మూడో టెస్టులో అత్యంత సహనంగా బ్యాటింగ్ చేసిన కోహ్లీ.. చివరకు ఎప్పట్లానే ఆఫ్‌స్టంప్ ఆవలగా వెళ్తున్న బంతిని ఆడబోయి అవుటయ్యాడు. రెండో ఇన్నింగ్సులో తొలి నాలుగు వికెట్లను చాలా త్వరగా కోల్పోయిన భారత్‌ను కోహ్లీ ఒక విధంగా ఆదుకున్నాడనే చెప్పాలి.
అనవసర షాట్లకు వెళ్లకుండా, అచ్చమైన టెస్టు ఆటతో సఫారీ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. అయితే లంచ్ తర్వాత అతని ఫోకస్ దెబ్బతిన్నట్లుంది. ఎన్గిడీ వేసిన ఇన్నింగ్స్ 49వ ఓవర్లో ఆఫ్‌సైడ్ ఆవలగా వెళ్తున్న బంతినా డ్రైవ్ చేయడానికి ప్రయత్నించాడు.
ఈ సమయంలో అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి సెకండ్ స్లిప్‌లో ఉన్న మార్క్రమ్ దిశగా వెళ్లింది. బాగా ఎత్తుగా వచ్చిన ఆ బంతిని గాల్లోకి ఎగిరి మరీ మార్క్రమ్ అద్భుతంగా అందుకున్నాడు. దీంతో కోహ్లీ ఇన్నింగ్స్ ముగిసింది.
మొత్తం 143 బంతులు ఎదుర్కొన్న కోహ్లీ 29 పరుగులు మాత్రమే చేశాడు. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ధాటిగా ఆడుతుంటే అతనికి చక్కటి సహకారం అందించాడు. కోహ్లీ అవుటవడంతో రవిచంద్రన్ అశ్విన్ క్రీజులోకి వచ్చాడు.