃣ Numero 6️⃣4️⃣ for the Chase Master in the #TATAIPL. 🐐 pic.twitter.com/8jZLrvlttj
— Royal Challengers Bengaluru (@RCBTweets) March 28, 2026
మలింగ ఓవర్లో దూబే క్యాచ్‌తో పటిదార్ ఔటవ్వగా.. ఆ తర్వాతి బంతికే జితేశ్ శర్మ(0) సైతం వెనుదిరిగాడు. అయినా కోహ్లీ ఉండడంతో ఆర్సీబీ జట్టు కూల్‌గా ఉంది. హర్షల్ పటేల్ ఓవర్లో సిక్సర్, ఫోర్, ఫోర్ బాదిన కోహ్లీ జట్టును గెలిపించాడు. 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని అందుకున్న బెంగళూరు అదిరే బోణీ కొట్టింది. బౌలర్ల వైఫల్యంతో కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ ఓటమిని ఎదుర్కొన్నాడు.
పంతొమ్మిదో సీజన్ ఆరంభ పోరులో టాస్ ఓడిన సన్‌రైజర్స్ హైదరాబాద్ ఆదిలో తడబడినా కోలుకుంది. టాపార్డర్ విఫలమైన చోట ఇషాన్ కిషన్(80 :38 బంతుల్లో 8 ఫోర్లు, 5 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్‌తో చెలరేగాడు. హెన్రిచ్ క్లాసెన్(31) జతగా 97 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ భారీ స్కోర్‌కు బాటలు వేశాడు.
అనికేత్ వర్మ(43), ఇషాన్ కిషన్(80)

అనంతరం అనికేత్ వర్మ(43: 18 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లు) నేనున్నాగా అంటూ తనమార్క్ విధ్వంసంతో ఆర్సీబీ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఇషాన్, అనికేత్ మెరుపులతో ఆరెంజ్ ఆర్మీ ప్రత్యర్ధికి 202 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది.