Jannik Sinner | మెల్బోర్న్: ప్రతిష్టాత్మక ఆస్ట్రేలియా ఓపెన్ టైటిల్ (పురుషుల)ను ఇటలీ కుర్రాడు యానిక్ సిన్నర్ నిలబెట్టుకున్నాడు. డిఫెండింగ్ చాంపియన్‌గా ఈ టోర్నీ బరిలో నిలిచిన అతడు.. ఫైనల్లో జర్మనీ ఆటగాడు అలెగ్జాండర్ జ్వెరెవ్‌ను మట్టికరిపించి వరుసగా రెండో టైటిల్‌ను, కెరీర్లో మూడో గ్రాండ్ స్లామ్ టైటిల్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. రాడ్ లీవర్ ఎరీనా వేదికగా ఆదివారం ముగిసిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో 23 ఏండ్ల సిన్నర్.. 6-3, 7-6 (7/4), 6-3తో జ్వెరెవ్‌పై గెలిచాడు. 2 గంటల 42 నిమిషాల పాటు హోరాహోరిగా జరిగిన పోరులో సిన్నర్ దూకుడుకు ఆరంభంలో అడ్డుకట్ట వేసిన జ్వెరెవ్.. రెండో సెట్ టైబ్రేక్ తర్వాత చేతులెత్తేశాడు. తొలి సెట్ ఒకదశలో 3-3తో స్కోరు సమంగా ఉన్నప్పటికీ ఆ తర్వాత సిన్నర్ పుంజుకున్నాడు.
బలమైన ఫోర్‌హ్యాండ్ షాట్లతో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. కానీ రెండో సెట్లో జ్వెరెవ్ జూలు విదిల్చాడు. అతడు గట్టిగానే పోరాడటంతో సెట్ టైబ్రేక్‌కు దారితీసింది. టైబ్రేక్ ఆరంభంలో పాయింట్లు సాధించిన జ్వెరెవ్.. ఆ తర్వాత సిన్నర్ జోరు ముందు నిలవలేకపోయాడు. ఇక మూడో సెట్లో మాత్రం టాప్ సీడ్ మరింత జోరు పెంచడంతో జ్వెరెవ్‌కు నిరాశ తప్పలేదు. ఇప్పటిదాకా మూడు గ్రాండ్ స్లామ్ ఫైనల్స్‌కు వెళ్లిన జ్వెరెవ్.. మరోసారి తుది మెట్టు ముందు బోల్తా కొట్టడంతో మ్యాచ్ ముగిసిన తర్వాత అతడు కన్నీటి పర్యంతమయ్యాడు.
మ్యాచ్‌లో సిన్నర్ 6 ఏస్‌లు, 32 విన్నర్లు కొట్టగా జ్వెరెవ్ 12 ఏస్‌లు సంధించినా 45 అనవసర తప్పిదాలతో పరాజయం వైపున నిలిచాడు. ఇక ఈ విజయంతో సిన్నర్.. 1992-93 (జిమ్ కొరియర్) తర్వాత ఆస్ట్రేలియా ఓపెన్‌ను వరుసగా రెండేండ్లు గెలిచిన ఆటగాడిగా పిన్న వయస్కుడిగా రికార్డులకెక్కాడు. 2024లో ఆస్ట్రేలియా ఓపెన్, యూఎస్ ఓపెన్ గెలిచిన ఈ ఇటలీ యువ సంచలనం.. ఆ దేశం తరఫున మూడు గ్రాండ్‌స్లామ్‌లు గెలిచిన తొలి ఆటగాడిగా కూడా చరిత్ర సృష్టించాడు.