మెల్బోర్న్: ఆస్ట్రేలియా-ఏతో జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో.. ఇండియా-ఏ జట్టు దారుణంగా ఆడుతోంది. రెండో ఇన్నింగ్స్‌లోనూ బ్యాటర్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆసీస్ బౌలర్ల ముందు నిలువలేకపోతున్నారు. రెండో ఇన్నింగ్స్‌లో 60 పరుగులకే ఇండియా 5 వికెట్లు కోల్పోయింది. మరోసారి కేఎల్ రాహుల్ విఫలం అయ్యాడు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం నాలుగు పరుగులు చేసిన అతను.. రెండో ఇన్నింగ్స్‌లో 10 పరుగులకే ఔట్ అయ్యాడు. మరో ఓపెనర్ ఈశ్వరన్ కూడా నిరాశపరిచాడు. అతను 17 రన్స్ చేశాడు. అయితే రాహుల్, ఈశ్వరన్‌లు ఇద్దరూ .. ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్‌కు ఇండియా సీనియర్ జట్టుకు ఎంపికైన విషయం తెలిసిందే.
“Don’t know what he was thinking!”
Oops… that’s an astonishing leave by KL Rahul 😱 #AUSAvINDA pic.twitter.com/e4uDPH1dzz
— cricket.com.au (@cricketcomau) November 8, 2024
స్పిన్నర్ రొచిసియోలి బౌలింగ్‌లో కేఎల్ రాహుల్ నిష్క్రమించిన తీరు ఆశ్చర్యకరంగా ఉంది. రొచిసియోలి వేసిన తొలి బంతి రాహుల్ ప్యాడ్స్ మీదకు వచ్చింది. అయితే లెగ్ సైడ్ వెళ్తున్నట్లుగా భావించిన రాహుల్ ఆ బంతిని ఆడలేదు. ప్యాడ్స్‌కు తగిలిన ఆ బాల్.. ఆ తర్వాత కాళ్ల మధ్య నుంచి వెళ్లి ఆఫ్ వికెట్‌ను పడేసింది. దీంతో అనూహ్య రీతిలో రాహుల్ ఔటయ్యాడు.
ఇక ఆస్ట్రేలియా-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 223 రన్స్‌కు ఆలౌటైంది. ఆ జట్టులో హారిస్ అత్యధికంగా 74 రన్స్ చేశాడు. భారత బౌలర్లలో ప్రసిద్ధి కృష్ణ 4, ముకేశ్ కుమార్ 3, ఖలీల్ అహ్మద్ 2 వికెట్లు తీసుకున్నారు.