Virushka : టీ20లు, టెస్టులకు వీడ్కోలు పలికిన భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ (Virat Kohli) లండన్ వీధుల్లో చక్కర్లు కొడుతున్నాడు. నిరుడు తన కుమారుడు ‘అకాయ్’ (Akay) పుట్టినప్పటి నుంచి ఆ పట్టణాన్ని తన రెండో ఇల్లుగా మార్చుకున్న విరాట్ అక్కడే కుటుంబంతో కలిసి ఉంటున్నాడు. స్టార్డమ్తో సంబంధం లేకుండా లండన్‌లో సామాన్యుడిలా జీవిస్తున్న టీమిండియా ప్లేయర్.. అప్పుడప్పుడూ షాపింగ్‌కు వెళ్తూ, బజారుకు వెళ్లూ కెమెరా కంటపడుతుంటాడు.
ఈసారి భార్య అనుష్క శర్మ (Anushka Sharma)తో కలిసి రోడ్డుపై కొందరితో మాట్లాడాడు. అభిమానుల ముట్టడి.. కెమెరా కళ్ల నిఘా వంటివి ఏవీ లేకుండా వాళ్లతో విరుష్క జంట నవ్వుతూ సంభాషణ కొనసాగించారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరలవుతోంది. వీడియోలో టీషర్ట్, షార్ట్ ధరించిన కోహ్లీ చేతిలో ఒక బాటిల్, గొడుగు పట్టుకొని ఉండగా.. అనుష్క సింపుల్ డ్రెస్‌లోనే సౌకర్యం ఉందని చాటింది.
Virat Kohli And @AnushkaSharma Spotted Strolling Through The Streets Of London.💖
.
.
.
.#Virushka @imVkohli pic.twitter.com/ojWjndYE0r— virat_kohli_18_club (@KohliSensation) August 17, 2025
ఈ ఏడాది ఐపీఎల్ ట్రోఫీతో తన కలను నిజం చేసుకున్నాడు విరాట్. మొదటి సీజన్ నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB )కు ఆడుతున్న కోహ్లీ.. ఎట్టకేలకు జట్టును విజేతగా నిలిపి ప్రపంచాన్ని గెలిచినంత జోష్‌తో సంబురాలు చేసుకున్నాడు. ఇక అదే ఉత్సాహంతో ఇంగ్లండ్ పర్యటనలోనూ ఇరగదీస్తాడనుకుంటే రిటైర్మెంట్ బాంబ్ పేల్చి షాకిచ్చాడీ కింగ్. రోహిత్ శర్మ వీడ్కోలు పలికిన వారం రోజులకే తాను కూడా సుదీర్ఘ ఫార్మాట్‌కు బైబై చెప్పేశాడు.
ఇకపై టీమిండియా జెర్సీతో వన్డేల్లో మాత్రమే ఆడనున్న విరాట్ ఈమధ్యే లండన్‌లో సాధన షురూ చేశాడు. గుజరాత్ టైటాన్స్ బ్యాటింగ్ కోచ్‌తో కలిసి నెట్స్‌లో సాధన చేస్తున్న వీడియోను అభిమానులతో పంచుకున్నాడీ స్టార్ క్రికెటర్. అయితే.. నవంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికవ్వడమే లక్ష్యంగా పెట్టుకున్న కోహ్లీ.. వచ్చే వన్డే వరల్డ్ కప్ (2027) ఆడుతాడా? లేదా? అనేదానిపై సందిగ్ధత నెలకొంది.