అహ్మదాబాద్: ప్రతిష్టాత్మక ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీకి ముందు సొంతగడ్డపై ఇంగ్లండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో టీమ్ఇండియా 142 పరుగుల భారీ తేడాతో జయభేరి మోగించింది. అహ్మదాబాద్‌లో మ్యాచ్ అంటేనే రెచ్చిపోయి ఆడే శుభ్‌మన్ గిల్ (102 బంతుల్లో 112, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) తన కెరీర్లో 7వ శతకంతో కదం తొక్కగా.. శ్రేయస్ అయ్యర్ (64 బంతుల్లో 78, 8 ఫోర్లు, 2 సిక్సర్లు), విరాట్ కోహ్లీ (55 బంతుల్లో 52, 7 ఫోర్లు, 1 సిక్స్) హాఫ్ సెంచరీలతో రాణించడంతో నిర్ణీత ఓవర్లలో భారత్ 356 పరుగుల భారీ స్కోరు చేసింది.
అనంతరం ఛేదనలో ఇంగ్లండ్ 34.2 ఓవర్లలో 214 పరుగులకే చేతులెత్తేసింది. టామ్ బాంటన్ (41 బంతుల్లో 38, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), గస్ అట్కిన్సన్ (19 బంతుల్లో 38, 6 ఫోర్లు, 1 సిక్స్), బెన్ డకెట్ (22 బంతుల్లో 34, 8 ఫోర్లు) దూకుడుగా ఆడినా మిగిలిన బ్యాటర్లు విఫలమవడంతో ఆ జట్టుకు భారత గడ్డపై 14 ఏండ్ల తర్వాత వన్డే సిరీస్‌లో వైట్‌వాష్ ఎదురైంది. సిరీస్ ఆసాంతం రాణించిన శుభ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డుతో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ కూడా లభించింది.
భారత ఇన్నింగ్స్‌లో కింగ్ కోహ్లీతో పాటు టీమ్ఇండియా అభిమానులు అతడి వారసుడిగా పిలుచుకునే ప్రిన్స్ గిల్ ఆటే హైలైట్. ఈ ఇద్దరూ తమకు అచ్చొచ్చిన అహ్మదాబాద్‌లో అదరగొట్టారు. కటక్‌లో శతకం చేసిన రోహిత్ శర్మ (1).. వుడ్ రెండో ఓవర్లో సాల్ట్‌కు క్యాచ్ ఇచ్చి నిరాశపరిచాడు. కానీ అతడి స్థానంలో వచ్చిన కోహ్లీ మాత్రం సాధికారికంగా బ్యాటింగ్ చేశాడు. తన మార్కు షాట్లతో అభిమానులను అలరించిన రన్మిషీన్.. క్రీజులో కుదురుకున్నాక జోరు పెంచాడు.
మరో ఎండ్‌లో గిల్ కూడా బౌండరీలతో రెచ్చిపోయాడు. రషీద్ 17వ ఓవర్లో బంతిని కవర్స్ మీదుగా బౌండరీకి తరలించడంతో గిల్ అర్ధశతకం పూర్తయింది. ఆ మరుసటి ఓవర్లోనే కోహ్లీ.. లివింగ్స్టన్ వేసిన రెండో బంతిని పాయింట్ మీదుగా సిక్సర్ బాది 73వ వన్డే ఫిఫ్టీ సాధించాడు. అయితే రషీద్ (4/64) వేసిన 19వ ఓవర్లో కోహ్లీ బ్యాట్‌ను ముద్దాడుతూ వెళ్లిన బంతి సాల్ట్ చేతిలో పడటంతో 116 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
కోహ్లీ నిష్క్రమించినా ఈ సిరీస్‌లో అద్భుత ఫామ్‌లో ఉన్న శ్రేయస్ రాకతో స్కోరుబోర్డు మరింత ఊపందుకుంది. గిల్, శ్రేయస్.. బౌండరీలతో విరుచుకుపడటంతో ఇంగ్లండ్ ఫీల్డర్లు ప్రేక్షకుల్లాగా మారిపోయారు. వుడ్ 32వ ఓవర్లో రెండో బంతిని బౌండరీ బాదిన గిల్.. సెంచరీని నమోదుచేశాడు. అయ్యర్ సైతం 43 బంతుల్లోనే ఫిఫ్టీ బాదాడు. అతడికి ఇది 20వ అర్ధ శతకం. కానీ స్వల్ప వ్యవధిలో ఈ ఇద్దరినీ రషీద్ పెవిలియన్‌కు పంపాడు. గిల్, శ్రేయస్ మూడో వికెట్‌కు 104 పరుగులు జోడించారు. ఆఖర్లో కేఎల్ రాహుల్ (29 బంతుల్లో 40, 3 ఫోర్లు, 1 సిక్స్), హార్దిక్ (17) వేగంగా ఆడి భారత్‌కు రికార్డు స్కోరును అందించారు.
60/0. ఛేదనలో భాగంగా 6 ఓవర్లకు ఇంగ్లండ్ స్కోరిది. డకెట్, సాల్ట్ దూకుడు చూస్తే లక్ష్యం మరీ చిన్నదైపోతుందా? అన్న అనుమానం కలిగింది. హర్షిత్ రెండో ఓవర్లో 2 ఫోర్లు బాదిన డకెట్ అతడే వేసిన 4వ ఓవర్లో మరో మూడు బౌండరీలు కొట్టాడు. అర్ష్‌దీప్ 5వ ఓవర్లోనూ నాలుగు సార్లు బంతి బౌండరీలైన్ దాటింది. కానీ అతడే వేసిన 7వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయిన డకెట్.. మిడాఫ్ వద్ద రోహిత్‌కు చిక్కాడు. సాల్ట్ (23)ను సైతం అర్ష్‌దీప్ స్లో బాల్‌తో బోల్తా కొట్టించాడు.
ఆరంభంలోనే ఔట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్న బంటర్ కొన్ని భారీ షాట్లు ఆడాడు. కానీ స్పిన్నర్ల రాకతో ఇంగ్లండ్ క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయింది. రూట్ (24)ను అక్షర్ బౌల్డ్ చేయగా సెకండ్ స్పెల్‌లో బంతిని అందుకున్న హర్షిత్.. ప్రమాదకర బట్లర్ (6), బ్రూక్ (19)ను క్లీన్‌బౌల్డ్ చేసి ఇంగ్లండ్‌ను కోలుకోలేని దెబ్బకొట్టాడు. లివింగ్స్టన్ (9) విఫలమవగా ఆఖర్లో అట్కిన్సన్ ఉన్నంతసేపు మెరుపులు మెరిపించి ఇంగ్లండ్ ఓటమి అంతరాన్ని తగ్గించాడు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ (2/33), హర్షిత్ (2/31), అక్షర్ (2/22), హార్దిక్ (2/38) సమిష్టిగా రాణించారు.
భారత్: 50 ఓవర్లలో 356 ఆలౌట్ (గిల్ 112, శ్రేయస్ 78, రషీద్ 4/64, వుడ్ 2/45); ఇంగ్లండ్: 34.2 ఓవర్లలో 214 ఆలౌట్ (బాంటన్ 38, అట్కిన్సన్ 38, అక్షర్ 2/22, హర్షిత్ 2/31)
1 ఒకే వేదికలో మూడు ఫార్మాట్లలోనూ శతకాలు బాదిన (భారత్ తరఫున) తొలి క్రికెటర్ గిల్. టెస్టు, టీ20లతో పాటు వన్డేలలోనూ ఇక్కడ సెంచరీ చేశాడు. ఐపీఎల్లో సైతం గిల్ శతకం సాధించాడు.