Yarraji Jyothi | టెహ్రాన్: భారత స్టార్ అథ్లెట్ యర్రాజీ జ్యోతి మళ్లీ మెరిసింది. తన పరుగుకు తిరుగులేదని నిరూపిస్తూ ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో సత్తాచాటింది. శనివారం జరిగిన మహిళల 60మీటర్ల హర్డిల్స్ రేసును 8.12 సెకన్లలో పూర్తి చేసి సరికొత్త రికార్డుతో పసిడి పతకాన్ని ముద్దాడింది. ఈ క్రమంలో ఆసియాగేమ్స్(2022)లో 100మీటర్ల హర్డిల్స్‌లో 8.13సెకన్ల టైమింగ్‌తో తన పేరిటే ఉన్న జాతీయ రికార్డును తాజాగా జ్యోతి అధిగమించింది.
అంతకుముందు జరిగిన హీట్స్‌లో ఆకట్టుకున్న ఈ ఆంధ్రప్రదేశ్ యువ అథ్లెట్ ఫైనల్లో ప్రత్యర్థులకు దీటైన పోటీనిస్తూ స్వర్ణం ఖాతాలో వేసుకుంది. అసుకా టెరెడా(8.21సె), లుయి లా యు(8.26సె) వరుసగా రజత, కాంస్య పతకాలు కైవసం చేసుకున్నారు. గతేడాది బ్యాంకాక్‌లో జరిగిన ఏషియన్ ఔట్‌డోర్ చాంపియన్‌షిప్‌లోనూ జ్యోతి పోడియం ఫినిష్‌తో ఆకట్టుకుంది.