Virat Kohli | భారత్ – ఆస్ట్రేలియా మధ్య బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ రేపటి మొదలుకానున్నది. పెర్త్ వేదికగా తొలి మ్యాచ్ జరుగనున్నది. ఈ సిరీస్‌ను ఎలాగైనా గెలవాలనే కసితో టీమిండియా బరిలోకి దిగబోతున్నది. 2018-19లో విరాట్ కోహ్లీ సారథ్యంలో భారతజట్టు ఆస్ట్రేలియా గడ్డపై టెస్ట్ సిరీస్‌ని గెలుచుకున్నది. ఆ తర్వాత 2020-21లో భారత్ స్వదేశంలో ఆస్ట్రేలియాను ఓడించి విజయాన్ని సాధించింది. ఈ సారి హ్యాట్రిక్ సిరీస్ విజయం టీమిండియా కన్నేసింది. శుక్రవారం నుంచి పెర్త్ వేదికగా భారత్-ఆస్ట్రేలియా మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనుంది. బుమ్రా నాయకత్వంలో టీమిండియా ఆస్ట్రేలియాతో తలపడనున్నది.
గత పర్యటనలో కోహ్లి సారథ్యంలో ఆస్ట్రేలియాలో భారత్ పర్యటించింది. అయితే, అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టు తర్వాత.. విరాట్ స్వదేశానికి తిరిగి వచ్చాడు. తొలి టెస్టులో టీమ్ ఇండియా 36 పరుగులకే ఆలవుట్ అయ్యింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో అజింక్య రహానే నేతృత్వంలోని టీమ్ మెల్బోర్న్, బ్రిస్బేన్‌లో విజయాలను నమోదు చేసి 2-1 తేడాతో సిరీస్‌ని నెగ్గింది. ఇటీవల స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవి చూపింది. ఆ చేదు జ్ఞాపకాలను మరిచి.. బోర్డర్ గవాస్కర్ సిరీస్‌ను కైవసం చేసుకోవాలని భావిస్తున్నది.
న్యూజిలాండ్‌తో టెస్ట్‌తో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC)లో భారత్‌కు ఫైనల్‌కు చేరే అవకాశాలకు దెబ్బకొట్టింది. న్యూజిలాండ్‌కు సిరీస్ ముందు డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టీమిండియా అగ్రస్థానంలో కొనసాగింది. కానీ, ఘోర ఓటమి తర్వాత రెండోస్థానానికి పతనమైంది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు చేరాలంటే.. ఆస్ట్రేలియాతో జరిగే టెస్ట్ సిరీస్‌ను 4-0తో కైవసం చేసుకోవాల్సిందే. ఈ పర్యటనలో విరాట్ కోహ్లీ దిగ్గజ బ్యాట్స్‌మెన్ సచిన్ టెండూల్కర్‌ను అధిగమించే అవకాశం ఉన్నది. అదే సమయంలో యశస్వి జైస్వాల్, ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ సైతం కొత్త రికార్డులను నెలకొల్పే అవకాశాలున్నాయి.
ఆస్ట్రేలియాలో కోహ్లీకి మంచి రికార్డు ఉన్నది. 13 మ్యాచుల్లో 54.08 సగటుతో 1,352 పరుగులు చేశాడు. ఆరు సెంచరీలు, నాలుగు హాఫ్ సెంచరీలున్నాయి. అంతే కాదు. 2011-12, 2014-15 పర్యటనల్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కోహ్లీయే. 2014-15 పర్యటనలో ఆస్ట్రేలియాతో జరిగిన ఒక సిరీస్‌లో కోహ్లీ అత్యుత్తమ ప్రదర్శన చేశాడు. నాలుగు మ్యాచ్‌లలో 86.50 సగటుతో 692 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఒక అర్ధ సెంచరీ ఉన్నది.
ఇక అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన మూడో ఆటగాడిగా కోహ్లీ నిలిచాడు. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్‌ను అధిగమించే అవకాశం ఉన్నది. అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక పరుగులు చేసిన క్రికెటర్లలో సచిన్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాతి ప్లేస్‌లో శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కర రెండోస్థానంలో ఉన్నారు. ఈ పర్యటనలో కోహ్లీ ఒక్క సెంచరీ చేసినా.. ఆస్ట్రేలియాలో అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాట్స్‌మెన్‌గా రికార్డు సృష్టించనున్నారు. ఇప్పటికే సచిన్ ఆరు సెంచరీలతో సమానంగా ఉన్నాడు.
భారత స్టార్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ ఆస్ట్రేలియా పర్యటనలో రాణిస్తే రికార్డులు సృష్టించనున్నాడు. సిరీస్‌లో 444 పరుగులు చేయగలిగితే ఓ క్యాలెండర్ ఇయర్లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా రికార్డుకెక్కనున్నాడు. ప్రస్తుతం ఈ రికార్డు సచిన్ పేరిట ఉన్నది. సచిన్ 2010లో 1562 పరుగులు చేశాడు. అలాగే, యశస్వి 15 పరుగులు చేస్తే.. ప్రస్తుత టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌ను అధిగమించనున్నాడు. ఒక క్యాలెండర్ ఇయర్లో అత్యధిక పరుగులు చేసిన భారత ఎడమచేతివాటం బ్యాటర్‌గా నిలువనున్నారు. 2008లో గంభీర్ 1134 పరుగులు చేశాడు.
భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ టెస్టుల్లో వేగంగా 550 వికెట్లు పూర్తి చేసిన ఆటగాడిగా రికార్డులకెక్కే అవకాశం ఉంది. అనిల్ కుంబ్లే 115 ఇన్నింగ్స్‌లో ఈ ఘనత సాధించాడు. ఈ రికార్డు ప్రస్తుతం శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ పేరుతో ఉన్నది. కేవలం 94 టెస్టుల్లో 550 వికెట్లు తీశాడు. అశ్విన్ 13 టికెట్లు తీస్తే.. ఆస్ట్రేలియా గడ్డపై టెస్టుల్లో భారత్‌కు అత్యంత విజయవంతమైన బౌలర్‌గా అవతరించనున్నాడు.