మిస్టర్ ఐపీఎల్ అని ఫ్యాన్స్ అభిమానంతో పిలుచుకునే టీమిండియా మాజీ ఆటగాడు సురేష్ రైనా. ఈ లెఫ్ట్ హ్యాండర్‌ను ఇటీవల జరిగిన మెగావేలంలో ఏ జట్టూ కొనుగోలు చేయలేదు. వేలం ముగిసిన తర్వాత పలువురు ఆటగాళ్లు ఈ సీజన్ నుంచి తప్పుకున్నా కూడా రైనాను ఎవరి స్థానంలోనూ రిప్లేస్ చేయలేదు.
ఈ క్రమంలోనే ఐపీఎల్ టోర్నీలో కొత్త అవతారంలో రైనా కనిపించనున్నట్లు తెలుస్తోంది. అవునండీ.. ఈసారి ఐపీఎల్ కోసం రైనా కామెంటేటర్ అవతారం ఎత్తబోతున్నాడని సమాచారం. రైనాకు చాలా పెద్ద ఫ్యాన్ బేస్ ఉందని, అతన్ని ఎలాగైనా ఐపీఎల్‌తో కలపాలనే ఉద్దేశ్యంతోనే కామెంటేటర్‌గా తీసుకోవాలని నిర్ణయించామని ఐపీఎల్ యాజమాన్యం తెలిపింది.
అలాగే టీమిండియా మాజీ కోచ్ రశిశాస్త్రి కూడా తిరిగి కామెంటరీ బాక్సులో కూర్చునేందుకు రెడీ అయ్యాడట. 2017 తర్వాత టీమిండియా కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన రవిశాస్త్రి.. కామెంటేటర్‌గా కనిపించలేదు. గతేడాది టీ20 ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ బాధ్యతల నుంచి తప్పుకున్న రవిశాస్త్రి.. మళ్లీ మైక్ పట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు.
అయితే ఎప్పుడూ ఇంగ్లీషులో కామెంటేరీ ఇచ్చే శాస్త్రి.. ఈసారి రైనాతో కలిసి హిందీలో మాట్లాడతాడట. వీళ్లిద్దరూ స్టార్ స్పోర్ట్స్ హిందీ కామెంటరీ టీమ్‌లో ఉన్నారని తెలుస్తోంది. హిందీ కామెంటరీ కొత్త కావడంతో రవిశాస్త్రి ఇప్పటి నుంచే జూమ్‌లో హిందీ పాఠాలు నేర్చుకుంటున్నాడని సమాచారం.