Pinky Finger Celebration | రాంచీ టెస్టులో సెంచరీ చేసిన తర్వాత ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జో రూట్.. బౌండరీ లైన్ ఆవల ఇంగ్లీష్ జట్టు కూర్చునే డగౌట్లో ఉన్న సారథి బెన్ స్టోక్స్‌ను చూస్తూ తన చిటికెన వేలును చూపిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఈ టెస్టు సిరీస్‌లో వరుసగా విఫలమవుతున్న రూట్.. సెంచరీ చేయగానే ఎంతో రిలీఫ్‌గా స్టోక్స్ వైపునకు చూస్తూ ఇలా చేశాడు. బెన్ స్టోక్స్ కూడా సెంచరీ చేసినా, మ్యాచ్ గెలిపించినా ఇలానే సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇంగ్లండ్ క్రికెటర్లు ‘పింకీ ఫింగర్ సెలబ్రేషన్స్’ అని పెట్టుకున్న దీని వెనుకాల ఓ‘చిత్ర కథ’ ఉంది.
2022లో భారత జట్టు ఎడ్జ్‌బాస్టన్ వేదికగా రీషెడ్యూల్డ్ టెస్టు ఆడేందుకు గాను బర్మింగ్‌హోమ్‌కు వెళ్లింది. ఈ టెస్టులో భాగంగా రెండో ఇన్నింగ్స్‌లో స్టోక్స్.. 11.5 ఓవర్లు బౌలింగ్ చేసి నాలుగు వికెట్లు పడగొట్టాడు. అప్పుడే అతడు ఇలా సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇదే మ్యాచ్‌లో ఐదో రోజు 375 పరుగుల భారీ ఛేదనలో జో రూట్ (142), జానీ బెయిర్ స్టో (114)లు సెంచరీలతో కదం తొక్కారు. ఆ మ్యాచ్‌లో సెంచరీ చేసిన తర్వాత రూట్ కూడా ఇలాగే సెలబ్రేట్ చేసుకున్నాడు.
So what did the pinky signal mean? pic.twitter.com/toXhLLessf
— simon hughes (@theanalyst) February 23, 2024
కారణమిది…
ఎడ్జ్‌బాస్టన్ టెస్టు జరుగుతున్న క్రమంలో బెన్ స్టోక్స్.. హాలీవుడ్ మూవీ ‘ఎల్విస్’ను వీక్షించాడు. ప్రముఖ మ్యూజిషియన్ ఎల్విస్ ప్రెస్లీ బయోపిక్ అది. ఈ సినిమా స్టోక్స్‌కు బాగా నచ్చడంతో పాటు అతడిని ఇన్స్పైర్ చేసింది. ఈ సినిమాలో ఎల్విస్ పాత్రను పోషించిన నటుడు ఆస్టిన్ బట్లర్.. పలుమార్లు ఈ పింకీ ఫింగర్‌ను చూపిస్తాడు. ఇది స్టోక్స్‌కు నచ్చింది. తన టీమ్ మేట్స్‌కు కూడా స్టోక్స్ ఈ సినిమా చూపించాడు. ఆ తర్వాత నుంచి స్టోక్స్, రూట్లు సెంచరీలు చేస్తే ఈ సినిమా తరహాలోనే సెలబ్రేట్ చేసుకుంటారు.