ఐపీఎల్ తాజా సీజన్లో ఇప్పటి వరకు 20 మ్యాచులు జరిగాయి. దాదాపు ప్రతిజట్టూ మూడు మ్యాచులు ఆడేసింది. కొన్ని జట్లు ఐదు మ్యాచులు కూడా ఆడాయి. ఎవరూ ఊహించని విధంగా డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ ఓడింది. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్ కూడా నాలుగు మ్యాచుల్లోనూ ఓడి ఫ్యాన్స్‌కు నిరాశనే మిగిల్చింది.
అదే సమయంలో రెండు కొత్త జట్లు లక్నో సూపర్ జెయింట్స్, గుజరాత్ టైటన్స్ అద్భుతమైన ఆటతీరు కనబరుస్తున్నాయి. పలువురు ఆటగాళ్లు అద్భుతమైన ఫామ్ చూపిస్తూ అభిమానుల్లో ఉత్సాహం నింపుతున్నారు. ముఖ్యంగా టీ20 అంటేనే బ్యాటర్ల ఆట. మరి ఈ ఐపీఎల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లు ఎవరెవరో చూద్దామా?
రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్, ఇంగ్లండ్ స్టార్ ఆటగాడు జోస్ బట్లర్.. ఈ ఐపీఎల్లో ప్రస్తుతం టాప్ స్కోరర్‌గా ఉన్నాడు. తాజా సీజన్లో సెంచరీ సాధించిన ఏకైక ఆటగాడు ఇతనే కావడం గమనార్హం. అయితే వరుసగా రెండు మ్యాచుల్లో సెంచరీ, హాఫ్ సెంచరీ చేసిన తర్వాత మూడో మ్యాచ్‌లో చేతులెత్తేశాడీ బ్యాటర్. ప్రస్తుతం 218 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఆరెంజ్ క్యాప్ అందుకున్నాడు.
తర్వాతి స్థానంలో లక్నో సూపర్ జెయింట్స్ ఓపెనర్, సౌతాఫ్రికా వికెట్ కీపర్ బ్యాటర్ క్వింటన్ డీకాక్ ఉన్నాడు. లక్నో విజయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న ఈ ఎడం చేతి వాటం బ్యాటర్.. ఆడిన ఐదు మ్యాచుల్లో 188 పరుగులు చేసి అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు.
అనూహ్యంగా పుంజుకొని టీ20ల్లో సత్తా చాటుతున్న టెస్టు స్పెషలిస్టు శుభ్‌మన్ గిల్. భారత టెస్టు జట్టులో మాత్రమే అడపా దడపా అవకాశాలు దక్కించుకున్న ఇతను.. గుజరాత్ టైటన్స్ ఓపెనర్‌గా అద్బుతంగా రాణిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో పెద్దగా ఆడలేదు కానీ.. ఆ తర్వాత రెండు మ్యాచుల్లో సూపర్ ఇన్నింగ్సులు ఆడాడు. 96 పరుగుల అత్యధిక వ్యక్తిగత స్కోరుతో.. మూడు మ్యాచుల్లోనే 180 పరుగులు చేసి ఈ జాబితాలో మూడో స్థానంలో ఉన్నాడు. సోమవారం నాడు సన్‌రైజర్స్‌తో జరిగే మ్యాచ్‌లో ఆరెంజ్ క్యాప్ ఇతని సొంతమైనా ఆశ్చర్యం లేదు.
ముంబై ఇండియన్స్ యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నాడు. తొలి మ్యాచ్‌లోనే 81 పరుగల సూపర్ ఇన్నింగ్స్ ఆడిన ఇషాన్.. ఆ తర్వాత కూడా మరో మంచి ఇన్నింగ్స్ ఆడాడు. అయితే ముంబై జట్టు వరుస ఓటముల ప్రభావం అతని బ్యాటింగ్‌పై పడినట్లుంది. చివరి మ్యాచ్‌లో సరిగా ఆడలేదు. దీంతో నాలుగు మ్యాచుల్లో కలిపి 175 పరుగులు చేసిన ఈ యువ కీపర్ బ్యాటర్.. నాలుగో స్థానంలో నిలిచాడు.
ఇక ఐదో స్థానంలో రాజస్థాన్ రాయల్స్ ఆటగాడు షిమ్రాన్ హెట్మెయర్ ఉన్నాడు. ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చే ఈ విండీస్ చిచ్చరపిడుగు.. తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నాడు. తాజాగా లక్నోతో జరిగిన మ్యాచ్‌లో జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చి 59 పరుగులతో అజేయంగా నిలిచాడు. అంతేకాదు, జట్టుకు పోరాడగలిగే స్కోరు అందించాడు కూడా. ప్రస్తుతం నాలుగు మ్యాచులు ఆడిన అతను 168 పరుగులతో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉన్నాడు.