Sri Lanka Vs South Africa | డర్బన్ : స్వదేశంలో శ్రీలంకతో జరుగుతున్న తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పేసర్ మార్కొ జాన్సెన్ (7/13) బెంబేలెత్తించడంతో లంకేయులు విలవిల్లాడారు. జాన్సెన్‌తో పాటు గెరాల్డ్ కొయెట్జీ (2/18) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో లంక 13.5 ఓవర్లలో 42 పరుగులకే ఆలౌట్ అయింది. టెస్టులలో ఇది వారికి అత్యల్ప స్కోరు (అంతకుముందు పాక్‌పై 71).
జాన్సెన్ 6.5 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసి 13 పరుగులే ఇవ్వగా ఓ మెయిడిన్‌తో పాటు 7 వికెట్లు తీసి లంకను కోలుకోలేని దెబ్బ కొట్టాడు. టెస్టులలో అతడికిదే అత్యుత్తమ ప్రదర్శన. జాన్సెన్ ధాటికి శ్రీలంక బ్యాటర్లలో ఏకంగా ఐదుగురు డకౌట్ అవగా మరో నలుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. కమిందు మెండిస్ (13), లాహిరు కుమార (10) మాత్రమే రెండంకెల స్కోరు చేశారు. తొలి ఇన్నింగ్స్‌లో సఫారీలకు 149 పరుగుల ఆధిక్యం దక్కగా రెండో ఇన్నింగ్స్‌లో 40 ఓవర్లలో 130/3 పరుగులు చేశారు.