IND vs ENG 1st Test: జడ్డూ జాదూగర్.. ఆష్ అన్న అదుర్స్.. ఆ ఇద్దరికీ మతి పోయిందిగా..! వీడియో చూడాల్సిందే..
IND vs ENG 1st Test: ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కీలక బ్యాటర్లు అయిన జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌ల వికెట్లు ఈ ద్వయానికే దక్కగా ఈ ఇద్దరూ ఔట్ అయిన బంతులు మాత్రం నభూతో నభవిష్యత్.
IND vs ENG 1st Test: భారత స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్ – రవీంద్ర జడేజాలు ఇంగ్లండ్‌కు మరోసారి తమ స్పిన్ రుచి చూపించారు. తమ చేతుల్లో నుంచి వచ్చే బంతి ఎన్ని గింగిరాలు తిరిగి ఎటుపోతుందోనన్న భయం బ్యాటర్లకు ఉండాలని హెచ్చరించారు. ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆ జట్టు కీలక బ్యాటర్లు అయిన జానీ బెయిర్ స్టో, బెన్ స్టోక్స్‌ల వికెట్లు ఈ ద్వయానికే దక్కగా ఈ ఇద్దరూ ఔట్ అయిన బంతులు మాత్రం నభూతో నభవిష్యత్. దిగ్గజ స్పిన్నర్లు షేన్ వార్న్ బాల్ ఆఫ్ ది సెంచరీ, ముత్తయ్య మురళీధరన్ స్పిన్ మాయాజాలాన్ని గుర్తుకుతెస్తూ అశ్విన్, జడేజాలు.. ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్లను పెవిలియన్‌కు పంపారు. బెయిర్ స్టోను జడ్డూ ఔట్ చేయగా స్టోక్స్‌ను ఆష్ అన్న (అశ్విన్‌ను అభిమానులు పిలుచుకునే పేరు) క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అయ్యాయి.
బెయిర్ స్టో మతి పోగొట్టిన జడ్డూ..
ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్‌లో భాగంగా రూట్ నిష్క్రమణ అనంతరం బెయిర్ స్టో క్రీజులోకి వచ్చాడు. అప్పటికే జడేజా, అశ్విన్ బౌలింగ్‌లో స్పిన్‌ను తప్పించుకుంటూ ఆడుతున్న బెయిర్ స్టో.. 28వ ఓవర్లో జడేజాను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆ ఓవర్లో నాలుగో బంతిని జడ్డూ ఆఫ్ స్టంప్‌కు కొద్దిగా దూరంగానే విసిరాడు. బెయిర్ స్టో కూడా బంతి వికెట్ల మీదుగా పోదుగా అని రైట్ లెగ్‌తో ముందుకు పెట్టి బంతిని అడ్డుకోవాలని చూశాడు. బంతి కాస్తా మిస్ అయింది. కానీ క్రీజులోకి రాగానే బాల్ గమనాన్ని మార్చుకుని ఆఫ్ స్టంప్ మీదున్న బెయిల్స్‌ను ఎగురగొట్టింది. భారత ఆటగాళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. బెయిర్ స్టోకు ఏం జరిగిందో అర్థం కావడం లేదు. అసలు వికెట్ల మీదకు రాదనుకున్న బంతి బెయిల్స్‌ను ఎలా ఎగరగొట్టింది..? అంటూ ఏమీ అర్థంకాక కాసేపు క్రీజులోనే ఉండి ఇక తప్పక అక్కడ్నుంచి వెళ్లిపోయాడు.
Jaddu-gar 🪄
Bairstow is deceived 😵💫 by Jadeja’s magical delivery! 😍#JioCinemaSports #BazBowled #IDFCFirstBankTestSeries #INDvENG pic.twitter.com/O4BrpPKeRn
— JioCinema (@JioCinema) January 27, 2024
ఆష్ అన్న కేక డెలివరీ..
బెయిర్ స్టో స్థానంలోనే బ్యాటింగ్‌కు వచ్చిన స్టోక్స్ కూడా భారత స్పిన్‌ను ఎదుర్కునేందుకు తంటాలుపడ్డాడు. 33 బంతులాడి ముక్కీ మూలిగి ఆరు పరుగులు మాత్రమే చేసిన అతడు.. అశ్విన్ వేసిన 37వ ఓవర్లో తొలి నాలుగు బంతులలో రెండింటికి సింగిల్స్ రాబట్టాడు. కానీ ఐదో బంతిని అశ్విన్ కాస్త తక్కువ లెంగ్త్‌లో ఆఫ్ స్టంప్ (స్టోక్స్‌కు) కొద్దిపాటి దూరంతో విసిరాడు. స్టోక్స్ దానిని డిఫెన్స్ ఆడబోయాడు. అప్పటికే అతడు ఆఫ్ స్టంప్ మినహా వికెట్లను పూర్తిగా కవర్ చేశాడు. కానీ స్టోక్స్ నుంచి మిస్ అయిన బంతి నేరుగా ఆఫ్ స్టంప్‌ను గిరాటేసింది. ఇక్కడా సేమ్ సీన్ రిపీట్. ఆశ్చర్యపోవడం స్టోక్స్ వంతైతే టీమిండియా ఆటగాళ్లు సంబురాల్లో తేలిపోయారు.
📽️ R Ashwin to Ben Stokes
What a delivery 🙌#TeamIndia | #INDvENG | @ashwinravi99 | @IDFCFIRSTBank pic.twitter.com/sxBGnhmhl0
— BCCI (@BCCI) January 27, 2024
అశ్విన్ రికార్డు..
బెన్ స్టోక్స్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ మరో ఘనత సాధించాడు. టెస్టులలో ఒక బ్యాటర్‌ను అత్యధిక సార్లు ఔట్ చేసినవారిలో అశ్విన్.. కపిల్ దేవ్ రికార్డును సమం చేశాడు. కపిల్ దేవ్.. పాకిస్తాన్ మాజీ బ్యాటర్ ముదస్సర్ నజర్‌ను 12 సార్లు ఔట్ చేశాడు. తాజాగా స్టోక్స్‌ను ఔట్ చేయడం ద్వారా అశ్విన్ కూడా కపిల్ సరసన చేరాడు. తద్వారా ఇంగ్లండ్ మాజీ ఆటగాడు అలిస్టర్ కుక్ ను ఇషాంత్ శర్మ 11 సార్లు ఔట్ చేసిన రికార్డును బ్రేక్ చేశాడు. అంతేగాక టెస్టులలో 25 ఇన్నింగ్స్‌లలో అశ్విన్‌ను ఎదుర్కున్న స్టోక్స్.. అతడి బౌలింగ్‌లో 232 పరుగులు చేసి 12 సార్లు ఔట్ అయ్యాడు.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

