మ్యూనిచ్: ఐఎస్ఎస్ఎఫ్ ప్రపంచకప్ లో భారత స్టార్ షూటర్లు మను భాకర్, సమ్రాట్ రాణా రజత పతకం అందుకున్నారు. . శనివారం జరిగిన 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భాకర్-రాణా జోడీ 483.6 స్కోరుతో రెండోస్థానంతో సిల్వర్ ఖాతాలో వేసుకుంది. చైనాకు చెందిన కియాన్సున్ యావో- కై హు ద్వయం 483.9 పాయింట్లతో స్వర్ణం గెలుచుకోగా, కేవలం 0.3 పాయింట్ల స్వల్ప తేడాతో భారత జంటకు గోల్డ్ చేజారింది.
అనిసిమోవా ఇంటిదారి
పారిస్: ఫ్రెంచ్ ఓపెన్‌లో సంచలనాలు కొనసాగుతున్నాయి. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్లో అమెరికా స్టార్, ఆరో సీడ్ అనిసిమోవా 3-6, 6-4, 6-7 (3/10)తో లోకల్ ప్లేయర్ డయాన్ ప్యారీ చేతిలో పోరాడి ఓడిపోయింది. మరో మ్యాచ్‌లో గ్రీస్ స్టార్ ప్లేయర్ మరియా సాకరి 3-6, 2-6తో పోలాండ్ అన్‌సీడెడ్ ప్లేయర్ మాయా చ్వాలిన్స్కా చేతిలో ఓటి ఇంటిదారి పట్టింది. అయితే టాప్ సీడ్ సబలెంక 6-0, 7-5తో దరియా కసత్కినా (రష్యా)ను చిత్తు చేసి ముందంజ వేసింది. ఇక, పురుషుల సింగిల్స్ మూడో రౌండ్లో జర్మనీ స్టార్, రెండో సీడ్ జ్వెరెవ్ 6-4, 6-3, 5-7, 6-2తో క్వెంటిన్ హాలీస్‌ను, పదో సీడ్ కొబొల్లి 6-2, 6-2, 6-3తో లీరీ తియెన్ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లో అడుగు పెట్టారు.