న్యూఢిల్లీ: రాజ్‌గిర్(బీహార్) వేదికగా ఈనెల 29 నుంచి సెప్టెంబర్ 7వ తేదీ వరకు జరుగనున్న ఆసియా కప్ హాకీ టోర్నీ కోసం 18 మందితో భారత జట్టును ప్రకటించారు. బుధవారం సమావేశమైన హాకీ ఇండియా(హెచ్ఐ) ప్రతినిధులు జట్టును ఎంపిక చేశారు. మిడ్‌ఫీల్డర్ రాజిందర్‌సింగ్, ఫార్వర్డ్ ప్లేయర్లు శీలానంద్ లక్రా, దిల్‌ప్రీత్‌సింగ్ తిరిగి జట్టులో చోటు దక్కించుకున్నారు.
సీనియర్ స్ట్రైకర్ లలిత్ ఉపాధ్యాయ రిటైర్మెంట్తో ఖాళీ అయిన స్థానాన్ని శీలానంద్ లక్రాతో భర్తీ చేయనున్నారు. శంషేర్‌సింగ్ స్థానంలో రాజిందర్, గుర్జాంత్సింగ్కు బదులుగా దిల్ప్రీత్ను ఎంపిక చేశారు. వచ్చే ఏడాది బెల్జియం, నెదర్లాండ్స్‌లో జరుగనున్న ప్రపంచకప్ టోర్నీని దృష్టిలో పెట్టుకుని టీమ్ఇండియాకు ప్లేయర్ల సెలెక్షన్ జరిగింది. స్టార్ డ్రాగ్‌ఫ్లికర్ హర్మన్‌ప్రీత్‌సింగ్ జట్టుకు నాయకత్వం వహించనుండగా, క్రిషన్ పాథక్, సూరజ్ కర్కెర గోల్కీపర్లుగా కొనసాగనున్నారు.