న్యూఢిల్లీ: గత వారం మలేషియా ఓపెన్‌లో రన్నరప్‌గా నిలిచిన సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి.. ఇండియా ఓపెన్‌లోనూ రెండో స్థానంతోనే సరిపెట్టుకున్నారు. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్-750 పురుషుల డబుల్స్ ఫైనల్లో ఆదివారం సాత్విక్-చిరాగ్ జోడీ 21-15, 11-21, 18-21తో ప్రపంచ చాంపియన్స్ కాంగ్ మిన్-సాంగ్ జాయ్ (కొరియా) ద్వయం చేతిలో ఓటమి పాలైంది. గంటకు పైగా సాగిన పోరులో తొలి గేమ్‌ను సులువుగా గెలుచుకున్న భారత ప్లేయర్లు.. రెండో గేమ్‌ను ప్రత్యర్థికి అప్పగించారు.
ఇక హోరాహోరీగా సాగిన మూడో పోరులో కీలక పాయింట్లు సాధించిన కొరియా ప్లేయర్లు టైటిల్ కైవసం చేసుకున్నారు. పాయింట్ పాయింట్‌కు ఆధిక్యం చేతులు మారిన పోరులో సాత్విక్-చిరాగ్ సుదీర్ఘ ర్యాలీలతో ఆకట్టుకోగా.. కొరియా ప్లేయర్లు మన షట్లర్లపై ఆధిపత్యం కొనసాగించారు. గత వారం మలేషియా ఓపెన్ ఫైనల్లోనూ ఈ జోడీ చేతిలోనే భారత్ ద్వయం పరాజయం పాలైంది. ‘కొన్నిసార్లు విజయం కంటే ఓటమే మంచి చేస్తుంది. తప్పొప్పులను సమీక్షించు ముందుకు సాగేందుకు ఉపయోగ పడుతుంది’ అని తెలుగు ఆటగాడు సాత్విక్ పేర్కొన్నాడు. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో షీ యూ ఖీ, మహిళల సింగిల్స్‌లో తై జూ యింగ్ టైటిల్స్ ఖాతాలో వేసుకున్నారు.