కొత్తపల్లి, అక్టోబర్ 27: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్‌సీఏ) సౌజన్యంతో కరీంనగర్ క్రికెట్ అసోసియేషన్(కేడీసీఏ) ఆధ్వర్యంలో జరిగిన క్రికెట్ పోటీలు సోమవారం ముగిశాయి. జిల్లా కేంద్రానికి సమీపంలోని అల్గునూరులో కొత్తగా ఏర్పాటు చేసిన వెలిచాల జగపతిరావు స్మారక క్రికెట్ మైదానం హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌లకు వేదికైంది. హైదరాబాద్ వెలుపల తొలిసారి జరిగిన లీగ్ మ్యాచ్‌ల్లో ప్లేయర్లు అద్భుత ప్రదర్శన కనబరిచారు. సోమవారం జరిగిన మ్యాచ్‌లో బడ్డింగ్ స్టార్స్ టీమ్ 16 పరుగుల తేడాతో కంబైన్డ్ డిస్ట్రిక్ టీమ్‌పై విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌కు దిగిన బడ్డింగ్ స్టార్స్ టీమ్ 45 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 277 పరుగులు చేసింది.
జయరాం కశ్యప్(117 బంతుల్లో 121 పరుగులు) సూపర్ సెంచరీతో జట్టు భారీ స్కోరులో కీలకమయ్యాడు. లక్ష్యఛేదనలో కంబైన్డ్ డిస్ట్రిక్ జట్టు 45 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 261 పరుగులకు పరిమితమైంది. హెచ్‌సీఏ లీగ్ మ్యాచ్‌లను విజయవంతంగా నిర్వహించిన కరీంనగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధులు ఆగంరావు, మురళీధర్‌రావు, మహేందర్‌గౌడ్‌ను క్రీడా సంఘాల ప్రతినిధులు, సీనియర్ ప్లేయర్లు అభినందించారు.