కుర్రాళ్లు మెరవగా.. కింగ్ కొట్టగా..
టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌పై పంజా విసిరిన భారత్ వన్డే ఫార్మాట్లోనూ అదరగొట్టింది. చిన్న మైదానంలో మన పేస్ దళంపై ఉన్న అపనమ్మకాన్ని పటా పంచలు చేస్తూ యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (4/70), గుర్నూర్ బ్రార్ (3/44), అన్షుల్ కాంబోజ్ (2/22) బంతితో మెప్పిస్తే.. ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ (51 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 74) తన పుట్టిన రోజుకు ముందే అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తూ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు.
- తొలి వన్డేలో భారత్ ఘన విజయం
- సత్తా చాటిన అన్షుల్, బ్రార్, అర్ష్‌దీప్
ఆక్లాండ్: టీ20 సిరీస్‌లో న్యూజిలాండ్‌పై పంజా విసిరిన భారత్ వన్డే ఫార్మాట్లోనూ అదరగొట్టింది. చిన్న మైదానంలో మన పేస్ దళంపై ఉన్న అపనమ్మకాన్ని పటా పంచలు చేస్తూ యువ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (4/70), గుర్నూర్ బ్రార్ (3/44), అన్షుల్ కాంబోజ్ (2/22) బంతితో మెప్పిస్తే.. ఛేజ్ కింగ్ విరాట్ కోహ్లీ (51 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్‌తో 74) తన పుట్టిన రోజుకు ముందే అభిమానులకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తూ క్లాసిక్ ఇన్నింగ్స్‌తో సత్తా చాటాడు. దాంతో బుధవారం జరిగిన తొలి వన్డేలో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో 5 వికెట్ల తేడాతో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా ఐదు వన్డేల సిరీస్‌లో శుభారంభం చేసింది.
వర్షం అంతరాయం కలిగించిన ఈ పోరులో తొలుత భారత పేస్ దెబ్బకు కివీస్ 40.2 ఓవర్లలో 185 పరుగులకే కుప్పకూలింది. టిమ్ సిఫర్ట్ (38), గ్లెన్ ఫిలిప్స్ (30), డారిల్ మిచెల్ (28) మాత్రమే పోరాడారు. వర్షం కారణంగా 32 ఓవర్లలో 143 పరుగులుగా సవరించిన లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 22.4 ఓవర్లలోనే ఛేదించింది. కోహ్లీతో పాటు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (37) కూడా రాణించాడు. అన్షుల్ కాంబోజ్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య రెండో వన్డే శనివారం వెల్లింగ్టన్లో జరుగుతుంది.
చెలరేగిన పేస్ దళం
సీనియర్ పేసర్లు బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ గైర్షాజరీలో భారత్-ఏ తరఫున ఆడిన సిరాజ్‌కు విశ్రాంతి ఇచ్చిన కెప్టెన్ గిల్, హెడ్ కోచ్ గంభీర్ కేవలం 29 వన్డేల సంయుక్త అనుభవం ఉన్న యువ పేస్ దళాన్ని బరిలోకి దించింది. వారి నమ్మకాన్ని నిలబెడుతూ పంజాబ్ జోడీ అర్ష్‌దీప్ సింగ్, 6 అడుగుల 5 అంగుళాల పొడగరి బ్రార్ కివీస్ బ్యాటర్లను తీవ్రంగా భయపెట్టారు. పవర్‌ప్లేలో అదరగొట్టిన అర్ష్‌దీప్… షార్ట్ లెంగ్త్ బాల్‌తో విల్ యంగ్ (9) ఆపై హెన్రీ నికోల్స్ (9)ను ఔట్ చేసి న్యూజిలాండ్‌ను దెబ్బతీశాడు.
ఫీల్డింగ్ మారిన తర్వాత బంతిని అందుకున్న బ్రార్ తన ఎత్తును ఉపయోగిస్తూ వేగవంతమైన బౌన్స్ బంతులతో కివీస్‌ను వణికించాడు. క్రీజులో కుదురుకున్న సిఫర్ట్‌ను పెవిలియన్ చేర్చడమే కాకుండా.. సీనియర్ బ్యాటర్ టామ్ లాథమ్ (3) రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చి ప్రత్యర్థికి షాకిచ్చాడు. కొద్దిసేపటికే డారిల్ మిచెల్ రనౌటవ్వడంతో కివీస్ 109/5తో ఇబ్బందుల్లో పడింది. అక్కడి నుంచి అన్షుల్ హవా మొదలైంది. కట్టుదిట్టమైన బౌలింగ్‌తో తన 10 ఓవర్లలో కోటాలో ఏకంగా 46 డాట్ బాల్స్ వేసి అతను ప్రత్యర్థి బ్యాటర్లపై ఒత్తిడి పెంచాడు. వరుస ఓవర్లలో శాంట్నర్ (4),నేథన్ స్మిత్ (1)ను వెనక్కుపంపడంతో కివీస్ 115/7తో నిలిచింది. అర్ష్‌దీప్, బ్రార్ మిగతా ముగ్గురి పని పట్టడంతో ఆతిథ్య జట్టు 200 మార్కు కూడా చేరుకోలేకపోయింది.

కోహ్లీ జోరు
గురువారం తన 38వ పుట్టినరోజు జరుపుకోనున్న విరాట్ కోహ్లీ ఒకరోజు ముందే బ్యాట్‌తో విధ్వంసం సృష్టించాడు. చిన్న లక్ష్య ఛేదనలోఓపెనర్ రోహిత్ శర్మ (0) డకౌటైనా.. కోహ్లీ తన ట్రేడ్‌మార్క్ కవర్ డ్రైవ్‌లు, పుల్ షాట్లతో హోరెత్తించాడు. ఇన్నింగ్స్ ఆరో బంతికే శాంట్నర్ క్యాచ్‌తో రోహిత్‌ను ఔట్ చేసిన జేమీసన్ కివీస్ క్యాంప్‌లో ఆశలు రేపాడు. కానీ, కెప్టెన్ గిల్ తోడుగా అద్భుతంగా ఆడిన విరాట్ ఆ జట్టు ఆశలపై నీళ్లు కుమ్మరించాడు. ప్రతీ బౌలర్‌ను అలవోకగా ఎదుర్కుంటూ పరుగులు రాబట్టాడు.
11వ ఓవర్లో వర్షంతో ఆటకు అంతరాయం కలగడంతో లక్ష్యాన్ని తొలుత 40 ఓవర్లలో 167 పరుగులు సవరించారు. ఆట తిరిగి మొదలైన వెంటనే మళ్లీ చినుకులు పడటంతో రెండోసారి లక్ష్యాన్ని సవరించినా.. కోహ్లీ-గిల్ ఏకాగ్రత కోల్పోకుండా బ్యాటింగ్ చేశారు. ఇద్దరూ రెండో వికెట్‌కు 113 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి బాటలు వేశారు. టీ20 స్టయిల్లో వేగంగా ఆడిన విరాట్ 35 బంతుల్లోనే అర్ధ శతకం పూర్తి చేసుకున్నాడు. ముఖ్యంగా టిక్నర్ను టార్గెట్ చేసి క్లాసిక్ షాట్లు కొట్టాడు. స్కోరు వంద దాటిన తర్వాత గిల్‌ను ఔట్ చేసిన నేథన్ ఈ జోడీని విడదీయగా.. గెలుపు ముంగిట కోహ్లీ, అక్షర్ (0)తో పాటు శ్రేయస్ అయ్యర్ (15)ను డఫీ వెంటవెంటనే పెవిలియన్ చేర్చినా రాహుల్ (3 నాటౌట్), నమన్ ధీర్ (5 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 40.2 ఓవర్లలో 185 (సిఫర్ట్ 38, ఫిలిప్స్ 30, అర్ష్‌దీప్ 4/70, బ్రార్ 3/44, అన్షుల్ 2/22); భారత్: (టార్గెట్ 32 ఓవర్లలో 143): 22.4 ఓవర్లో 147/5 (కోహ్లీ 74, గిల్ 37, డఫీ 3/49)
80 వన్డేల్లో కోహ్లీకి ఇది 80వ అర్ధసెంచరీ. ఈ ఫార్మాట్లో అత్యధిక ఫిఫ్టీల్లో రెండో ప్లేస్‌లో ఉన్నాడు. సచిన్ (96) టాప్‌లో నిలిచాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

