KKR Vs RR | ఐపీఎల్లో భాగంగా డిపెండింగ్ చాంపియన్ కోల్‌కతా నైట్‌రైడర్స్ ఆదివారం రాజస్థాన్ రాయల్స్‌తో తలపడనున్నది. ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి ప్లేఆఫ్ రేసులో నిలువాలని కేకేఆర్ కృతనిశ్చయంతో ఉన్నది. లీగ్ దశలో ఇంకా కేకేఆర్ మూడు మ్యాచులు ఆడాల్సి ఉంది. జట్టు అన్ని మ్యాచుల్లో గెలిస్తే 17 పాయింట్లతో సులభంగా టాప్-4లో ప్రవేశిస్తుంది. కేకేఆర్ ఈ నాలుగు మ్యాచులను హోంగ్రౌండ్లోనే ఆడనున్నది. రాజస్థాన్‌తో మ్యాచ్ తర్వాత బుధవారం చెన్నై సూపర్ కింగ్స్‌తో సొంత మైదానంలో బుధవారం ఆడనున్నది. ఆ తర్వాత మే 10న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో మే 17న ఆడనున్నది. సన్‌రైజర్స్ జట్టు తడబడుతుండగా.. ఆర్సీబీ మాత్రం ఫుల్ ఫామ్‌లో ఉన్నది.
ఈ క్రమంలో కోల్‌కతాలో చివరి మ్యాచ్ ఆసక్తికరంగా మారనున్నది. కేకేఆర్ ప్రస్తుతం సొంత మైదానంలో ఆడబోయే రెండు మ్యాచులపై దృష్టి సారించింది. ఈ సీజన్లో రాజస్థాన్, చెన్నై జట్లు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించాయి. రెండు జట్లు ఒత్తిడి లేకుండా మైదానంలోకి అడుగుపెట్టనుండగా.. ఆ రెండు జట్లను ఎదుర్కోవడం అంత తేలికేం కాదు. కేకేఆర్ జట్టుకు ఆందోళనకరమైన విషయం ఏంటంటే.. హోంగ్రౌండ్లో జట్టు పేలవ ప్రదర్శన. ఈడెన్ గార్డెన్స్ కేకేఆర్ ఒకప్పుడు బలమైన జట్టుగా ఉండేది. కానీ, ఈ సారి ఇప్పటి వరకు హోంగ్రౌండ్లో ఆడిన ఐదు మ్యాచుల్లో కేవలం ఒకదాంట్లో మాత్రమే గెలవగలిగింది. పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా పూర్తిస్థాయిలో జరుగలేదు. దాంతో రెండుజట్లకు ఒక్కో పాయింట్ లభించింది. కేకేఆర్ స్పిన్నర్లు బౌన్స్‌ను సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యారు. అలాగే, బ్యాట్స్‌మెన్ సైతం ఆశించిన మేర రాణించలేకపోయారు. బ్యాటింగ్‌లో దూకుడు తగ్గింది. గతేడాది జట్టు దూకుడు కొనసాగించి టైటిల్‌ను సాధించింది. గత సీజన్లో అద్భుతంగా రాణించిన రింకు సింగ్.. ఈ సారి ఎనిమిది మ్యాచుల్లో కేవలం 169 పరుగులు మాత్రమే చేయగలిగాడు.
ఓపెనర్ క్వింటన్ డికాక్ ఏడు ఇన్నింగ్స్‌లో కలిపి 137.50 స్ట్రయిక్ రేట్‌తో 143 పరుగులు చేశాడు. కానీ, బ్యాటింగ్‌లో స్థిరత్వం లోపించింది. కానీ, కేకేఆర్ జట్టును వెంకటేశ్ అయ్యర్ తీవ్రంగా నిరాశపరిచాడు. ఫ్రాంచైజీ రూ.23.75 కోట్లకు కొనుగోలు చేసి వైస్ కెప్టెన్‌గా నియమించింది. వెంకటేశ్ అయ్యర్ పది మ్యాచ్‌ల్లో కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. కేకేఆర్ జట్టులో కెప్టెన్ అజింక్య రహానే రాణిస్తున్నాడు. చేతిగాయంతో బాధపడుతున్నారు. అయితే, ఆదివారం జరిగే మ్యాచ్‌లో ఆడుతానని విశ్వాసం వ్యక్తం చేశాడు. ఈ సీజన్లో రాజస్థాన్ రాయల్స్ ప్రదర్శన నిరాశపరిచింది. గత ఏడు మ్యాచ్‌ల్లో జట్టు ఒకే ఒక్క మ్యాచ్‌లోనే నెగ్గింది. జట్టు కూర్పు సరిగా లేదని విమర్శలున్నాయి. జట్టులో లోపాలున్నాయని క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. ఐపీఎల్ సంచలనంగా నిలిచిన 14 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ 35 బంతుల్లో సెంచరీ చేసి క్రికెట్ ప్రపంచం దృష్టిని ఆకర్షించాడు. కానీ ప్రతీ మ్యాచ్‌లో సూర్యవంశి నుంచి అలాంటే ప్రదర్శనను ఆశించలేమంటున్నారు.
రాజస్థాన్ రాయల్స్: రియాన్ పరాగ్ (కెప్టెన్), యశస్వి జైస్వాల్, ధ్రువ్ జురెల్, షిమ్రోన్ హెట్మెయర్, శుభమ్ దూబే, క్వెన్ ఎంఫాకా, వనిందు హసరంగా, తుషార్ దేశ్‌పాండే, సందీప్ శర్మ, ఫజల్హాక్ ఫరూఖీ, సంజు శాంసన్.
కోల్‌కతా నైట్ రైడర్స్: అజింక్యా రహానే (కెప్టెన్), క్వింటన్ డీ కాక్, వెంకటేశ్ అయ్యర్, రింకూ సింగ్, రఘువంశీ, సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్, రమణదీప్ సింగ్, స్పెన్సర్ జాన్సన్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి.