వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళుతున్నది. కెప్టెన్ రోహిత్‌శర్మ ధనాధన్ బ్యాటింగ్‌తో అదిరిపోయే ఆరంభాన్ని అందుకున్న టీమ్ఇండియా మూడు వందల మార్క్ అందుకుంది. చేతిలో ఎనిమిది వికెట్లతో విండీస్ ముందు భారీ లక్ష్యాన్ని నిర్దేశించే అవకాశముంది. మహమ్మద్ సిరాజ్ ఐదు వికెట్ల విజృంభణతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 255 పరుగులకు పరిమితమైంది. టాపార్డర్ పోరాటపటిమను లోయార్డర్ కొనసాగించలేకపోయింది. సిరాజ్ సూపర్ స్వింగ్‌తో కరీబియన్లను కట్టడి చేయడంలో కీలకమయ్యాడు. రెండో టెస్టులో భారత గెలుపు దాదాపు ఖరారైనా వరుణుడు అడ్డుతగిలే అవకాశం కనిపిస్తున్నది.
పోర్ట్ఆఫ్ స్పెయిన్: వెస్టిండీస్‌తో రెండో టెస్టులో భారత్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తున్నది. పసలేని విండీస్ బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ టీమ్ఇండియా భారీ స్కోరుపై కన్నేసింది. 183 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన భారత్.. కడపటి వార్తలు అందే సమయానికి రెండు వికెట్లు కోల్పోయి 124 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్ (15), ఇషాన్ కిషన్ (10) క్రీజులో ఉన్నారు. ఇంకా ఎనిమిది వికెట్లు ఉన్న రోహిత్‌సేన 309 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఓపెనర్లు రోహిత్‌శర్మ(44 బంతుల్లో 57, 5ఫోర్లు, 3 సిక్స్‌లు), యశస్వి జైస్వాల్(38) ధనాధన్ ఇన్నింగ్స్‌తో దుమ్మురేపారు. ముఖ్యంగా హిట్‌మ్యాన్ వచ్చి రావడంతోనే విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఆది నుంచే బౌండరీలు బాదుతూ టెస్టుల్లో తక్కువ(35) బంతుల్లో వేగవంతమైన అర్ధసెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ క్రమంలో రెండుమార్లు క్యాచ్ ఔట్ నుంచి బయటపడ్డ రోహిత్..చివరకు గాబ్రియెల్ బౌలింగ్‌లో జోసెఫ్ క్యాచ్‌తో నిష్క్రమించాడు. ఆ తర్వాత నాలుగు పరుగుల తేడాతో యశస్వి రెండో వికెట్‌గా వెనుదిరిగాడు. వీరిద్దరు కలిసి తొలి వికెట్‌కు 98 పరుగులు జోడించారు. గాబ్రియెల్, వారికన్ ఒక్కో వికెట్ తీసుకున్నారు.
వారెవ్వా సిరాజ్ : ఓవర్‌నైట్ స్కోరు 229/5 నాలుగో రోజు తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన విండీస్..అదే పోరాట పటిమను కొనసాగించలేకపోయింది. ముకేశ్‌కుమార్ తన తొలి ఓవర్లోనే అలిక్ అతానజె(37)ను ఎల్బీడబ్ల్యూ చేశాడు. ఆ తర్వాత స్వింగ్‌స్టర్ సిరాజ్(5/60) తన ప్రతాపం చూపించాడు. పిచ్ పరిస్థితులను సద్వినియోగం చేసుకుంటూ విండీస్ లోయార్డర్‌ను కుప్పకూల్చాడు. జోషువా డిసిల్వా(10)ను క్లీన్‌బౌల్డ్ చేయడంతో మొదలైన సిరాజ్ వికెట్ల వేట ఆఖరి వరకు దిగ్విజయంగా సాగింది. హోల్డర్(15), జోసెఫ్(4), రోచ్(4), గాబ్రియెల్(0)ను వరుస విరామాల్లో పెవిలియన్ పంపాడు. ఈ క్రమంలో తన కెరీర్లో సిరాజ్ రెండోసారి ఐదు వికెట్ల ప్రదర్శన కనబరిచాడు.