చినుకులా మొదలై.. జడివానల మారి.. వరదలా పారి..ఏరులై ప్రవహించిన బట్లర్ ఉప్పెన.. ఢిల్లీని ముంచెత్తింది. బంతి తన పరిధిలో పడితే చాలు.. దాని గమ్యస్థానం బౌండ్రీనే అన్న తరహాలో బట్లర్ వీరంగమాడితే.. పడిక్కల్, శాంసన్ అగ్నికి ఆజ్యం పోస్తూ సహకరించారు. ఫలితంగా సీజన్లో మూడో సెంచరీ తన పేరిట రాసుకున్న బట్లర్.. ఐపీఎల్-15లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రాయల్స్‌ను నిలిపాడు. ఛేదనలో పంత్, పావెల్ పోరాడినా ఫలితం లేకపోయింది. ఈ విజయంతో రాయల్స్ పట్టికలో టాప్కు దూసుకెళ్లింది.
ముంబై: మంచినీళ్ల ప్రాయంలా శతకాలు బాదుతున్న ఓపెనర్ జోస్ బట్లర్ తాజా సీజన్లో మూడో సెంచరీతో కదం తొక్కడంతో ఐపీఎల్-15లో రాజస్థాన్ ఐదో విజయం నమోదు చేసుకుంది. శుక్రవారం జరిగిన పోరులో రాజస్థాన్ రాయల్స్ 15 పరుగుల తేడాతో ఢిల్లీ క్యాపిటల్స్‌పై విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 222 పరుగులు చేసింది.
జోస్ బట్లర్ (65 బంతుల్లో 116; 9 ఫోర్లు, 9 సిక్సర్లు) తాజా సీజన్లో మూడో సెంచరీతో వీరవిహారం చేస్తే.. మరో ఓపెనర్ దేవదత్ పడిక్కల్ (35 బంతుల్లో 54; 7 ఫోర్లు, 2 సిక్సర్లు), కెప్టెన్ సంజూ శాంసన్ (19 బంతుల్లో 46 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) దంచికొట్టారు. ఢిల్లీ బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపలేకపోగా.. ఖలీల్ అహ్మద్, ముస్తఫిజుర్ రెహమాన్ చెరో వికెట్ ఖాతాలో వేసుకున్నారు. అనంతరం లక్ష్యఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 8 వికెట్లకు 207 పరుగులు చేసింది. రిషబ్ పంత్ (24 బంతుల్లో 44; 4 ఫోర్లు, 2 సిక్సర్లు), పృథ్వీ షా (37; 5 ఫోర్లు, ఒక సిక్సర్), లలిత్ యాదవ్ (37; 3 ఫోర్లు, 2 సిక్సర్లు), రావ్మన్ పావెల్ (15 బంతుల్లో 36; 5 సిక్సర్లు) పోరాడినా ఫలితం లేకపోయింది. రాజస్థాన్ బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ 3, అశ్విన్ రెండు వికెట్లు పడగొట్టారు. బట్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. లీగ్‌లో భాగంగా శనివారం తొలి పోరులో కోల్‌కతాతో గుజరాత్.. రెండో మ్యాచ్‌లో బెంగళూరుతో హైదరాబాద్ తలపడనున్నాయి.
కొట్టుడే కొట్టుడు..
కెరీర్లోనే అత్యుత్తమ ఫామ్‌లో కనిపిస్తున్న రాజస్థాన్ ఓపెనర్ జోస్ బట్లర్.. ఢిల్లీ బౌలర్లను ఆటాడుకున్నాడు. చెత్త బంతి, మంచి బంతి అనే తేడా లేకుండా.. దండయాత్ర ప్రకటించాడు. ఫలితంగా ఈ సీజన్లో మూడు సెంచరీ తన పేరిట లిఖించుకున్న బట్లర్.. రాయల్స్‌కు కొండంత స్కోరు అందించాడు. ఖలీల్ అహ్మద్ వేసిన ఇన్నింగ్స్ తొలి ఓవర్లో రెండు ఫోర్లతో మొదలైన బట్లర్ బాదుడు.. సెంచరీ వరకు అప్రతిహతంగా సాగింది. తాజా సీజన్లో పెద్దగా ఆకట్టుకోలేకపోయిన యువ ఓపెనర్ దేవదత్ పడిక్కల్.. ఈ మ్యాచ్‌లో రాణించాడు.
ముస్తఫిజుర్ వేసిన నాలుగో ఓవర్లో హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన పడిక్కల్.. బట్లర్‌కు చక్కటి సహకారం అందించాడు. ఆరంభంలో ఢిల్లీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో తొలి ఐదు ఓవర్లలో రాజస్థాన్ వికెట్ నష్టపోకుండా 29 పరుగులే చేయగలిగింది. ఆరో ఓవర్లో రెండు సిక్సర్లు అరుసుకున్న బట్లర్.. కుల్దీప్ 6,4 రుచి చూపించాడు. అక్షర్ ఓవర్లో పడిక్కల్ 6,4 కొట్టడంతో రాజస్థాన్ స్కోరు బోర్డు ఉరకలెత్తింది. ఈ క్రమంలో బట్లర్ 36 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేసుకోగా.. లలిత్ ఓవర్లో 4,6 తో పడిక్కల్ 31 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు.
లలిత్ ఓవర్లో 6,4,6తో విధ్వంసాన్ని మరో స్థాయికి తీసుకెళ్లిన బట్లర్.. కుల్దీప్ ఓవర్లో 6,6,4తో సునామీ సృష్టించాడు. తొలి వికెట్‌కు 155 పరుగులు జోడించాక పడిక్కల్ ఔటైనా.. సంజూ శాంసన్ రాకతో ఢిల్లీ కష్టాలు మరింత పెరిగాయి. ఈ క్రమంలో బట్లర్ 57 బంతుల్లో సీజన్లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఖలీల్ వేసిన 18వ ఓవర్లో శాంసన్ 4,6,4,6 అరుసుకుంటే.. ముస్తఫిజుర్ ఓవర్లో బట్లర్ 4,6తో జట్టు స్కోరును రెండొందలు దాటించాడు. భారీ షాట్ కొట్టే ప్రయత్నంలో బట్లర్ ఔటైనా.. ఆఖరి ఓవర్లో శాంసన్ 4,4,6 కొట్టి తన జట్టుకు సీజన్లో అత్యధిక స్కోరు అందించాడు.
ఆఖర్లో ఉత్కంఠ
ఢిల్లీ విజయానికి 6 బంతుల్లో 36 పరుగులు చేయాల్సిన దశలో.. పావెల్ అద్భుత పోరాటంతో ఉత్కంఠ రేపాడు. మెకాయ్ వేసిన చివరి ఓవర్ తొలి మూడు బంతులను భారీ సిక్సర్లుగా మలిచాడు. దీంతో విజయ సమీకరణం 3 బంతుల్లో 18గా మారింది. అయితే మూడో బంతి నిర్ణీత ఎత్తు కంటే ఎక్కువ ఎత్తులో వచ్చిందని.. దాన్ని నోబాల్‌గా ప్రకటించాలని డగౌట్ నుంచి రిషబ్ పంత్ అంపైర్లపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఒక దశలో మ్యాచ్ ఆపేసి వెనక్కి వచ్చేయాల్సిందిగా ఢిల్లీ బ్యాటర్లను సూచించాడు. ఢిల్లీ ఫ్రాంచైజీ ప్రతినిధి ఒకరు మైదానంలోకి వచ్చి ఈ విషయంలో అంపైర్‌తో వాదనకు దిగాడు. అయితే తన నిర్ణయానికే కట్టుబడిన అంపైర్ మ్యాచ్‌ను కొనసాగించగా.. మిగిలిన మూడు బంతులకు రెండు పరుగులే రావడంతో ఢిల్లీకి పరాజయం తప్పలేదు. మ్యాచ్ అనంతరం ఈ అంశంపై స్పందించిన పంత్.. అంపైరింగ్ ప్రమాణాలు మెరుగు పడాల్సిన అవసరముందని పేర్కొన్నాడు.
సంక్షిప్త స్కోర్లు
రాజస్థాన్: 20 ఓవర్లలో 222/2 (బట్లర్ 116, పడిక్కల్ 54; ముస్తఫిజుర్ 1/43, ఖలీల్ 1/47), ఢిల్లీ: 20 ఓవర్లలో 207/8 (పంత్ 44, లలిత్ 37; ప్రసిద్ధ్ 3/22, అశ్విన్ 2/32).