Priyanshu Rajawat | కాల్గరీ(కెనడా): కెనడా బ్యాడ్మింటన్ ఓపెన్‌లో భారత యువ షట్లర్ ప్రియాంశు రజావత్ సంచలన విజయంతో కదంతొక్కాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వార్టర్స్‌లో రజావత్ 21-11, 17-21, 21-19తో ప్రపంచ 4వ ర్యాంకర్ అండర్స్ అంటోన్సెన్(డెన్మార్క్)పై అద్భుత విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లాడు. ఆఖరి వరకు ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో 39వ ర్యాంకర్ రజావత్..ప్రత్యర్థికి దీటైన పోటీనిచ్చాడు.
టాప్-10 ర్యాంకింగ్స్ ప్లేయర్‌పై గెలువడం ఈ యువ షట్లర్‌కు ఇది తొలిసారి కావడం విశేషం. మ్యాచ్ విషయానికొస్తే..తొలి గేమ్‌ను అలవోకగా గెలిచిన రజావత్‌కు రెండో గేమ్‌లో అండర్స్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. అయితే హోరాహోరీగా సాగిన నిర్ణయాత్మక మూడో గేమ్‌లో అండర్స్పై రజావత్దే పైచేయి అయ్యింది. మరోవైపు మహిళల డబుల్స్ క్వార్టర్స్‌లో మూడో సీడ్ ద్వయం త్రిసాజాలీ, గాయత్రీ గోపీచంద్ 18-21, 21-19, 16-21తో చైనీస్‌తైపీ జంట పీయ్ షాన్, ఎన్ జు హంగ్ చేతిలో ఓటమిపాలైంది.