ముంబై : సొంతగడ్డపై ప్రపంచకప్ నెగ్గాలన్న లక్ష్యంతో ఉన్న భారత మహిళల జట్టు నేడు టోర్నీలోనే అత్యంత కఠిన పరీక్షను ఎదుర్కోనున్నది. ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ గ్రూప్ దశలో నిలకడ లేని ఆటతీరుతో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయినా సెమీస్ చేరిన హర్మన్‌ప్రీత్ కౌర్ సేన.. గురువారం డిఫెండింగ్ చాంపియన్ ఆస్ట్రేలియాతో రెండో సెమీస్ మ్యాచ్ ఆడనుంది. ఈ పోరులో గెలిచిన జట్టు.. నవంబర్ 2న దక్షిణాఫ్రికాతో టైటిల్ పోరులో తలపడనుంది. గ్రూప్ దశలో ఆడిన ఏడు మ్యాచ్‌లలో మూడు గెలిచి 7 పాయింట్లతో నాకౌట్ దశకు చేరిన టీమ్ఇండియా.. అజేయంగా సెమీస్ చేరిన ఆసీస్‌ను ఓడించడం అంత ఈజీ కాదు. లీగ్ దశలో ఇరుజట్ల మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు.. భారత్ నిర్దేశించిన 331 పరుగుల లక్ష్యాన్ని సైతం ఛేదించిన విషయాన్ని మరువరాదు.
కెప్టెన్ అలిస్సా హీలి సెమీస్ మ్యాచ్‌కు సిద్ధం కాకపోవడం భారత్‌కు కొంత ఊరటే అయినా టాపార్డర్ నుంచి లోయరార్డర్ దాకా ఏ క్షణంలో అయినా మ్యాచ్‌ను మలుపు తిప్పగల ఆటగాళ్లు ఆ జట్టు సొంతం. టాపార్డర్‌లో లిచ్‌ఫీల్డ్, ఎల్లీస్ పెర్రీ, బెత్ మూనీ మొదలుకుని మిడిలార్డర్లో ఆల్‌రౌండర్లు సదర్లాండ్, గార్డ్నర్, తాత్కాలిక సారథి మెక్‌గ్రాత్ వరకూ బంతితో పాటు బ్యాట్‌తోనూ మ్యాచ్‌ను తమ వైపునకు లాగేసుకునే సత్తా ఉన్నవారే. ఇక భారత్ విషయానికొస్తే ప్రతీక రావల్ టోర్నీకి దూరమవడం లోటే అయినా విధ్వంసకర ఓపెనర్ షఫాలీ వర్మ ఆమె స్థానాన్ని భర్తీ చేయనుండటం కొంత ఊరటే. ఫామ్‌లో ఉన్న స్మృతితో కలిసి ఆమె ఆస్ట్రేలియా బౌలర్లను ఏ మేరకు నిలువరిస్తుందనేది ఆసక్తికరం. మ్యాచ్‌కు వర్షం ముప్పు లేకపోయినా సెమీస్‌కు రిజర్వ్ డే కూడా ఉంది.