బాక్సింగ్ డే టెస్టు పేరుకు తగ్గట్టే తొలి రోజు బ్యాటర్ల దూకుడుతో ప్రారంభమైంది. ఆతిథ్య ఆస్ట్రేలియా తరఫున అరంగేట్ర కుర్రాడు సామ్ కాన్స్టాస్ నాటు కొట్టుడుకు తోడు సీనియర్ బ్యాటర్లు ఖవాజా, లబూషేన్, స్మిత్ నిలకడైన ఆటతీరుతో మొదటి రోజు ఆటలో కంగారూలు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. ఆడుతున్నది తొలి టెస్టు అయినా భయమన్నదే లేకుండా క్రీజులో మెరుపులు మెరిపించిన కాన్స్టాస్.. ఆసీస్‌కు అదిరిపోయే ఆరంభాన్నిచ్చాడు. ఈ సిరీస్‌లో కంగారూలను ముప్పు తిప్పలు పెడుతున్న బుమ్రాతో పాటు ఇతర బౌలర్లపై పిడుగులా విరుచుకుపడ్డాడు. కాన్స్టాస్ నిష్క్రమించినా మిగిలిన బ్యాటర్లు జోరు కొనసాగించారు. కంగారూల బ్యాటింగ్‌కు తేలిపోయి రెండు సెషన్ల పాటు వికెట్ల వేటలో వెనుకబడ్డ భారత బౌలర్లు చివరి సెషన్లో కీలకమైన నాలుగు వికెట్లు పడగొట్టడం విశేషం.
మెల్బోర్న్: ప్రతిష్టాత్మక మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ (ఎంసీజీ) వేదికగా సుమారు 87వేల మంది ప్రేక్షకులు హాజరైన భారత్, ఆస్ట్రేలియా బాక్సింగ్ డే టెస్టులో తొలి రోజు ఆతిథ్య జట్టు బ్యాటింగ్‌లో అదరగొట్టింది. ఎంసీజీలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్‌కు వరుసగా నలుగురు టాపార్డర్ బ్యాటర్లు అర్ధసెంచరీలతో మెరవడంతో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 86 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 311 పరుగులు చేసింది. అరంగేట్ర మ్యాచ్‌లోనే యువ ఓపెనర్ సామ్ కాన్స్టాస్ (65 బంతుల్లో 60, 6 ఫోర్లు, 2 సిక్సర్లు) టీ20 తరహా ఆటకు తోడు సీనియర్లు మార్నస్ లబూషేన్ (145 బంతుల్లో 72, 7 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (111 బంతుల్లో 68 నాటౌట్, 5 ఫోర్లు, 1 సిక్స్), ఉస్మాన్ ఖవాజా (121 బంతుల్లో 57, 6 ఫోర్లు) అర్ధసెంచరీలతో కదం తొక్కారు. తొలి రెండు సెషన్లూ కంగారూల ఆధిపత్యం కొనసాగిన మ్యాచ్‌లో ఆఖరి సెషన్లో టీమ్ఇండియా పుంజుకుంది. బుమ్రా (3/75)తో పాటు ఇతర బౌలర్లు రాణించడంతో రోహిత్ సేన ఊపిరి పీల్చుకుంది.
కాన్స్టాస్ మెరుపులు ముగిసిన తర్వాత మెల్బోర్న్లో ఆసీస్ సీనియర్ల షో మొదలైంది. లంచ్ అనంతరం ఖవాజా, లబూషేన్ భారత బౌలర్లను విసిగించారు. ఈ ఇద్దరూ డిఫెన్స్‌కే ప్రాధాన్యమిస్తూ వీలుచిక్కినప్పుడల్లా పరుగులు రాబట్టారు. 101 బంతుల్లో ఖవాజా ఫిఫ్టీ పూర్తయింది. ఈ సిరీస్‌లో అతడికి ఇదే తొలి అర్ధ సెంచరీ. రెండో వికెట్‌కు 150 బంతుల్లో 65 పరుగులు జోడించిన ఈ జోడీని డ్రింక్స్ తర్వాత ఎట్టకేలకు బుమ్రా విడదీశాడు. ఈ సిరీస్‌లో బుమ్రా బౌలింగ్‌లో ఔటవడం ఖవాజాకు ఇది ఐదోసారి. ఖవాజా స్థానంలో వచ్చిన స్మిత్ కూడా తనకు ఎంతో ఇష్టమైన ఎంసీజీలో ఆకట్టుకున్నాడు. ఈ ఇద్దరినీ ఔట్ చేయడానికి రోహిత్.. బౌలర్లను మార్చి మార్చి ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. 114 బంతుల్లో లబూషేన్ హాఫ్ సెంచరీ పూర్తయింది.
ప్రమాదకరంగా మారుతున్న లబూషేన్-స్మిత్ జోడీని రెండో సెషన్ డ్రింక్స్ విరామం తర్వాత వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. అతడు వేసిన తొలి బంతిని మిడాఫ్ దిశగా ఆడబోయిన లబూషేన్.. కోహ్లీకి దొరికిపోయాడు. అతడి స్థానంలో క్రీజులోకి వచ్చిన ప్రమాదకర ట్రావిస్ హెడ్ (0) డకౌట్ అయ్యాడు. బుమ్రా వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన హెడ్.. మూల్యం చెల్లించుకోక తప్పలేదు. తన తర్వాతి ఓవర్లో బుమ్రా.. మిచెల్ మార్ష్ (4)నూ పెవిలియన్‌కు పంపాడు. అలెక్సీ కేరీ (31)ని ఆకాశ్ దీప్ అద్భుతమైన లెంగ్త్ డెలివరీతో బోల్తా కొట్టించాడు. మొదటి రోజు ఆట ముగిసే సమయానికి స్మిత్, సారథి పాట్ కమిన్స్ (8 నాటౌట్) క్రీజులో ఉన్నారు. రెండో రోజు ఆసీస్‌ను వీలైనంత త్వరగా ఆలౌట్ చేసి ఆ జట్టుకు దీటుగా బ్యాటింగ్ చేయడం భారత్ ముందున్న కర్తవ్యం.
కొంతకాలంగా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మెరుపులు మెరిపిస్తూ జాతీయ జట్టు నుంచి పిలుపు అందుకున్న యువ ఓపెనర్ కాన్స్టాస్.. తన తొలి మ్యాచ్‌లోనే అంచనాలకు మించి రాణించాడు. 19 ఏండ్ల 85 రోజులకే అంతర్జాతీయ అరంగేట్రం చేసిన ఈ కుర్రాడు.. ప్రమాదకర బుమ్రాతో పాటు భారత బౌలర్లనూ ఆటాడుకున్నాడు. ఆడుతున్నది తొలి మ్యాచే అయినా ఏమాత్రం బెరుకు లేకుండా ఆది నుంచే దంచుడు మంత్రాన్ని పఠించాడు. ఎదుర్కున్న మొదటి 21 బంతుల్లో అతడు 5 పరుగులే చేశాడు. కానీ అది తుఫాను ముందు ప్రశాంతతే. బుమ్రా వేసిన ఇన్నింగ్స్ ఏడో ఓవర్ నుంచి మొదలైంది కాన్స్టాస్ కొట్టుడు. ఆ ఓవర్ తొలి బంతిని బౌండరీకి తరలించిన అతడు రెండో బంతిని సిక్సర్‌గా మలిచాడు. ఈ రెండూ రివర్స్ స్కూప్ షాట్లే. 2021 తర్వాత టెస్టులలో బుమ్రా బౌలింగ్‌లో సిక్సర్ కొట్టిన తొలి క్రికెటర్ కాన్స్టాసే. ఈ ఓవర్లో 14 పరుగులు పిండుకున్న అతడు.. బుమ్రానే వేసిన 11వ ఓవర్లో 4, 6, 4, 2తో ఏకంగా 18 పరుగులు రాబట్టాడు. కాన్స్టాస్ దూకుడుతో ఆసీస్ స్కోరు వేగం పుంజుకుంది. 52 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తిచేసుకున్న అతడు.. జడేజా 20వ ఓవర్లో రెండో బంతికి వికెట్ల ముందు దొరికిపోవడంతో 89 పరుగుల తొలి వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఐసీసీ షాకిచ్చింది. మెల్బోర్న్ టెస్టు తొలిరోజు ఆటలో భాగంగా కోహ్లీ.. ఆసీస్ ఓపెనర్ కాన్‌స్టస్‌ను కవ్వించడంతో పాటు వాగ్వాదానికి దిగినందుకు గాను ఐసీసీ తక్షణ చర్యలకు ఉపక్రమించింది. ఐసీసీ నియమావళిలోని ఆర్టికల్ 2.12ను అతడు ఉల్లంఘించాడని మ్యాచ్ రిఫరీ ఆండీ పైక్రాఫ్ట్ తెలిపాడు. బుమ్రా వేసిన 11వ ఓవర్లో కోహ్లీ.. నాన్ స్ట్రయికర్ ఎండ్ నుంచి వస్తున్న కాన్స్టాస్ భుజాన్ని తోసుకుంటూ వెళ్లిపోయాడు. ఇదే సమయంలో కాన్స్టాస్ ఏదో అనడంతో దానికి కోహ్లీ కూడా దీటుగా స్పందించాడు. దీంతో ఇరువురి మధ్య కొంతసేపు వాగ్వాదం చోటుచేసుకుంది. కోహ్లీపై ఒక మ్యాచ్ నిషేధం విధించాలని డిమాండ్లు వచ్చినా అతడు తప్పు ఒప్పుకోవడంతో మ్యాచ్ ఫీజులో 20 శాతం కోత, ఒక డీమెరిట్ పాయింట్ విధిస్తూ ఐసీసీ నిర్ణయం తీసుకుంది.
ఆస్ట్రేలియా: 86 ఓవర్లలో 311/6 (లబూషేన్ 72, స్మిత్ 68, బుమ్రా 3/75, వాషింగ్టన్ 1/37)