ఢాకా: భారత రికర్వ్ ఆర్చర్లు సంచలన ప్రదర్శనతో పటిష్ట దక్షిణ కొరియాకు షాకిచ్చారు. అంకిత భకత్, బొమ్మదేవర ధీరజ్ అదరగొట్టడంతో ఆసియా ఆర్చరీ చాంపియన్‌షిప్‌లో భారత్‌కు మరోసారి పతకాల పంట పండింది. శుక్రవారం జరిగిన మహిళల వ్యక్తిగత రికర్వ్ ఈవెంట్ ఫైనల్లో అంకిత.. 7-3 (29-27, 26-26, 26-28, 29-28, 29-28)తో పారిస్ ఒలింపిక్స్ మెడలిస్ట్ నమ్ సుహ్యోన్ (దక్షిణ కొరియా)ను చిత్తుచేసి స్వర్ణం గెలుచుకుంది.
సెమీస్‌లో భారత్‌కే చెందిన మాజీ వరల్డ్ నెంబర్ వన్ దీపికా కుమారిని ఓడించి ఫైనల్ చేరిన అంకిత.. తొలి సెట్నుంచే పూర్తి ఆధిపత్యం ప్రదర్శించి విజయం సాధించింది. కాంస్య పోరులోనూ దీపికకు నిరాశ ఎదురవగా భారత్‌కే చెందిన సంగీతకు పతకం దక్కింది. పురుషుల విభాగం ఫైనల్లో తెలుగు ఆర్చర్ ధీరజ్.. 6-2తో మరో భారత ఆటగాడు రాహుల్‌ను ఓడించి పసిడి సొంతం చేసుకున్నాడు. తద్వారా రికర్వ్ వ్యక్తిగత విభాగాల్లో స్వర్ణాలు సాధించిన తొలి భారత ఆర్చర్లుగా అంకిత, ధీరజ్ కొత్త చరిత్ర లిఖించారు.
రికర్వ్ టీమ్ ఈవెంట్స్‌లోనూ మన ఆర్చర్లు సత్తాచాటారు. మెన్స్ క్యాటగిరీలో యశ్దీప్, అతాను, రాహుల్‌తో కూడిన భారత త్రయం.. 5-4తో కొరియాను ఓడించి గోల్డ్ మెడల్ కొట్టింది. ఈ టోర్నీ చరిత్రలో రికర్వ్ టీమ్ ఈవెంట్లో భారత్ పతకం నెగ్గడం ఇదే మొదటిసారి. షూటాఫ్ ద్వారా తేలిన ఫలితంలో కొరియాకు ఓటమి తప్పలేదు. మిక్స్డ్ టీమ్ ఈవెంట్లోనూ దేశానికి రజతం దక్కింది. కొరియా ద్వయం జంగ్ మిన్హీ, సియో మింగి.. 6-0తో భారత జోడీ అన్షిక, యశ్దీప్ను ఓడించింది. ఈ టోర్నీలో భారత జట్టు 6 స్వర్ణాలు, మూడు రజతాలు, ఒక కాంస్యంతో మొత్తంగా పది పతకాలతో ముగించింది.