హాంగ్జౌ: ప్రతిష్ఠాత్మక ఆసియాగేమ్స్‌లో భారత్ పతక జోరు దిగ్విజయంగా కొనసాగుతున్నది. ఈసారి ఎలాగైనా వంద పతకాలను ఖాతాలో వేసుకోవాలన్న పట్టుదలతో ఉన్న మన ప్లేయర్లు అదరగొడుతున్నారు. ఈక్వెస్ట్రియన్‌లో భారత్ చరిత్రాత్మక స్వర్ణంతో మెరిసింది. అనూష్ అగర్వాలా, సుదీప్తి హలెజా, దివ్యకృతి సింగ్, విపుల్ హృదయ్‌తో కూడిన జట్టు అద్భుత ప్రదర్శనతో పసిడి పతకాన్ని సగర్వంగా ముద్దాడింది. సుదీర్ఘ ఆసియాక్రీడల చరిత్రలో ఈక్వెస్ట్రియన్ డ్రెస్సాజ్లో భారత్‌కు ఇది రెండో పతకం. సెయిలింగ్‌లో నేహా ఠాకూర్ వెండి వెలుగులు విరజిమ్మగా, ఇబాద్ అలీ కాంస్యం ఖాతాలో వేసుకున్నాడు. టోర్నీ మూడో రోజు భారత్‌కు ముచ్చటగా మూడుపతకాలు దక్కాయి.
ఆసియాగేమ్స్‌లో భారత ప్లేయర్ల దూకుడు కొనసాగుతున్నది. గత(2018) ప్రదర్శనను ఎలాగైనా తిరుగరాయాలన్న పట్టుదలతో ఉన్న భారత్ ఆ దిశగా ముందుకెళుతున్నది. మంగళవారం జరిగిన ఈక్వెస్ట్రియన్ డ్రెస్సాజ్ ఈవెంట్లో అనూష్ అగర్వాలా, సుదీప్తి హలె జా, దివ్యకృతి సింగ్, విపుల్ హృదయ్‌తో కూడిన భారత బృందం చరిత్రాత్మక స్వర్ణంతో తమ పేర్లను సువర్ణాక్షరాలతో లిఖించుకుంది. ఈ నలుగురు ప్లేయర్లు తమ గుర్రాలతో కలిసి చేసిన డ్రెస్సాజ్ ప్రదర్శన విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సంగీతానికి అనుగుణంగా గుర్రాన్ని ముందుకు నడిపిస్తూ భారత బృందం కాంటినెంటల్ ఈవెంట్లో ఎన్నడూలేని విధంగా అత్యుత్తమ స్కోరును సొంతం చేసుకుంది. 209.205 పర్సంటేజీ పాయింట్లతో భారత్ పసిడి పతకాన్ని ముద్దాడింది. గత 41 ఏండ్లలో ఆసియా క్రీడల ఈక్వెస్ట్రియన్‌లో భారత్‌కు ఇది తొలి స్వర్ణం కావడం విశేషం. చైనా (204.882%), హాంకాంగ్ (204.852%) వరుసగా రజత, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నాయి. చివరిసారి 1986లో భారత్‌కు డ్రెస్సాజ్ ఈవెంట్లో కాంస్యం దక్కింది. అంతకముందు ఢిల్లీలో జరిగిన ఆసియాడ్‌లో భారత్ ఈవెంటింగ్, టెంట్ పెగ్గింగ్ ఈవెంట్లలో మూడు స్వర్ణ పతకాలతో మెరిసింది.
ఆసియాగేమ్స్‌లో భారత్ ప్లేయర్లు పతక దిశగా దూసుకెళుతున్నారు. పారిస్ ఒలింపిక్స్‌కు ఎలాగైనా అర్హత సాధించాలన్న పట్టుదలతో ఉన్న భారత హాకీ జట్టు భారీ విజయాలతో కదం తొక్కుతున్నది. మంగళవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 16-1తో సింగపూర్‌పై ఘన విజయం సాధించింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌సింగ్(24ని, 39ని, 40ని, 42ని), మణ్‌దీప్‌సింగ్(12ని, 30ని, 51ని), అభిషేక్ (51ని, 52ని), వరుణ్‌కుమార్ (55ని), లలిత్‌కుమార్ (16ని), గుర్జాంత్‌సింగ్ (22ని), వివేక్(23ని), మన్‌ప్రీత్‌సింగ్ (37ని), శంషేర్‌సింగ్(38ని) గోల్స్ చేశారు.
స్కాష్‌లో దూకుడు
స్క్వాష్‌లో భారత పురుషుల, మహిళల జట్లు తమదైన దూకుడుతో టీమ్‌ఈవెంట్‌లో ముందంజ వేశాయి. అనహత్సింగ్, జోష్న చినప్ప, తన్వి ఖన్నాతో కూడిన భారత మహిళల త్రయం 3-0తో పాకిస్థాన్‌పై గెలిచి శుభారంభం చేసింది. పురుషుల ఈవెంట్లో భారత్ 3-0తో ఖతార్‌పై గెలిచింది. మహేశ్ మంగావోంకర్, సౌరవ్ ఘోశల్, అభయ్‌సింగ్ ప్రత్యర్థులపై అలవోక విజయాలు సాధించారు. బుధవారం పాకిస్థాన్‌తో భారత్ తలపడుతుంది.
క్వార్టర్స్‌లో నాగల్, రైనా
టెన్నిస్ సింగిల్స్‌లో సుమిత్ నాగల్, అంకితా రైనా క్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. ప్రిక్వార్టర్స్ పోరులో నాగల్ 7-6(9), 6-4తో బిబిట్ జకయేవ్(కజకిస్థాన్)పై గెలువగా, అంకితా రైనా 6-1, 6-2తో ఆదిత్య కరుణరత్నె(హాంకాంగ్)పై గెలిచి ముందంజ వేసింది.
ప్రిక్వార్టర్స్‌లో సచిన్, నరేందర్
పురుషుల బాక్సింగ్‌లో సచిన్ సివాచ్(57కి), నరేందర్ బెర్వాల్(92+కి) ప్రిక్వార్టర్స్‌లోకి ప్రవేశించారు. మంగళవారం జరిగిన పోరులో సచిన్ 5-0తో అస్రి ఉడిన్(ఇండోనేషియా)పై అలవోక విజయం సాధించాడు. సచిన్ పంచ్‌లకు ఇండోనేషియా బాక్సర్ దగ్గర సమాధానం లేకపోయింది. నరేందర్..ఎల్చెరో ఉలు ఒమ్టెక్(కిర్గిస్థాన్)ను నాకౌట్ చేసి ముందంజ వేశాడు.
వుషులో సూర్య, సూరజ్ ఔట్
పురుషుల 60కిలోల వుషు క్వార్టర్స్‌లో సూర్యభాను ప్రతాప్ 0-2తో కిమ్ మన్సు(కొరియా) చేతిలో ఓడాడు. మరోవైపు 70కిలోల క్వార్టర్స్‌లో సూరజ్ యాదవ్ 2-3తో ఖలీద్ ఎమ్ హోటక్(అఫ్గానిస్థాన్) చేతిలో ఓడిపోయాడు. తొలిరౌండ్లో హోరాహోరీగా తలపడ్డప్పటికీ రెండోరౌండ్లో అఫ్గన్ ప్లేయర్ కిక్‌తో సూరజ్ కింద పడిపోయాడు.
ముగిసిన భవానీ పోరు: ఫెన్సింగ్‌లో భారీ ఆశలతో బరిలోకి దిగిన భవానీదేవి పోరు ముగిసింది. మంగళవారం జరిగిన మహిళల వ్యక్తిగత సబ్రె ఈవెంట్ క్వార్టర్స్‌లో భవాని 7-15తో చైనా ఫెవరేట్ యాకీ షావో చేతిలో ఓటమిపాలైంది.
సెయిలింగ్‌లో డబుల్ ధమాకా
రోయింగ్ జోరును సెయిలింగ్‌లోనే కొనసాగించారు భారత ప్లేయర్లు. మంగళవారం జరిగిన మహిళల డింగీ ఐఎల్సీఏ-4 ఈవెంట్లో నేహా ఠాకూర్ రజత పతకంతో మెరిసింది. అలలపై ఆసక్తికరంగా సాగిన పోరులో నేహా తొలి నుంచి అద్భుత ప్రదర్శన కనబరిచింది. ఓవైపు బలంగా వీస్తున్న గాలికి అనుగుణంగా తన పడవను నడిపిస్తూ కీలక పాయింట్లు ఖాతాలో వేసుకుంది. ఈ క్రమంలో ప్రత్యర్థుల నుంచి దీటైన పోటీ ఎదురైనా ఎక్కడా వెనుకకు తగ్గని 17 ఏండ్ల నేహా 27 నెట్ పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజతం సొంతం చేసుకుంది. పిన్న వయసులో పతకం గెలిచిన భారత సెయిలర్‌గా నేహా కొత్త రికార్డు సొంతం చేసుకుంది. నొపోసోర్న్ కున్బుజాన్(థాయ్‌లాండ్), కియా మ్యారీ కార్లె(సింగపూర్) వరుసగా స్వర్ణ, కాంస్య పతకాలు ఖాతాలో వేసుకున్నారు. మరోవైపు పురుషుల విండ్‌సర్ఫర్ ఆర్ఎస్ ఈవెంట్లో ఇబాద్ అలీ కాంస్యం దక్కించుకున్నాడు. 52 స్కోరుతో అలీ మూడో స్థానంలో నిలిచాడు. వున్వు చో(కొరియా), నాథపోంగ్ ఫొనోఫర్హత్(థాయ్‌లాండ్) వరుసగా స్వర్ణ, రజతాలు సొంతం చేసుకున్నారు. మొత్తం 14 రేసులలో రెండు, మూడు రేసులలో అలీ తన పాయింట్లను కోల్పోవల్సి వచ్చింది. చివరికి పుంజుకుని పోటీలోకి రావడం ఈ యువ సెయిలర్‌కు కలిసొచ్చింది.
ఫైనల్లో ఇషాసింగ్
ఆసియాగేమ్స్ షూటింగ్లో మనోళ్లు అదరగొడుతున్నారు. మంగళవారం జరిగిన మహిళల 25మీటర్ల పిస్టల్ అర్హత ఈవెంట్లో తెలంగాణ యువ షూటర్ ఇషాసింగ్ తన సత్తాచాటింది. అసమాన ప్రదర్శన కనబరుస్తూ 9.733స్కోరుతో మూడో స్థానంలో నిలిచి ఫైనల్స్‌కు అర్హత సాధించింది. ఇదే విభాగంలో పోటీపడ్డ మను భాకర్ 9.800 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. బుధవారం జరిగే ఫైనల్లో ఇషాసింగ్, మనుభాకర్‌పై పతక ఆశలు నెలకొన్నాయి. మరోవైపు టీమ్ఈవెంట్ అర్హత పోటీల్లో భారత్‌కు అగ్రస్థానం దక్కగా, చైనా, చైనీస్ తైపీ వరుగా రెండు, మూడు స్థానాలు కైవసం చేసుకున్నాయి. బుధవారం ర్యాపిడ్ రౌండ్ పోటీలు జరుగనున్నాయి. ఇదిలా ఉంటే 10మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో భారత్‌కు తృటిలో కాంస్య పతకం చేజారింది. రమితా జిందాల్, దివ్యాంశ్ పన్వర్‌తో కూడిన భారత ద్వయం 18-20 తేడాతో కొరియా జోడీ పార్క్ హైజున్, లీ ఎన్సో చేతిలో ఓడి నిరాశపరిచింది. తొలుత 8-0 ఆధిక్యం కనబరిచిన దివ్యాంశ్, రమిత ఆ తర్వాత అదే దూకుడు కొనసాగించడంలో విఫలమై కొరియాకు అవకాశమిచ్చింది.
అయ్యో తులిక
మహిళల 78 కిలోల జూడో కాంస్య పతక పోరులో తులికా మాన్.. మంగోలియా ప్లేయర్ చేతిలో ఓడి నిరాశపరిచింది.
షెడ్యూల్
బాక్సింగ్: శివ తాపా(63.5కి)
ప్రిక్వార్టర్స్: మ: 1.35
సంజీత్(92కి)
ప్రిక్వార్టర్స్ -మ:1.30
నిఖత్ జరీన్(50కి)
ప్రిక్వార్టర్స్-సా:5.15
జిమ్నాస్టిక్స్: మహిళల ఆల్రౌండ్ఫైనల్: ప్రణతినాయక్: మ:3.00
హాకీ: భారత్ X సింగపూర్: ఉ: 10.15
షూటింగ్: ఇషాసింగ్, మనుభాకర్, రితమ్-25మీ. పిస్టల్ టీమ్ అర్హత, ఫైనల్- ఉ: 6.30
మహిళల 25మీ పిస్టల్ వ్యక్తి గత అర్హత, ఉ: 6.30
నోట్: దే-దేశం, స్వ-స్వర్ణం, ర- రజతం,కా-కాంస్యం, మొ-మొత్తం