ఐసీసీ ట్రోపీ నెగ్గాలన్న దశాబ్దాల కలను గతేడాది వన్డే ప్రపంచకప్‌తో నిజం చేసిన భారత మహిళల జట్టు.. ఇప్పుడు మరో మహా లక్ష్యంపై గురిపెట్టింది. కోట్లాది అభిమానుల ఆశలు, ప్రపంచ చాంపియన్‌గా వచ్చిన బాధ్యత, మరోసారి చరిత్ర సృష్టించాలనే తపన మధ్య నేటి నుంచి ఇంగ్లండ్ వేదికగా జరిగే టీ20 ప్రపంచకప్ వేటలోకి దిగుతోంది. ఇప్పటికి తొమ్మిదిసార్లు జరిగిన ఈ మెగా సంగ్రామంలో నాలుగు సార్లు సెమీ ఫైనల్స్‌లో.. ఓసారి ఆఖరాటలో ఓడిన భారత్ పదో ప్రయత్నంలో ‘చిన్న కప్పు’ను ఒడిసిపట్టుకోవాలని డిసైడైంది. ఈసారి రికార్డు స్థాయిలో 12 జట్లు బరిలో నిలుస్తున్నా.. క్రికెట్ ప్రపంచం చూపంతా మాత్రం భారత్‌పైనే నిలిచింది. ఈ ఆటలో ఆస్ట్రేలియా ఆధిపత్యానికి ముగింపు పలికి, వరుసగా వన్డే, టీ20 విశ్వవిజేతగా నిలిచి ప్రపంచ క్రికెట్లో తన శకాన్ని ప్రకటించాలని పట్టుదలతో ఉన్నది.
బర్మింగ్‌హామ్: ఓ వైపు ఫిఫా వరల్డ్ కప్ ఫీవర్ ప్రపంచాన్ని ఊపేస్తుండగా.. మగువల క్రికెట్లో ధనాధన్ పోరాటాలకు రంగం సిద్ధమైంది. రికార్డుస్థాయిలో 12 జట్లు బరిలో నిలిచిన మహిళల టీ20 ప్రపంచకప్ శుక్రవారం మొదలవుతోంది. టోర్నీలో కొత్తగా ఐర్లాండ్, నెదర్లాండ్స్ చేరాయి. తొలి రోజు ఆతిథ్య ఇంగ్లండ్, శ్రీలంక మధ్య జరిగే మ్యాచ్‌తో ఈ మెగా ఈవెంట్‌కు తెరలేవనుంది. ఈనెల14న బర్మింగ్‌హామ్‌లో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో జరిగే పోరుతో భారత్ ప్రపంచ కప్ వేటను ఆరంభించనుంది. గ్రూప్, నాకౌట్ పద్దతిలో జరిగే ఈ టోర్నీలో 12 జట్లు ఆరేసి చొప్పున తొలుత రెండు గ్రూప్స్ పోటీ పడతాయి. టాప్-2లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. జూలై 5న లార్డ్స్ మైదానంలో ఫైనల్ జరగనుంది.
ఈ వరల్ కప్‌లో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం. తొమ్మిది ఎడిషన్లలో ఏకంగా ఆరు సార్లు విజేతగా నిలిచిందా టీమ్. కానీ, ఈసారి ఆజట్టుకు భారత్‌తో పాటు సొంతగడ్డపై చెలరేగే ఇంగ్లండ్ వరుసగా మూడు ఐసీసీ ఈవెంట్లలో ఫైనల్ చేరిన దక్షిణాఫ్రికా, డిఫెండింగ్ చాంప్ న్యూజిలాండ్ నుంచి ముప్పు ఉంది. అయినా ఆస్ట్రేలియాను తక్కువ అంచనా వేయలేం. బెత్ మూనీ, తహ్లియా మెక్‌గ్రాత్, ఎలీస్ పెర్రీ, యాష్లే గార్డ్నర్, మేగన్ షుట్ వంటి మేటి క్రికెటర్లతో ఆ జట్టు బలంగా ఉంది. సోఫీ మోలినుక్స్ను కెప్టెన్‌గా ఎంపిక చేయడంపై జట్టులో కొన్ని భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినప్పటికీ, వాటన్నింటినీ పక్కనబెట్టి గెలవడమే లక్ష్యంగా ఆసీస్ బరిలోకి దిగుతోంది. ఇక లారా వోల్వార్ట్ నేతృత్వంలోని దక్షిణాఫ్రికా జట్టు.. రిటైర్మెంట్ వెనక్కి తీసుకుని వచ్చిన స్టార్ పేసర్ షబ్నిమ్ ఇస్మాయిల్, నీకెర్క్ రాకతో బలం పెంచుకొని టైటిల్ కొట్టాలనే కసితో ఉంది.శ్రీలంక, వెస్టిండీస్, ఐర్లాండ్ లాంటి జట్లపై ఎలాంటి అంచనాల భారం లేదు. ఈ స్వేచ్ఛే వారిని ఫేవరెట్ జట్లకు షాక్ ఇచ్చేలా ప్రేరేపించవచ్చు.

ఈ టోర్నీలో ఆస్ట్రేలియా విజయ పరంపరకు అడ్డుకట్ట వేయగల బలమైన శక్తిగా టీమిండియా కనిపిస్తోంది. గతేడాది వన్డే వరల్డ్ కప్ నెగ్గిన భారత్ ఐసీసీ ఈవెంట్లలో తొలి ట్రోఫీ అందుకొని కొత్త చరిత్ర లిఖించింది. అదే జోరుతో ఇప్పుడు టీ20 కప్పుపై కన్నేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నాయకత్వంలోని ఈ జట్టు.. ఆస్ట్రేలియా తర్వాత వరుసగా వన్డే, టీ20 ప్రపంచకప్ టైటిళ్లను చేజిక్కించుకున్న రెండో టీమ్‌గా రికార్డు సృష్టించాలని పట్టుదలతో ఉంది. షార్ట్ ఫార్మాట్లో భారత్ కొంతకాలంగా స్థిరమైన ప్రదర్శన చేస్తోంది. షెఫాలీ వర్మ, మంధాన, హర్మన్, జెమీమా, రిచా ఘోశ్కు తోడుగా హైదరాబాదీ అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్, క్రాంతి గౌండ్, శ్రీచరణి, శ్రేయాంకా పాటిల్ వంటి బౌలర్లు, దీప్తి శర్మ మేటి ఆల్‌రౌండర్‌తో కూడిన బలమైన లైనప్ భారత్‌కు మరో ప్రపంచకప్ అందించేందుకు సిద్ధంగా ఉంది.
గ్రూప్-ఏ: ఆస్ట్రేలియా, భారత్, దక్షిణాఫ్రికా, పాకిస్థాన్, నెదర్లాండ్స్, బంగ్లాదేశ్
గ్రూప్-బీ: ఇంగ్లండ్ న్యూజిలాండ్ వెస్టిండీస్, శ్రీలంక, ఐర్లాండ్, స్కాట్లాండ్.
జూన్14 భారత్ x పాకిస్థాన్
17 భారత్ x నెదర్లాండ్స్
21 భారత్ x దక్షిణాఫ్రికా
25 భారత్ x బంగ్లాదేశ్
28 భారత్ x ఆస్ట్రేలియా