దక్షిణాఫ్రికాకు భారత వెటరన్ మహమ్మద్ షమీ.. కొరకరాని కొయ్యలా మారాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన షమీ.. రెండో ఇన్నింగ్స్‌లో బంతి అందుకున్న వెంటనే వికెట్ కూల్చాడు. తొలి రెండు బంతులతో ఎయిడెన్ మార్క్రమ్ (1)ను కన్ఫ్యూజ్ చేసిన షమీ.. మూడో బంతికి బౌల్డ్ చేశాడు.
షమీ వేసిన బంతి వికెట్లపైకి వస్తుందని భావించిన మార్క్రమ్ దాన్ని ఆడబోయాడు. అయితే చివరి నిమిషంలో బంతి వికెట్లను తాకదని గ్రహించి వదిలేయడానికి ప్రయత్నించాడు. కానీ బ్యాట్‌ను వెనక్కు తీసుకోవడంలో ఒక్క క్షణం ఆలస్యమైంది. దీంతో ఇన్సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి వికెట్లను కూల్చింది. సౌతాఫ్రికా జట్టు ఒక్క పరుగుకే ఒక వికెట్ కోల్పోయింది.