హులున్‌బుయిర్ (చైనా) : ఏషియన్ చాంపియన్స్ హాకీ ట్రోఫీలో ఓటమన్నదే లేకుండా ఎదురైన ప్రత్యర్థినల్లా చిత్తుచిత్తుగా ఓడిస్తున్న భారత జట్టు నేడు కీలక పోరులో దక్షిణ కొరియాతో తలపడనుంది. సోమవారం జరుగనున్న తొలి సెమీస్‌లో భారత్.. కొరియాను ఢీకొననుంది. లీగ్ దశలో చైనా, జపాన్, మలేషియాపై అలవోక విజయాలు సాధించిన హర్మన్‌ప్రీత్ సింగ్ సేన.. దక్షిణ కొరియాతో పాటు దాయాది పాకిస్థాన్‌నూ ఓడించి దూకుడు మీదుంది. భారత జట్టులో కెప్టెన్ హర్మన్‌ప్రీత్ ఫుల్ జోష్‌లో ఉండగా సుఖ్జీత్ సింగ్, అభిషేక్, ఉత్తమ సింగ్, అరేజిత్ సింగ్, యువ మిడ్ ఫీల్డర్ రాజ్‌కుమార్ పాల్ అంచనాలకు మించి రాణిస్తున్నారు. అంతేగాక ప్రత్యర్థి గోల్స్ యత్నాలను మన డిఫెన్స్ విజయవంతంగా అడ్డుకుంటోంది. ఈ టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. కొరియాను ఓడించి ఫైనల్ చేరుకోవాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు లీగ్ దశలో తమను ఓడించిన భారత్‌పై ప్రతీకారం తీర్చుకుని షాకిచ్చేందుకు దక్షిణ కొరియా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటోంది. రెండో సెమీస్‌లో పాకిస్థాన్.. చైనాతో తలపడనుంది. సెమీస్‌లో గెలిచిన జట్లు.. మంగళవారం ఫైనల్లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.