టెస్టు మ్యాచ్‌పై పట్టు ఎలా సాధించాలో చూపుతూ.. సెషన్ల వారిగా ఎలా గేర్లు మార్చాలో నేర్పుతూ.. సుదీర్ఘ ఫార్మాట్లో ఇన్నింగ్స్ ఎలా నిర్మించాలో ఆచరణలో పెడుతూ.. ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ విజృంభించిన వేళ.. రెండో టెస్టులో టీమ్ ఇండియాపై ఆతిథ్య జట్టు పైచేయి సాధించింది. మరో ఎండ్ నుంచి సహకారంతో సంబంధం లేకుండా.. రోజంతా బ్యాటింగ్ చేసిన రూట్.. భారత బౌలర్లకు చెమటలు కక్కిస్తూ.. వన్‌మ్యాన్ షో కనబర్చాడు. మనవాళ్ల బౌలింగ్ మరీ అంత పేలవంగా లేకపోయినా.. రూట్ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో.. టీమ్ఇండియాను బ్యాక్ఫుట్పైకి నెట్టాడు.
లండన్: సుదీర్ఘ ఫార్మాట్‌కు ప్రాణమిచ్చే దేశంలో.. క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా.. ఇంగ్లండ్ సారథి జో రూట్ (321 బంతుల్లో 180 నాటౌట్; 18 ఫోర్లు) అసాధారణ ఇన్నింగ్స్‌తో అదరగొట్టాడు. భారత బౌలర్లకు కొరుకుడు పడని కొయ్యలా మారి.. రోజంతా విసిగించిన రూట్ ద్విశతకానికి అడుగు దూరంలో నిలిచిపోయాడు. ఫలితంగా టీమ్ఇండియాతో జరుగుతున్న రెండో టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్.. 391కి ఆలౌటై.. 27 పరుగుల కీలక ఆధిక్యం మూటగట్టుకుంది. ఇంగ్లండ్ టెస్టు చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో గ్రహం గూచ్ (8900)ను దాటిన రూట్ (9067).. మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ (12472) తర్వాత రెండో స్థానానికి చేరాడు. భారత బౌలర్లలో హైదరాబాదీ పేసర్ మహమ్మద్ సిరాజ్ 4, ఇషాంత్ శర్మ 3, షమీ 2 వికెట్లు పడగొట్టారు. మరో రెండు రోజుల ఆట మాత్రమే మిగిలి ఉంది.
ఒకే ఒక్కడు..
భారత పేసర్ల ధాటికి వరుస బంతుల్లో రెండు వికెట్లు కోల్పోయి 23/2తో కష్టాల్లో పడ్డ సమయంలో క్రీజులో అడుగుపెట్టిన ఇంగ్లండ్ కెప్టెన్ రూట్.. ఆఖరి వరకు అజేయంగా నిలిచాడు. ఈ క్రమంలో ఎన్నో మైలురాళ్లను దాటిన రూట్.. భారత ఆటగాళ్ల ఆత్మవిశ్వాసంపై దెబ్బకొట్టాడు. ఓవర్‌నైట్ స్కోరు 119/3తో శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన ఇంగ్లండ్.. మొదటి సెషన్లో ఏమాత్రం ఇబ్బంది పడలేదు. మరో ఎండ్ నుంచి జానీ బెయిర్‌స్టో (57) అతడికి చక్కటి సహకారం అందించాడు. ప్రమాదకర బంతుల జోలికి వెళ్లని ఈ జోడీ.. చెత్త బంతులను చీల్చి చెండాడుతూ స్కోరు బోర్డును నడిపించింది. నాలుగో వికెట్‌కు 121 పరుగులు జోడించాక సిరాజ్ ఈ భాగస్వామ్యాన్ని విడదీశాడు. ఆ తర్వాత జోస్ బట్లర్ (23), మొయిన్ అలీ (27) అండతో రూట్ బండి లాగించాడు. ఈ దశలో వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ.. బట్లర్, మొయిన్ అలీతో పాటు సామ్ కరన్ (0)లను ఔట్ చేసి టీమ్ఇండియాను పోటీలోకి తేగా.. టెయిలెండర్ల అండతో రూట్ భారత స్కోరును దాటి కీలక ఆధిక్యం సాధించాడు.
రాహుల్‌పైకి బీరు మూతలు
తొలి ఇన్నింగ్స్‌లో చక్కటి శతకంతో టీమ్ఇండియా భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించిన ఓపెనర్ కేఎల్ రాహుల్‌పై ఇంగ్లండ్ అభిమానులు తమ అక్కసు వెళ్లగక్కారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో రాహుల్ బౌండ్రీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కొందరు ఇంగ్లండ్ అభిమానులు.. అతడిపైకి బాటిల్ కార్క్స్ (బీరు సీసాల మూతలు) విసిరారు. ఇది గమనించిన భారత కెప్టెన్ కోహ్లీ.. వాటిని బయట పడేసి నీ పని మీద దృష్టి పెట్టు అంటూ రాహుల్‌కు సూచించాడు.
స్కోరు బోర్డు
భారత్ తొలి ఇన్నింగ్స్: 364, ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: బర్న్స్ (ఎల్బీ) షమీ 49, సిబ్లే (సి) రాహుల్ (బి) సిరాజ్ 11, హసీబ్ (బి) సిరాజ్ 0, రూట్ (నాటౌట్) 180, బెయిర్‌స్టో (సి) కోహ్లీ (బి) సిరాజ్ 57, బట్లర్ (బి) ఇషాంత్ 23, అలీ (సి) కోహ్లీ (బి) ఇషాంత్ 27, కరన్ (సి) రోహిత్ (బి) ఇషాంత్ 0, రాబిన్సన్ (ఎల్బీ) సిరాజ్ 6, వుడ్ (రనౌట్) 5, అండర్సన్ (బి) షమీ 0, ఎక్స్‌ట్రాలు: 33, మొత్తం: 391 ఆలౌట్. వికెట్ల పతనం: 1-23, 2-23, 3-108, 4-229, 5-283, 6-341, 7-341, 8-357, 9-371, 10-391, బౌలింగ్: ఇషాంత్ 24-4-69-3, బుమ్రా 26-6-79-0, షమీ 26-3-95-2, సిరాజ్ 30-7-94-4, జడేజా 22-1-43-0.