IPL 2025 | పహల్గాం ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్‌లోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై భారత సైన్యం మెరుపుదాడులు చేసింది. ఉద్రిక్తత పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పలు ఎయిర్‌పోర్ట్‌లను మూసివేసింది. విమానాశ్రయాలను అత్యవసరంగా మూసివేశారు. పెద్ద ఎత్తున విమానాలు రద్దయ్యాయి. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఆయా ఎయిర్‌పోర్టులను తెరువొద్దని కేంద్రం ఆదేశించింది. ఈ నిర్ణయం ఐపీఎల్‌పై ప్రభావం పడే అవకాశాలున్నాయి. ధర్మశాల పంజాబ్ కింగ్స్‌కు హోంగ్రౌండ్ కాగా.. ప్రస్తుతం ధర్మశాలలో రెండు మ్యాచులు ఆడాల్సి ఉంది. పంజాబ్ కింగ్స్- ఢిల్లీ క్యాపిటల్స్ గురువారం ధర్మశాలలో మ్యాచ్ జరుగనున్నది.
అలాగే, ఈ నెల మే 11న పంజాబ్ ముంబయి ఇండియన్స్ ధర్మశాలలో మ్యాచ్ జరుగనున్నది. ఈ మ్యాచ్ కోసం ముంబయి అక్కడికి గురువారం చేరుకోవాల్సి ఉంది. అయితే, ధర్మశాల ఎయిర్‌పోర్టు మూసివేత కారణంగా ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాలపై ముంబయి దృష్టి సారించింది. చండీగఢ్ ఎయిర్‌పోర్టు సైతం మూసివేయడంతో జట్టు మొదట ఢిల్లీకి చేరుకొని.. రోడ్డు మార్గం ద్వారా ధర్మశాలకు వెళ్లే అవకాశాలున్నాయి. దాంతో జట్టు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. అయితే, దీనిపై ముంబయి ప్రకటించలేదు. రేపు జరగాల్సిన మ్యాచ్ కోసం ఢిల్లీ ఇప్పటికే ధర్మశాలకు చేరుకుంది. అయితే, ఢిల్లీ ఆదివారం అరుణ్ జైట్లీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్‌తో తలపడాల్సి ఉంది. జట్ల ప్రయాణంపై ప్రస్తుతం అనిశ్చితి ఉందని.. జట్లతో చర్చలు జరుగుతున్నాయని బీసీసీఐ వర్గాలు తెలిపాయి.
పాకిస్తాన్‌తో ఉద్రిక్తత నేపథ్యంలో షెడ్యూల్‌పై ప్రభావం పడుతుందా? అన్న ప్రశ్నకు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ స్పందించారు. కేంద్రం మార్గదర్శకాల దృష్టిలో పెట్టుకొని నిర్ణయం తీసుకుంటామన్నారు. పరిస్థితిని బీసీసీఐ గమనిస్తుందని.. పరిస్థితులు కఠినంగా మారితే అప్పుడే నిర్ణయం తీసుకుంటామన్నారు. ప్రస్తుతం షెడ్యూల్ ప్రకారమే కొనసాగుతుందని వివరణ ఇచ్చారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా పరిగణించిన భారత్.. పాక్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై దాడులు చేసింది. ఈ క్రమంలో కనీసం 18 విమానాశ్రయాలను కేంద్రం మూసివేస్తూ నిర్ణయం తీసుకున్నది. శ్రీనగర్, జెహ్, జమ్మూ, అమృత్సర్, పఠాన్‌కోట్, చండీగఢ్, జోధ్‌పూర్, జైసల్మేర్, సిమ్లా, ధర్మశాల, జామ్‌నగర్ ఉన్నాయి.