స్వదేశంలో కివీస్ చేతిలో దారుణ పరాభవం ఎదుర్కొని తీవ్ర ఒత్తిడిలో ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లిన భారత్.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని ఘన విజయంతో ఆరంభించేందుకు అద్భుత అవకాశం! పెర్త్ టెస్టులో ఇది వరకే పాగా వేసిన బుమ్రా సేన.. మూడో రోజు ఆల్‌రౌండ్ ఆటతో మ్యాచ్‌ను పూర్తిగా తన నియంత్రణలోకి తెచ్చుకుంది. యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తన ఫామ్‌ను కొనసాగిస్తూ ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న తొలి టెస్టులోనే భారీ సెంచరీ నమోదుచేయగా 16 నెలల విరామం తర్వాత తనకెంతో ఇష్టమైన ప్రత్యర్థిపై కింగ్ కోహ్లీ శతక గర్జన చేశాడు. ఈ ఇద్దరి శతకాలతో భారత్.. ఆతిథ్య జట్టు ఎదుట 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. కొండంత లక్ష్యాన్ని చూసి ఆదిలోనే బెదిరిన కంగారూలు.. మూడు ఓవర్ల వ్యవధిలో 3 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డారు. బుమ్రా, సిరాజ్ వికెట్ల వేట మొదలెట్టి ఆతిథ్య జట్టును కంగారెత్తించారు. ఇక ఏదైనా అత్యద్భుతం జరిగితే తప్ప పెర్త్‌లో ఆసీస్ ఓటమి దాదాపు ఖాయం! భారత బౌలర్లు ఇదే జోరు కొనసాగిస్తే నాలుగో రోజే పెర్త్.. టీమ్ఇండియా సొంతమవడం పెద్ద కష్టమేమీ కాదు.
Perth Test | పెర్త్: భారత్, ఆస్ట్రేలియా మధ్య పెర్త్‌లో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ఇండియా విజయానికి బాటలు వేసుకుంది. రెండో ఇన్నింగ్స్‌లో ప్రత్యర్థి ఎదుట 534 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపిన బుమ్రా సేన.. మూడోరోజు ఆఖర్లో బంతితో కంగారూలకు దెబ్బకొట్టి మ్యాచ్‌పై పట్టు బిగించింది. మూడోరోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 3 కీలక వికెట్లు కోల్పోయి 12 పరుగులు మాత్రమే చేయగా ఇంకా రెండ్రోజులు మిగిలిఉన్న ఆటలో ఆ జట్టు 522 రన్స్ చేయాల్సి ఉంది. బుమ్రా (2/1) మరోసారి కంగారూలను ఆదిలోనే దెబ్బతీశాడు. అంతకుముందు రోజంతా బ్యాటింగ్ చేసిన భారత్.. రెండో ఇన్నింగ్స్‌ను 487/6 వద్ద డిక్లేర్ చేసింది. యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (297 బంతుల్లో 161, 15 ఫోర్లు, 3 సిక్సర్లు) భారీ శతకంతో మెరవగా ఏడాదిన్నర తర్వాత విరాట్ కోహ్లీ (143 బంతుల్లో 100 నాటౌట్, 8 ఫోర్లు, 2 సిక్సర్లు) టెస్టులలో 30వ శతకాన్ని పూర్తిచేశాడు. తెలుగు కుర్రాడు నితీశ్ రెడ్డి (27 బంతుల్లో 38 నాటౌట్, 3 ఫోర్లు, 2 సిక్సర్లు) ఆకట్టుకున్నాడు.
ఓవర్ నైట్ స్కోరు 172/0తో మూడో రోజు ఆట ఆరంభించిన భారత్ అదే నిలకడను కొనసాగించింది. స్టార్క్ రెండో ఓవర్లోనే ఓపెనర్లిద్దరూ తలా ఓ ఫోర్ కొట్టగా హాజిల్‌వుడ్ ఓవర్లో కీపర్ మీదుగా అద్భుతమైన సిక్సర్‌తో జైస్వాల్ ఆస్ట్రేలియా గడ్డపై ఆడుతున్న మొదటి టెస్టులోనే శతకాన్ని నమోదుచేశాడు. మొదటి ఇన్నింగ్స్‌లో డకౌట్ అయిన అతడు రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం సత్తా చాటాడు. టెస్టులలో అతడికి ఇది నాలుగో శతకం. మరోవైపు సెంచరీ దిశగా సాగుతున్న కేఎల్ రాహుల్ (176 బంతుల్లో 77, 5 ఫోర్లు).. స్టార్క్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ అలెక్స్ కేరీకి క్యాచ్ ఇవ్వడంతో 201 పరుగుల తొలి వికెట్ రికార్డు భాగస్వామ్యానికి తెరపడింది. రాహుల్ నిష్క్రమించినా జైస్వాల్.. దేవ్‌దత్ పడిక్కల్ (25)తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించాడు. జైస్వాల్‌ను ఔట్ చేసేందుకు కమిన్స్ పదే పదే బౌలర్లను మార్చినా ఫలితం లేకపోయింది. అయితే లంచ్ విరామం తర్వాత హాజిల్‌వుడ్ వేసిన ఓవర్ తొలి బంతికే పడిక్కల్.. స్లిప్స్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చాడు. 150 పరుగుల మార్కును దాటిన తర్వాత జైస్వాల్.. మిచెల్ మార్ష్ ఓవర్లో కట్‌షాట్ ఆడబోయి బ్యాక్వర్డ్ పాయింట్ వద్ద స్మిత్ చేతికి చిక్కడంతో అతడి చిరస్మరణీయ ఇన్నింగ్స్ ముగిసింది.
గత కొంతకాలంగా టెస్టులలో విఫలమవుతూ ‘ఇక రిటైరైతేనే బెటర్’ అన్న విమర్శలు ఎదుర్కుంటున్న కింగ్ కోహ్లీ.. తనలో పరుగుల దాహం ఏమాత్రం తగ్గలేదని మరోసారి నిరూపించాడు. ఆసీస్ గడ్డపై ఏడో శతకంతో సత్తాచాటాడు. పెర్త్ టెస్టుకు ముందు ఈ ఏడాది ఒక్కటంటే ఒక్కటే హాఫ్ సెంచరీ చేసిన కోహ్లీ.. జైస్వాల్, రాహుల్ ఇచ్చిన శుభారంభాన్ని సద్వినియోగం చేసుకుని టెస్టులలో 31వ శతకాన్ని పూర్తిచేసుకున్నాడు. ఆస్ట్రేలియాపై అతడి ఇది 9వ సెంచరీ కాగా వారి గడ్డపై ఏడోది, పెర్త్‌లో రెండో శతకం. పంత్ (1), జురెల్ (1) వరుస ఓవర్లలో నిష్క్రమించడంతో భారత ఇన్నింగ్స్‌ను పునర్నిర్మించే బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు. వాషింగ్టన్ సుందర్ (29)తో కలిసి ఆసీస్ బౌలర్లకు పరీక్ష పెట్టిన విరాట్.. ఒక్కో పరుగు జతచేస్తూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించాడు. టీ విరామం తర్వాత కమిన్స్ ఓవర్లో మూడు పరుగులు తీసి అర్ధ శతకం పూర్తిచేశాడు.
అవతలి ఎండ్‌లో సుందర్ కూడా కోహ్లీకి మంచి సహకారమందించాడు. ఆరో వికెట్‌కు 89 పరుగులు జోడించిన ఈ జోడీని ఎట్టకేలకు లియాన్ విడదీశాడు. అప్పటికీ కోహ్లీ స్కోరు 67 మాత్రమే. భారత ఆధిక్యం కూడా 450 దాటడంతో ఇన్నింగ్స్‌ను త్వరగా డిక్లేర్ చేసి ఆసీస్‌ను ఇరుకున పెట్టాలన్న బుమ్రా వ్యూహాన్ని నితీశ్ అమలుచేయడంతో కోహ్లీ కూడా గేర్ మార్చాడు. మార్ష్ ఓవర్లో నితీశ్.. హ్యాట్రిక్ ఫోర్లు బాదాడు. లియాన్ ఓవర్లో సిక్స్‌తో రూట్‌మార్చిన కోహ్లీ.. లబూషేన్ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి 90లలోకి వచ్చాడు. అతడే వేసిన 135వ ఓవర్లో నాలుగో బంతిని బౌండరీకి తరలించిన కోహ్లీ.. 81వ అంతర్జాతీయ శతకాన్ని నమోదుచేసిన వెంటనే బుమ్రా ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేశాడు. ఏడో వికెట్‌కు కోహ్లీ-నితీశ్.. 54 బంతుల్లోనే అజేయమైన 77 పరుగులు జోడించడం విశేషం.
మూడో రోజే ఆసీస్‌ను ఒత్తిడిలోకి నెట్టాలన్న బుమ్రా వ్యూహం ఫలించింది. తొలి ఓవర్ నాలుగో బంతికి ఆసీస్ ఓపెనర్ మెక్‌స్వీనే మరోసారి బుమ్రాకే వికెట్ల ముందు దొరికిపోయి డకౌట్‌గా వెనుదిరిగాడు. రోజంతా బౌలింగ్ చేసినప్పటికీ సారథి పాట్ కమిన్స్ (2) నైట్ వాచ్‌మన్‌గా వచ్చాడు. కానీ సిరాజ్ నాలుగో ఓవర్లో మొదటి బంతికే అతడు స్లిప్స్‌లో కోహ్లీ చేతికి చిక్కాడు. అతడి స్థానంలో వచ్చిన ప్రమాదకర లబూషేన్ (3)ను బుమ్రా ఎల్బీగా ఔట్ చేసి కంగారూలను భారీ దెబ్బకొట్టాడు.
1. టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఈయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాటర్ జైస్వాల్ (35). బ్రెండన్ మెక్కల్లమ్ (2014లో 33 సిక్సర్లు) రికార్డును అతడు అధిగమించాడు.
2. ఒక దేశంపై అత్యధిక సెంచరీలు చేసిన భారత బ్యాటర్లలో గవాస్కర్ (వెస్టిండీస్‌పై 7 శతకాలు)ను కోహ్లీ సమం (ఆసీస్‌పై 7) చేశాడు. ద్రవిడ్ (ఇంగ్లండ్‌పై 6), సచిన్(ఆసీస్‌పై 6) రికార్డు బ్రేక్ అయింది.
2. పర్యాటక జట్టు తరఫున కంగారూల గడ్డపై అత్యధిక శతకాలు చేసిన వారిలో ఇంగ్లండ్ బ్యాటర్లు జాక్ హాబ్స్ (9), వాలీ హామండ్ (7) తర్వాత కోహ్లీ నిలిచాడు.
2. టెస్టులలో శతకం చేసిన ప్రతిసారి తన స్కోరును 150+ దాటించిన రెండో బ్యాటర్ జైస్వాల్ (22 ఏండ్ల లోపు). గతంలో ఈ రికార్డు జావేద్ మియందాద్, గ్రేమ్ స్మిత్ పేరిట ఉంది.
3. ఆస్ట్రేలియాలో తొలి టెస్టు ఆడుతూ సెంచరీ చేసిన భారత బ్యాటర్లలో జైస్వాల్ మూడో స్థానంలో నిలిచాడు. గతంలో ఈ రికార్డు ఎంఎల్ జైసింహా, సునీల్ గవాస్కర్ పేరిట ఉంది.
4. 15 టెస్టుల తర్వాత అత్యధిక పరుగులు (1,568) చేసిన నాలుగో బ్యాటర్ జైస్వాల్. బ్రాడ్‌మన్ (2,115), మార్క్ టేలర్ (1,618), ఎవర్టన్ వీక్స్ (1,576) మాత్రమే జైస్వాల్ కంటే ముందున్నారు. భారత్ తరఫున విజయ్ హజారే రికార్డు (1,420) రికార్డును జైస్వాల్ అధిగమించాడు.
భారత్ తొలి ఇన్నింగ్స్: 150 ఆలౌట్
ఆసీస్ తొలి ఇన్నింగ్స్: 104 ఆలౌట్
భారత్ రెండో ఇన్నింగ్స్: 487/6 (జైస్వాల్ 161, కోహ్లీ 100 నాటౌట్, లియాన్ 2/96, హాజిల్‌వుడ్ 1/28)
ఆసీస్ రెండో ఇన్నింగ్స్: 12/3 (ఖవాజా 3 నాటౌట్, బుమ్రా 2/1)