న్యూఢిల్లీ/హైదరాబాద్ : భారత హాకీ దిగ్గజం, మేజర్ ధ్యాన్‌చంద్ 121వ జయంతిని పురస్కరించుకుని జాతీయ క్రీడా దినోత్సవాన్ని శనివారం దేశవ్యాప్తంగా అట్టహాసంగా నిర్వహించారు. ఢిల్లీలోని ధ్యాన్‌చంద్ జాతీయ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో కేంద్ర క్రీడా శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ పాల్గొన్నారు. ధ్యాన్‌చంద్ విగ్రహానికి పూలమల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా నిర్వహించిన క్రికెట్, ఫుట్‌బాల్, టగ్ ఆఫ్ వార్ ఆటల్లో మాండవీయ పాల్గొన్నారు. రాష్ట్రంలోనూ క్రీడా దినోత్సవ వేడుకలను పండగ వాతావరణంలో నిర్వహించారు. హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియంలో ధ్యాన్‌చంద్ విగ్రహానికి క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, అధికారులు పూలమల వేశారు. అంతర్జాతీయ స్థాయిలో రాణిస్తున్న తెలంగాణ క్రీడాకారులు అగసార నందిని, పుల్లెల గాయత్రిని ఈ సందర్భంగా సన్మానించారు.