న్యూఢిల్లీ: భారత్ వేదికగా ఈనెల 13 నుంచి మొదలుకాబోతున్న అరంగేట్రం ఖో ఖో ప్రపంచకప్ కోసం ట్రోఫీతో పాటు మస్కట్స్ తేజస్, తారను జాతీయ ఖోఖో అసోసియేషన్(కేకేఎఫ్ఐ) ఆధ్వర్యంలో విడుదల చేశారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ(సాయ్) ఆధ్వర్యంలో ఇందిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో ఖోఖో ప్రపంచకప్ పోటీలు జరుగనున్నాయి. తొలిసారి జరుగబోతున్న ఈ టోర్నీలో ఆరు ఖండాలలోని 24 దేశాల నుంచి 21 పురుషుల, 20 మహిళల జట్లు బరిలో ఉన్నాయి. పురుషుల చాంపియన్షిప్ కోసం నీలిరంగు ట్రోఫీ, మహిళల ఈవెంట్ కోసం గ్రీన్ ట్రోఫీలను ఆవిష్కరించారు. మరోవైపు టోర్నీ అధికారిక మస్కట్లుగా ‘తేజస్’, ‘తార’ను ఫెడరేషన్ ఆధ్వర్యంలో విడుదల చేశారు. ఈ మస్కట్లు వేగం, చురుకుదనం..జట్టు కృషి వంటి ప్రధాన లక్షణాలు కల్గి ఉంటాయి. భారత సంప్రదాయ క్రీడ యొక్క వారసత్వాన్ని ప్రతిబింబించేలా వీటిని రూపొందించారు.