సిడ్నీ: భారత మిక్స్డ్ ద్వయం సుమిత్‌రెడ్డి-సిక్కిరెడ్డి ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నీ క్వార్టర్స్‌కు చేరారు. మిక్స్డ్ డబుల్స్ కేటగిరీలో గురువారం జరిగిన ప్రిక్వార్టర్స్ పోరులో ఈ భారత జోడీ 21-11, 21-11తో కై చెన్-కై కి బెర్నిస్ (ఆస్ట్రేలియా)పై అలవోకగా గెలిచి క్వార్టర్స్‌కు దూసుకెళ్లింది. టాప్ సీడ్ చైనా షట్లర్లు జెంగ్ బంగ్ జియాంగ్-య జిన్ వీ తో క్వార్టర్స్‌లో ఈ జోడీ తలపడుతుంది.
పురుషుల సింగిల్స్‌లో హెచ్ఎస్ ప్రణయ్ 21-17, 21-15తో మిషా జిల్బెర్మన్ (ఇజ్రాయెల్)ను ఓడించగా మరో పోరులో సమీర్ వర్మ 21-14, 14-21, 21-19తో ఎనిమిదో సీడ్ షట్లర్ లొ కీన్ యీ (సింగపూర్)కు షాకిచ్చి క్వార్టర్స్ చేరాడు. కిరణ్ జార్జి 20-22, 6-21తో కెంటా నిషిమొటో (జపాన్) చేతిలో చిత్తుగా ఓడాడు. ఆకర్షి కశ్యప్ 21-16, 21-13తో కై కి బెర్నిస్‌ను ఓడించి క్వార్టర్స్‌కు అర్హత సాధించింది.