Virat Kohli: భారత క్రికెట్ మక్కాగా పేరొందిన ఈడెన్ గార్డెన్స్‌లో ఆధునిక క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. 35వ పుట్టినరోజు జరుపుకుంటున్న విరాట్.. భారత బ్యాటింగ్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వన్డేలలో నెలకొల్పిన 49 సెంచరీల రికార్డుతో పాటు మరిన్నింటినీ తుడిచిపెట్టాడు. బర్త్ డే రోజే సెంచరీ చేయడం నుంచి మొదలుకొని పరిమిత ఓవర్ల క్రికెట్లో యాభై సెంచరీలు పూర్తిచేసిన తొలి క్రికెటర్ వరకూ ఆ రికార్డుల జాబితాను ఇక్కడ చూద్దాం.
కోహ్లీ ఘనతలు ఇవే..
సౌతాఫ్రికాతో మ్యాచ్‌లో సెంచరీ చేయడం ద్వారా కోహ్లీ.. వరల్డ్ కప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్లలో శ్రీలంక దిగ్గజం కుమార సంగక్కరను దాటేశాడు. సంగక్కర 35 ఇన్నింగ్స్‌లలో 1532 పరుగులు చేయగా కోహ్లీ .. 34 ఇన్నింగ్స్‌లలోనే 1571 పరుగులు చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (44 ఇన్నింగ్స్‌లలో 2,278 పరుగులు), రికీ పాంటింగ్ (42 ఇన్నింగ్స్‌లలో 1,743) మాత్రమే కోహ్లీ కంటే ముందున్నారు. టీమిండియా సారథి రోహిత్ శర్మ.. 25 ఇన్నింగ్స్‌లలోనే 1,420 రన్స్‌తో సంగక్కర తర్వాతి స్థానంలో ఉన్నాడు.
ఈ మ్యాచ్‌లో అర్థ సెంచరీ తర్వాత కోహ్లీ భారత్‌లో వన్డేలు ఆడుతూ ఆరు వేల పరుగులు పూర్తిచేసిన రెండో బ్యాటర్‌గా నిలిచాడు. అంతకుముందు ఈ రికార్డు సచిన్ (6,976) పేరిట ఉంది.
సఫారీలతో సెంచరీ చేయడం ద్వారా వన్డేలలో అత్యధిక సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన ఆటగాళ్లలో కోహ్లీ..సంగక్కరను అధిగమించి సచిన్ తర్వాతి స్థానంలో నిలిచాడు. ఈ మ్యాచ్‌కు ముందు కోహ్లీ.. 118 సార్లు ఫిఫ్టీ ప్లస్ స్కోరుతో సంగక్కరతో సమానంగా నిలిచాడు. ఈ జాబితాలో సచిన్ (145 సార్లు) అందరికంటే ముందున్నాడు.
వన్డేలలో బర్త్ డే రోజు సెంచరీ చేసిన బ్యాటర్లలో కోహ్లీ ఏడోవాడు. ఈ జాబితాలో వినోద్ కాంబ్లీ, సచిన్ టెండూల్కర్, సనత్ జయసూర్య, రాస్ టేలర్, టామ్ లాథమ్, మిచెల్ మార్ష్‌లు కోహ్లీ కంటే ముందున్నారు.
వరల్డ్ కప్‌లో ఆడుతూ బర్త్ డే రోజు సెంచరీ చేసింది మాత్రం రాస్ టేలర్, మిచెల్ మార్ష్, కోహ్లీలు మాత్రమే.
అంతర్జాతీయ క్రికెట్లో పరిమిత ఓవర్ల ఫార్మాట్ (50 ఓవర్స్, టీ20లు) 50 సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ విరాట్ కోహ్లీ. వన్డేలలో 49 సెంచరీలు చేసిన కోహ్లీకి టీ20లలో ఒక సెంచరీ (అఫ్గానిస్తాన్‌పై) ఉంది.
అంతర్జాతీయ క్రికెట్లో అత్యధిక సెంచరీలు (టాప్-5) చేసింది వీళ్లే..
సచిన్ టెండూల్కర్ – 100
విరాట్ కోహ్లీ – 79
రికీ పాంటింగ్ – 71
కుమార సంగక్కర – 63
జాక్వస్ కలిస్ – 62
యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు..
విరాట్ కోహ్లీ – 79
జో రూట్ – 46
డేవిడ్ వార్నర్ – 48
స్టీవ్ స్మిత్ – 44
రోహిత్ శర్మ – 45
భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్లో హయ్యస్ట్ సెంచరీలు..
సచిన్ టెండూల్కర్ – 100
విరాట్ కోహ్లీ – 79
రాహుల్ ద్రావిడ్ – 48
రోహిత్ శర్మ – 45