IND Vs AUS | బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్‌లో భాగంగా అడిలైడ్‌లో జరిగిన టెస్టులో ఆస్ట్రేలియా 10 వికెట్ల తేడాతో భారత్‌పై ఘన విజయాన్ని సాధించింది. డే-నైట్ టెస్ట్ కేవలం మూడురోజుల్లోనే ముగిసింది. 2020లో జరిగిన టెస్ట్ తరహాలోనే టీమిండియా మూడురోజుల్లోనే చేతులెత్తేసింది. డే-నైట్ టెస్టులో టీమిండియాకు ఇది రెండో ఓటమి. భారత్ ఇప్పటి వరకు ఐదు పింక్ బాల్ టెస్టులు ఆడగా మూడింటిలో విజయం సాధించింది. ఇక ఆస్ట్రేలియా 12 డే-నైట్ టెస్టులు ఆడగా.. కేవలం ఒకే మ్యాచ్‌లో మాత్రమే ఓడిపోయింది. ఈ సారి ఓటమితో భారత్ జట్టు సామర్థ్యంపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తాయి. బుమ్రా నాయకత్వంలోని పెర్త్ టెస్ట్‌లో చారిత్రాత్మక విజయం సాధించిన భారత జట్టు.. రోహిత్ శర్మ నాయకత్వంలో అడిలైడ్‌లో ఓటమి పాలైంది. రోహిత్ కెప్టెన్సీలో టీమిండియా వరుసగా నాలుగో టెస్టులో ఓడిపోయింది. అడిలైడ్ టెస్ట్‌లో భారత్ ఓటమికి పలు కారణాలను తెలుసుకుందాం..!
డే నైట్ టెస్ట్‌లో పగటిపూట భారత జట్టు బాగానే ప్రదర్శన చేసింది. కానీ, ఫ్లడ్ లైట్ల వెలుతురులో బంతి స్వింగ్ అవుతున్న సమయంలో భారత బౌలర్లు ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ సమయం వెలుతురులోనే ఆడినప్పటికీ.. టీమిండియా బౌలర్లు కేవలం ఒక్క వికెట్‌ను మాత్రమే తీయగలిగారు. ఫలితంగా పిచ్ ఎండిపోవడంతో ట్రావిస్ హెడ్ కీలకమైన పరుగులు సాధించి.. ఆస్ట్రేలియాకు ఆధిక్యం వచ్చేలా చేశాడు. భారత బ్యాటింగ్ విషయానికి వస్తే.. రెండురోజు రాత్రి వరకు రెండో ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు కోల్పోయింది. గెలుపు ఓటములకు ఇదే ప్రధాన కారణంగా మారింది.
గతేడాది వన్డే ప్రపంచకప్ నుంచి ఆస్ట్రేలియా బ్యాటర్ ట్రావిస్ హెడ్ షార్ట్ బాల్స్ ఆడేందుకు ఇబ్బందిపడుతున్నట్లుగా క్రికెట్ పండితులు పేర్కొంటున్నారు. భారత బౌలర్లు హెడ్ క్రీజులో ఉన్న సమయంలో లెంగ్త్‌లో బౌలింగ్ చేశారు. ఆస్ట్రేలియా పిచ్‌పై భారత బౌలర్లు ష్టార్పిచ్ బంతులను వేసి.. ఆసిస్ బ్యాటర్‌పై ఒత్తిడిని పెంచలేకపోయారు. దాంతో హెడ్ అద్భుతంగా సెంచరీని సాధించాడు. ఆస్ట్రేలియా విజయంలో హెడ్ ఇన్నింగ్స్ కీలక మలుపు. అతడు చేసిన 140 పరుగులు.. విజయానికి, ఓటమికి భారీ తేడా ఉన్నది.
భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 180 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్‌లో దాదాపుగా 33 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయింది. స్వింగ్ బౌలింగ్‌లో ఎదుర్కోవడంలో భారత జట్టు విఫలమైంది. తొలి రోజు భారత బౌలర్లు స్టంప్స్ టూ స్టంప్స్ 6శాతం మాత్రమే బౌలింగ్ చేశారు. దాంతో ఆస్ట్రేలియా ఎక్స్ట్రాల్లో పరుగులు సాధిస్తూ వచ్చింది. ఆస్ట్రేలియా బ్యాటర్లు సద్వినియోగం చేసుకొని పరుగులు రాబట్టగలిగారు.
భారత్ 180 పరుగులకు తొలి ఇన్నింగ్స్‌లో ఆలౌట్ కాగా.. ఆస్ట్రేలియా 337 పరుగులు చేసింది. దాంతో 157 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. రెండోరోజు భారత జట్టు బౌలింగ్‌కు వచ్చిన సమయంలో బుమ్రా రాణించాడు. మరో వైపు నుంచి మిస్టరీ బౌలర్‌కు సహకారం దొరకలేదు. సిరాజ్ నాలుగు వికెట్లు తీసినా.. పరుగులు ధారాళంగా సమర్పించుకున్నాడు. అదే సమయంలో హర్షిత్ రాణా ఏమాత్రం ఆకట్టుకోలేకపోయాడు. 16 ఓవర్లు వేసిన హర్షిత్ రాణా ఏకంగా 86 పరుగులు ఇచ్చాడు. ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్‌ను కాదని హర్షిత్ రాణాను తీసుకోవడం భారత్ తీసుకున్న నిర్ణయం తప్పని తేలింది.