కాకమిగహరా (జపాన్): పురుషుల హాకీలో అద్భుత ఆటను కొనసాగించిన డిఫెండింగ్ చాంపియన్ భారత్ తన స్వర్ణ పతకాన్ని నిలబెట్టుకుంది. వరుసగా రెండోసారి ఆసియాడ్ చాంపియన్‌గా నిలిచి ఒలింపిక్ బెర్త్ కూడా అందుకుంది.ఒకే ఎడిషన్ ఆసియా గేమ్స్‌లో భారత పురుషుల, మహిళల జట్లు స్వర్ణాలు నెగ్గి కొత్త చరిత్ర సృష్టించాయి. శనివారం జరిగిన ఏకపక్ష తుదిపోరులో భారత ఆటగాళ్లు 5-1తో మలేషియాను చిత్తు చేశారు. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ సింగ్ 11, 57వ నిమిషాల్లో రెండు గోల్స్‌తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.
ఆట ప్రారంభంలో మలేషియా పోటీ ఇచ్చేందుకు ప్రయత్నించినప్పటికీ భారత్ క్రమంగా తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. జుగ్రాజ్ సింగ్ (24వ ని), హార్దిక్ సింగ్ (42వ ని), షీలానంద్ లక్రా (54వ ని) క్రమ తప్పకుండా గోల్స్ చేశారు. మలేసియా తరఫున ఏకైక 14వ నిమిషంలోసిల్వేరియస్ చేశాడు. కాగా, ఆసియా క్రీడల చరిత్రలో పాకిస్థాన్ తర్వాత వరుసగా రెండుసార్లు స్వర్ణం సాధించిన రెండో దేశంగా భారత్ నిలిచింది. అలాగే ఆసియాడ్‌లో రెండు పసిడి పతకాలు అందించిన తొలి కెప్టెన్‌గా హర్మన్‌ప్రీత్ సింగ్ రికార్డుకెక్కాడు. ఓవరాల్‌గా ఆసియాడ్‌లో భారత్‌కు ఇది ఐదో పసిడి పతకం. ఇక, హర్మన్‌ప్రీత్ ఈ టోర్నీలో అత్యధిక గోల్స్ (12) చేసిన ఆటగాడిగా నిలిచాడు.