హైదరాబాద్‌లో ఢీ 20
297/6 .. సరిగ్గా రెండేండ్ల కిందట 2024 అక్టోబర్ 12న హైదరాబాద్‌లో జరిగిన చివరి టీ20లో టీమిండియా సాధించిన స్కోరిది. దసరా పండుగ వేళ బంగ్లాదేశ్‌పై ఓ రేంజ్లో విజృంభించిన భారత్ నాడు ఈ ఫార్మాట్లోనే అత్యధికంగా స్కోరు చేసిన ఐసీసీ ఫుల్ మెంబర్ టీమ్‌గా నిలిచింది. ఇంతకాలం తర్వాత అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ మళ్లీ నగరానికి తిరిగొచ్చింది. ఉప్పల్ స్టేడియంలో వెస్టిండీస్‌తో భారత్ నాలుగో టీ20 నేడే! రెండేండ్ల కిందట ఈ గడ్డపై కొద్దిలో మిస్సయిన 300 రన్స్ మార్కును టీమిండియా ఈసారి అందుకుంటుందేమో చూడాలి.
- రెండేండ్ల తర్వాత నగరంలో అంతర్జాతీయ మ్యాచ్
- నేడు భారత్-వెస్టిండీస్ నాలుగో టీ20
- సిరీస్‌పై గురి పెట్టిన అయ్యర్‌సేన
- రాత్రి 7 నుంచి స్టార్ స్పోర్ట్స్, జియోస్టార్‌లో లైవ్
హైదరాబాద్, ఆట ప్రతినిధి: బ్యాటర్ల ఆధిపత్యం నడుస్తున్న భారత్-వెస్టిండీస్ టీ20 సిరీస్‌లో మరో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఉప్పల్ స్టేడియంలో బుధవారం జరిగే నాలుగో టీ20 పోరులో ఇరు జట్లూ అమీతుమీకి రెడీ అయ్యాయి.ఈ పోరులోనూ గెలిచి ఉప్పల్లోనే సిరీస్ పట్టేయాలని టీమిండియా భావిస్తుండగా…. 2-2తో లెక్క సమం చేయాలని విండీస్ ఆశిస్తోంది. సిరీస్‌లో ఇరు జట్లూ బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్న నేపథ్యంలో ఉప్పల్‌లోనూ ఇరు జట్ల పవర్‌హిట్టర్ల మధ్యనే ప్రధాన పోరు జరగనుంది. రెండో టీ20లో 250 టార్గెట్‌ను కాపాడుకోలేకపోయిన భారత్.. గత పోరులో ఇండోర్ ఫ్లాట్ వికెట్‌పై కరీబియన్లను కట్టడి చేసి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంది. అదే జోరును హైదాబాద్లోనూ కొనసాగించాలని పట్టుదలగా ఉంది.
జోరు మీద బ్యాటర్లు
శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీ చేపట్టిన తర్వాత తొలి రెండు సిరీస్‌లు కోల్పోయిన భారత్ ఆ తర్వాత అద్భుతంగా ఆడుతోంది. ఈ విజయాల్లో టాప్-3 బ్యాటర్లదే కీలక పాత్ర. ఓపెనర్లు అభిషేక్, శాంసన్, ఇషాన్ సూపర్ ఫామ్‌లో ఉండగా.. రెండో టీ20లో సెంచరీతో కెప్టెన్ అయ్యర్ కూడా జోరందుకున్నాడు. అయితే, టాప్-3 బ్యాటర్ల జోరుతో ఈ సిరీస్‌లో భారత మిడిలార్డర్‌కు ఇప్పటివరకు పెద్దగా పరీక్ష ఎదురవ్వలేదు. మొదటగా వచ్చిన బ్యాటర్లే దంచికొడుతుండటంతో మిడిలార్డర్ ఆటగాళ్లకు మ్యాచ్ టైమ్ లభించకపోవడమే చిన్నపాటి సమస్యగా ఉంది. ఒకవేళ టాపార్డర్ తడబడితే ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లే బాధ్యతను తీసుకునేందుకు తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి, నమన్ ధీర్ సిద్ధంగా ఉండాలి. 2024లో ఈ గ్రౌండ్లో జరిగిన చివరి టీ20లో అద్భుత సెంచరీ కొట్టిన శాంసన్.. దేశవాళీ టోర్నీల్లోనూ ఇక్కడ సత్తా చాటాడు.
తనకు అచ్చొచ్చిన వేదికపై మరోసారి సత్తా చాటాలని అతను ఉవ్విళ్లూరుతున్నాడు. ఐపీఎల్లో సన్‌రైజర్స్‌కు ఆడుతున్న అభిషేక్, ఇషాన్, నితీశ్ రెడ్డితో పాటు హైదరాబాదీ తిలక్‌కు ఈ మైదానంపై పూర్తి పట్టు ఉండటం జట్టుకు ప్లస్ పాయింట్ కానుంది. ఇక రెండో టీ20లో భారీ లక్షాన్ని కాపాడుకోలేకపోయిన బౌలర్లు వెంటనే పుంజుకొని ఇండోర్‌లో కరీబియన్ హిట్టర్లను కట్టడి చేశారు. పేసర్ అర్ష్‌దీప్ ముందుండి నడిపించగా.. మిగతావాళ్లూ క్రమశిక్షణతో బౌలింగ్ చేశారు. స్పిన్ ఆల్‌రౌండర్ నమన్ ధీర్ కూడా రెండు వికెట్లతో ఆకట్టుకున్నాడు. బౌలర్ల నుంచి మరోసారి ఇలాంటి మెరుగైన ప్రదర్శన వస్తే భారత్ హైదరాబాద్‌లోనే సిరీస్ నెగ్గడం పెద్ద కష్టమేం కాబోదు. ఇండోర్‌లో ఆడిన తుది జట్టునే భారత్ ఉప్పల్‌లోనూ కొనసాగించే చాన్సుంది.
విండీస్ ఏం చేస్తుందో?
ఈ సిరీస్‌లో విండీస్ ఆట అంచనాలకు అందడం లేదు. తొలి టీ20లో భారత్‌కు ఏమాత్రం పోటీ ఇవ్వలేకపోయిన కరీబియన్లు రాంచీలో మాత్రం 250 టార్గెట్ ఛేజ్ చేసి షాకిచ్చారు. ఇండోర్‌కు వచ్చేసరికి మళ్లీ ఆ స్థాయిలో దంచలేకపోయారు. కానీ, ఈ ఫార్మాట్లో ముఖ్యంగా ఛేజింగ్‌లో కరీబియన్లను ఏ మాత్రం తక్కువగా అంచనా వేయడానికి లేదు. ఈ పర్యటనలో ఇప్పటికే మూడు శతకాలు బాదిన కెప్టెన్ షై హోప్‌కు తోడు రూథర్‌ఫర్డ్, హెట్మయర్, కామిల్ పూరన్ కూడా జోరందుకున్నారు. ఇండోర్‌లో ఎనిమిదో నంబర్లో వచ్చిన పేస్ ఆల్‌రౌండర్ స్ప్రింగర్ సైతం భారీ సిక్సర్లు కొట్టడం భారత్‌కు ఓ హెచ్చరిక. ఉప్పల్‌లో ఆతిథ్య బౌలర్లు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకూడదు. విండీస్ బౌలర్లలో రోస్టన్ ఛేజ్ నిలకడ చూపెడుతున్నా.. మిగతా వాళ్లలో
ఆ స్థాయి ప్రదర్శన కొరవడింది.
కొత్త పిచ్.. అయినా పరుగుల మోతే?
ఉప్పల్ స్టేడియంలో 15 ఏండ్ల తర్వాత పిచ్‌లను మార్చారు. ప్రధాన మైదానంలోని ఆరు పిచ్‌లను తవ్వి కొత్తవి వేశారు. ఈ స్టేడియం వికెట్లు ఇది వరకు బ్యాటర్లకు స్వర్గధామంగా ఉండేవి. అంతర్జాతీయ మ్యాచ్‌లతో పాటు ఐపీఎల్లో సన్‌రైజర్స్ జట్టు నుంచి చాలాసార్లు భారీ స్కోర్లు వచ్చాయి. అయితే, ఎర్ర మట్టి పిచ్‌లను తొలగించి ఇప్పుడు నల్లుపు, ఎర్రమట్టి మిశ్రమంతో కూడిన పిచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ వికెట్ ఆరంభంలో కాస్త పేస్‌కు అనుకూలించినా.. బంతి మెరుపు తొలిగిపోగానే బ్యాటింగ్ సులువు అవనుంది. బుధవారం వర్ష సూచన లేదు. మంచు ప్రభావం కూడా కనిపించడం లేదు.
సొంత గడ్డపై తిలక్ తొలి ఆట
హైదరాబాద్ గల్లీల్లో క్రికెట్ ఓనమాలు నేర్చుకొని స్టార్‌గా ఎదిగిన తిలక్ వర్మ సొంతగడ్డపై తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్ ఆడనున్నాడు. భారత ఆటగాడిగా ఇప్పటి వరకు 68 టీ20లు.. 5 వన్డేలు ఆడిన తిలక్. ఇప్పటివరకు హైదరాబాద్‌లో బ్లూ జెర్సీతో బరిలోకి దిగలేదు. ఇప్పుడు భారత వైస్ కెప్టెన్ హోదాలో సొంత అభిమానుల సమక్షంలో ఆడనుండటం నాకెంతో గర్వంగా ఉందని, ఇది చాలా ప్రత్యేక సందర్భమని తిలక్ పేర్కొన్నాడు. ఇక, పవర్ఫుల్ బ్యాటింగ్ లైనప్ ఉన్న వెస్టిండీస్ జట్టును పరుగులు చేయకుండా కేవలం నిలువరించాలని చూస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని, వికెట్లు తీయడమే లక్ష్యంగా భారత బౌలర్లు దాడి చేయాలని స్పష్టం చేశాడు. ‘ఉప్పల్ స్టేడియంలో కొత్తగా సిద్ధం చేసిన పిచ్ పరిస్థితిని మ్యాచ్‌కు ముందు పరిశీలిస్తాం. టీ20ల్లో పిచ్ స్వభావాన్ని అర్థం చేసుకోవడానికి ఒకటో రెండో బంతులు మాత్రమే లభిస్తాయి. వాతావరణం, పిచ్ పరిస్థితిని బట్టి మా వ్యూహాలు ఉంటాయి’ అని తెలిపాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

