INDW vs AUSW : ఆస్ట్రేలియా నిర్దేశించిన భారీ ఛేదనలో భారత జట్టు కీలక వికెట్లు కోల్పోయింది. ఆరంభం అదిరినా ఆసీస్ బౌలర్లు పుంజుకోవడంతో టీమిండియా కష్టాల్లో పడింది. పవర్ ప్లేలో దంచిన షఫాలీ వర్మ(20), స్మృతి మంధాన(6)లు స్వల్ప స్కోర్‌కే వెనుదిరిగారు. దాంతో, మరోసారి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్(9), జెమీమా రోడ్రిగ్స్(16)లు ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశారు.
కానీ, మేగన్ షట్ వేసిన ఆరో ఓవర్లో జెమీమా భారీ షాట్ ఆడి గార్డ్నర్ చేతికి చిక్కింది. దాంతో, 47 పరుగుల వద్ద టీమిండియా మూడో వికెట్ పడింది. ప్రస్తుతం దీప్తి శర్మ(12), కౌర్‌లు వేగంగా ఆడుతున్నారు. 10 ఓవర్లకు స్కోర్.. 67-3. ఇంకా టీమిండియా విజయానికి 85 పరుగులు కావాలి.
మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ప్రత్యర్థులను భయపెడుతూ వస్తున్న ఆస్ట్రేలియాకు భారత జట్టు ముచ్చెమటలు పట్టించింది. విధ్వంసక బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆసీస్‌ను 150 లోపే కట్టడి చేసింది. పవర్ ప్లేలోనే రేణుకా సింగ్(2/24) విజృంభణతో ఒత్తిడిలో పడిన కంగారూ జట్టు.. వందకొట్టడం కష్టమే అనిపించింది. కానీ.. భారత బౌలర్ల లయను దెబ్బతీస్తూ గ్రేస్ హ్యారిస్(40), తహ్లియా మెక్‌గ్రాత్(32).. హ్యారిస్ జతగా ఎలీసా పెర్రీ(32)లు దూకుడుగా ఆడింది. భారీ షాట్లతో విరుచుకుపడిన ఈ ఇద్దరూ స్కోర్ బోర్డును ఉరికించారు. అయితే.. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని దీప్తి శర్మ(2/28) డగౌట్ పంపి ఆసీస్ జోరుకు కళ్లెం వేసింది. బౌలింగ్ ఒక్కటే కాదు ఫీల్డింగ్‌లోనూ అదరగొట్టిన టీమిండియా కంగారూలను నిలువరించగలిగింది. ముఖ్యంగా ఆల్‌రౌండర్ రాధా యాదవ్ రెండు సూపర్ క్యాచ్‌లతో మెరిసింది.