Shreyas Iyer | కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) జట్టుకు కప్‌ను అందించిన కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్‌ను కాదని మరో ఆరుగురు ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. ఈ నిర్ణయం క్రికెట్ అభిమానులందరినీ షాక్‌కు గురి చేసింది. అయితే, అయ్యర్‌ను రిటైన్ చేయకపోవడంపై వెనుక కారణాలను కేకేఆర్ సీఈవో వెంకీ మైసూర్ వెల్లడించారు. శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో కేకేఆర్ 2024 ఐపీఎల్ సీజన్లో ఛాంపియన్‌గా నిలిచింది. కేకేఆర్‌ను వీడడం వెనుక నిర్ణయం పూర్తిగా శ్రేయాస్దేనని.. దాంతో కేకేఆర్‌కు ఎలాంటి సంబంధం లేదన్నారు. అతని నిర్ణయం మేరకు రిటైన్ చేసుకోలేదన్నారు. వేలంలో శ్రేయాస్ తన మార్కెట్ విలువను పరీక్షించుకోవాలనుకుంటున్నాడని వెంకీ మైసూర్ పేర్కొన్నారు.
ఓ స్పోర్ట్స్ యూట్యూబ్ ఛానెల్‌తో ఆయన మాట్లాడుతూ.. రిటెన్షన్ జాబితాలో శ్రేయాస్ అయ్యర్ పేరు మొదటి స్థానంలో ఉన్నాడని తెలిపారు. 2022లో ఆయనను కెప్టెన్‌గా ఎంచుకున్నామని తెలిపారు. రిటైన్ ప్రక్రియకు పరస్పర అంగీకారం అవసరమని.. అయితే, శ్రేయాస్ అయ్యర్‌తో అలా జరుగలేదని వెంకీ మైసూర్ పేర్కొన్నారు. రిటైన్ కోసం ఆటగాడు, ఫ్రాంచైజీ మధ్య పరస్పరం అంగీకారం కావాలని.. ఇందులో ఏకపక్షంగా ఉండేందుకు వీలులేదని.. ఈ క్రమంలో ఫ్రాంచైజీ ఇందులో ఏం చేయలేదన్నారు. ఆటగాడు అనేక అంశాలను పరిగణనలోకి తీసుకుని అంగీకరించాలన్నారు. ఎవరైనా మార్కెట్ విలువను పరీక్షించాలనుకుంటే నిర్ణయం ప్రభావితమవుతుందన్నారు. శ్రేయాస్‌తో తనకు మంచి అనుబంధం ఉందని, వేలంలో అతని మార్కెట్ విలువ చూడాలని పేర్కొన్నారు.
శ్రేయాస్ నిర్ణయానికి ఈ సందర్భంగా ఆయన మద్దతు పలికారు. ఆటగాళ్లు తమ వాణిజ్య విలువకు ప్రాధాన్యత ఇవ్వడం, ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు. ఈ సందర్భంలో తన గురించి తెలుసుకునేందుకు ఇదే ఉత్తమ సమయం అతడు భావించాడని.. వేలానికి వెళ్లి విలువను పరీక్షించుకోవాలనుకునే విషయంలో ఆటగాళ్లకు తాము మద్దతిస్తామన్నారు. ఈ ఏడాది వేలంలో కేకేఆర్‌తోపాటు పలు జట్లు కెప్టెన్ కోసం వెతుకుతున్నాయి. పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మెగా వేలంలో శ్రేయస్‌కి డిమాండ్ పెరిగే అవకాశం కనిపిస్తుంది. ఇక కేకేఆర్ రింకూ సింగ్, వరుణ్, సునీల్ నరైన్, రస్సెల్, హర్షిత్, రమణ్దీప్ను రిటైన్ చేసుకున్నది.
We hope people won’t say anymore Shreyas Iyer didn’t get the respect he deserves. KKR gave him first retention but he didn’t accept. Hear what Venky Mysore is saying 👍🏻pic.twitter.com/11PW0a0pCY
— KKR Vibe (@KnightsVibe) November 1, 2024